Diet For Thyroid Health | ప్రస్తుత కాలంలో చాలా మంది థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. థైరాయిడ్ ఉన్న మహిళల్లో సంతానలేమి సమస్య కూడా వస్తోంది. థైరాయిడ్ రెండు రకాలుగా ఉంటుందన్న విషయం తెలిసిందే. థైరాక్సిన్ అనే హార్మోన్ ఎక్కువగా స్రవిస్తే హైపర్ థైరాయిడిజం సమస్య వస్తుంది. అదే తక్కువగా ఉత్పత్తి చేస్తే హైపో థైరాయిడిజం వస్తుంది. అయితే ఈ రెండు రకాల థైరాయిడ్లకు చెందిన లక్షణాలు కొన్ని కామన్‌గా ఉంటాయి. ఈ క్రమంలోనే థైరాయిడ్ ఉన్నవారు డాక్టర్ సూచన మేరకు మందులను వాడాల్సి ఉంటుంది. అలాగే ఆహారం విషయంలోనూ అనేక మార్పులు చేసుకోవాలి. థైరాయిడ్ సమస్య కంట్రోల్లో ఉండాలంటే మందులు ఎంత కీలకమో, డైట్ కూడా అంతే ముఖ్య పాత్ర పోషిస్తుందని వైద్యులు చెబుతున్నారు.
థైరాయిడ్ ఉన్నవారు పండ్లు, కూరగాయలు, చికెన్, తృణ ధాన్యాలు వంటి ఆహారాలను అధికంగా తినాలి. అలాగే ప్రాసెస్ చేయబడిన ఆహారాలు, రీఫైన్డ్ ఆహారాలు, అధిక చక్కెర, నూనె కలిగిన ఆహారాలను మితంగా తినాలి. లేదా పూర్తిగా మానేయాలి. రోజుకు తగినన్ని నీళ్లను తాగాల్సి ఉంటుంది. దీని వల్ల జీవక్రియలు సక్రమంగా నిర్వహించబడతాయి. థైరాయిడ్ పనితీరుకు అవసరం అయ్యే పోషకాలు కలిగిన ఆహారాలను తినాలి. థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తికి గాను అయోడిన్ అధికంగా అవసరం అవుతుంది. కనుక థైరాయిడ్ ఉన్నవారు అయోడిన్ ఉండే ఆహారాలను తింటే ఈ సమస్య అదుపులో ఉంటుంది. సాధారణంగా చాలా మంది నాసిరకం ఉప్పును వాడుతారు. కానీ అలా కాదు. అయోడైజ్డ్ ఉప్పునే వాడాలి. దీని వల్ల అయోడిన్ సమృద్ధిగా లభిస్తుంది. థైరాయిడ్ అదుపులో ఉంటుంది.
సముద్రపు ఆహారాలను అధికంగా తినాలి. చేపలు, రొయ్యలు వంటి ఆహారాలను తింటే అయోడిన్ సమృద్ధిగా లభిస్తుంది. అలాగే పాలు, పెరుగు, చీజ్, పనీర్ వంటి ఆహారాలను తింటున్నా కూడా అయోడిన్‌ను పొందవచ్చు. కోడిగుడ్డు పచ్చ సొనలోనూ అయోడిన్ ఉంటుంది. రోజుకు ఒక ఉడకబెట్టిన గుడ్డును తింటున్నా కూడా మేలు జరుగుతుంది. థైరాయిడ్ గ్రంథి పనితీరుకు సెలీనియం కూడా ఎంతగానో సహాయం చేస్తుంది. ఇది మనకు ఎక్కువగా బ్రెజిల్ నట్స్‌లో లభిస్తుంది. రోజుకు కనీసం 2 నుంచి 3 బ్రెజిల్ నట్స్‌ను నీటిలో నానబెట్టి తింటే థైరాయిడ్ పనితీరు మెరుగు పడుతుంది. ట్యూనా, సార్డైన్స్ వంటి చేపలను తింటున్నా కూడా ఉపయోగం ఉంటుంది. శనగలను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇది సెలీనియం పరిమాణాన్ని పెంచుతుంది. పొద్దు తిరుగుడు విత్తనాలు, చికెన్, పుట్ట గొడుగులను తింటున్నా కూడా సెలీనియంను పొందవచ్చు. దీంతో థైరాయిడ్ సమస్య తగ్గుతుంది.
థైరాయిడ్ పనితీరు సరిగ్గా ఉండాలంటే జింక్ లభించే ఆహారాలను కూడా తినాల్సి ఉంటుంది. జింక్ మనకు ఎక్కువగా ఆల్చిప్పలు, చికెన్, గుమ్మడికాయ విత్తనాలు, శనగలు, బీన్స్, పెరుగు, జీడిపప్పు, బాదంపప్పులో లభిస్తుంది. వీటిని తింటున్నా కూడా ఎంతగానో ఉపయోగం ఉంటుంది. ఐరన్ వల్ల థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగు పడుతుంది. ఐరన్ మనకు ఎక్కువగా మటన్, చికెన్, చేపలు, పాలకూర, మెంతి ఆకులు, రాజ్మా, నల్ల శనగలు, గుమ్మడికాయ విత్తనాల్లో లభిస్తుంది. బీట్రూట్, యాపిల్, క్యారెట్, టమాటా, స్ట్రాబెర్రీ వంటి వాటిని కూడా తినవచ్చు. పలు రకాల బి విటమిన్లు ఉండే ఆహారాలను తింటున్నా కూడా థైరాయిడ్ పనితీరు మెరుగవుతుంది. విటమిన్లు బి2, బి3, బి6, బి12, ఫోలేట్ ఉండే చేపలు, కోడిగుడ్లు, పాలు, పాల ఉత్పత్తులు, పప్పు దినుసులు, నట్స్, విత్తనాలు, ఆకు పచ్చని కూరగాయలు, ఆకుకూరలు, తృణ ధాన్యాలను తింటుండాలి. ఇవన్నీ థైరాయిడ్ సమస్య ఉన్నవారికి ఎంతగానో మేలు చేస్తాయి.