Mohammad Siraj : హైదరాబాద్ గల్లీల్లో క్రికెట్ ఓనమాలు నేర్చుకున్న మహమ్మద్ సిరాజ్ (Mohammad Siraj) చూస్తుండగానే భారత పేస్ దళంలో ఒకడిగా స్థిరపడిపోయాడు. ముఖ్యంగా టెస్టుల్లో బౌలింగ్ భారాన్ని మోస్తూ.. నమ్మదగిన పేస్ అస్త్రంగా అవతరించాడు. ఆటో డ్రైవర్ కుమారుడిగా పేదరికం కష్టాలు అనుభవించిన ఈ పేసర్.. ఇప్పుడు టీమిండియా గెలుపు గుర్రంగా కితాబులందుకుంటున్నాడు. ఓవల్ టెస్టు హీరోగా దిగ్గజాల ప్రశంసలు అందుకున్న సిరాజ్ శుక్రవారం 32వ వసంతంలో అడుగుపెట్టాడు. దాంతో.. ఈ స్పీడ్‌స్టర్‌కు పుట్టిన రోజులు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. వరుసగా రెండోసారి పొట్టిప్రపంచకప్ గెలుపొందిన జట్టులో సభ్యుడైన సిరాజ్ మియా క్రికెట్ జర్నీ ఇది.
ముస్లిం కుటుంబంలో 1994లో జన్మించిన సిరాజ్ చిన్నప్పటి నుంచి ఆటల్లో ముందుండేవాడు. చదువును నిర్లక్ష్యం చేస్తూ క్రికెట్ అంటే తిరిగే అతడిని తల్లి తిట్టినా.. తండ్రి మహహ్మద్ గౌస్ వెనకేసుకొచ్చేవారు. ఆయన ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవారు. చిన్నప్పుడు సిరాజ్ స్నేహితులతో కలిసి టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడేవాడు. 19 ఏళ్లకు లెదర్ బంతి అందుకున్న అతడు.. వేగంగా బౌలింగ్ చేయడంపై దృష్టి సారించాడు. జూనియర్ స్థాయిలో బుల్లెట్ వేగంతో బౌలింగ్ చేస్తున్న సిరాజ్ దేశవాళీ క్రికెట్, ఐపీఎల్‌తో మరో మెట్టు ఎక్కాడు.
Back on Titans CAM with Humare 𝐃il 𝐒e 𝐏yaare Siraj ke liye birthday wishes! 🎂 pic.twitter.com/q5UAfbl5xl
— Gujarat Titans (@gujarat_titans) March 13, 2026
హైదరాబాద్ మాజీకోచ్ భరత్ అరుణ్ కంట్లో పడిన తర్వాత మియా భాయ్ బౌలింగ్ మరింత పదునెక్కింది. హైదరాబాద్ రంజీ జట్టుకు ఎంపికైన సిరాజ్ ఆ తర్వాత ఐపీఎల్‌తో తనను తాను మరింత మెరుగుపరచుకున్నాడు. భరత్ అరుణ్ శిక్షణకు తోడు విరాట్ కోహ్లీ స్ఫూర్తితో ఫిట్నెస్ మీద ఫోకస్ పెట్టి మంచి ఫలితాలు చవిచూశాడు సిరాజ్. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయడం.. బంతిని రెండువైపులా స్వింగ్ చేయగలగడం, కసికొద్ది బంతిని సంధించడం వంటివి.. భారత పేసర్ ప్రత్యేకతలు.
నిరుడు ఇంగ్లండ్ పర్యటనలో సిరాజ్ పేరు మార్మోగిపోయింది. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా గైర్హాజరీలో భారత పేస్ దళాన్ని అతడు నడిపించిన తీరు అద్భుతమని చెప్పాలి. ముఖ్యంగా.. సుదీర్ఘ స్పెల్ వేసిన సిరాజ్ ఓవల్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో సంచలన బౌలింగ్‌తో మ్యాచ్ విన్నర్‌గా అవతరించాడు మియా భాయ్.
HAPPY BIRTHDAY, MOHAMMED SIRAJ. 🫡
– The workhorse of team India. The hero of India in England, a two time T20 World Cup champion, one of the finest currently! 👏❤️pic.twitter.com/Krt8CkRu8D
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 13, 2026
లైన్ అండ్ లెంగ్త్‌కు నిలకడను జోడించి ఇంగ్లండ్ బ్యాటర్లను హడలెత్తించిన సిరాజ్ .. స్వదేశం వచ్చీరాగానే వెస్టిండీస్ (West Indies) బ్యాటర్ల భరతం పట్టాడు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో7 వికెట్లతో విండీస్ నడ్డివిరిచాడీ స్పీడ్‌స్టర్. తద్వారా సొంతగడ్డపై సుదీర్ఘ ఫార్మాట్ మ్యాచ్‌లో మొదటిసారి ఐదుకు పైగా వికెట్లు పడగొట్టాడు.
శ్రీలంక పాలిట విలన్ ఎవరంటే అది సిరాజ్ అనే చెప్పాలి. ఆసియా కప్ ఫైనల్లో మనోడి పేస్ పవర్‌కు చిగురుటాకులా వణికిపోయింది లంక. ప్రేమదాస స్టేడియంలో ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసి ఆదిలోనే ఆతిథ్య జట్టును దెబ్బకొట్టాడు. అదే ఊపులో మరో రెండు వికెట్లు తీసి 6/21తో కెరీర్ బెస్ట్ గణాంకాలు నమోదు చేశాడు.
Petition to spell WOW as W0WW4W! 😉#SLvIND #AsiaCupFinal | Md Sirajpic.twitter.com/5xct37j4bB
— KolkataKnightRiders (@KKRiders) September 17, 2023
రెండేళ్ల క్రితం పొట్టి ప్రపంచకప్ విజేతగా తిరిగొచ్చిన సిరాజ్.. మరోసారి టీ20 మెడల్ అందుకున్నాడు. హర్షిత్ రానా గాయపడడంతో స్క్వాడ్‌లోకి వచ్చిన అతడు.. తొలి మ్యాచ్‌లో యూఎస్ఏపై అదరగొట్టాడు. ఆ తర్వాత బుమ్రా రాకతో బెంచ్‌కే పరిమితమైనా.. స్క్వాడ్‌లో ఉన్నందుకు భారీగా ప్రైజ్‌మనీ అందుకోనున్నాడు.
టెస్టుల్లో భారత జట్టు ఆధారపడదగ్గ బౌలర్‌గా సిరాజ్ ఎదిగాడు. పనిభారం, గాయాల కారణంగా బుమ్రా ఆడనప్పుడు నేనున్నాగా అంటూ సిరాజ్ బౌలింగ్ దళాన్ని నడిపిస్తున్నాడు. కెరీర్ ఆరంభం నుంచి ఇప్పటివరకూ గాయమన్న పదమే ఎరుగని.. మియా భాయ్ సుదీర్ఘ ఫార్మాట్లో కింగ్ అనిపించుకుంటున్నాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC) సైకిల్ 2025-27లో మొదటిదైన అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీలో నిప్పులు చెరిగాడు సిరాజ్.
Official Siraj performance 🫶🏻 pic.twitter.com/IuNFrzAvJj
— Cricket Picture that Goes Hard (@HardCricketpix) July 4, 2025
అలుపెరగకుండా 185.3 ఓవర్లు బౌలింగ్ చేసిన అతడు.. 32.43 సగటుతో 23 వికెట్లు తీసి ఇంగ్లండ్ సిరీస్ విజయాన్ని అడ్డుకున్నాడు. ఓవల్ టెస్టులో చిరస్మరణీయ ప్రదర్శనతో జట్టును గెలిపించడమే కాకుండా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. అంతేకాదు.. తన సంచలన బౌలింగ్ ప్రదర్శనకు బహుమతిగా చూ ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డును ఎగరేసుకుపోయాడీ పేసర్.