Jogu Ramanna | ఆదిలాబాద్: రైతు భరోసా పంపిణీ చేయాలంటూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. ప్రభుత్వం యాసంగి పంటకు సంబంధించిన రైతు భరోసా వెంటనే పంపిణీ చేయాలంటూ ఆదిలాబాద్ రూరల్ మండలం అంకోలిలో మాజీ మంత్రి జోగు రామన్న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతుల సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు బంధు పథకాన్ని అవహేళన చేసినట్లు మాట్లాడారని ఆయన వెంటనే రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుబంధు నిధులను విడుదల చేయడంతోపాటు రైతులు పండించిన అన్ని పంటలకు బోనస్ ఇవ్వాలన్నారు. పంటలు నష్టపోయి రైతుల ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు.