ఆదిలాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ జిల్లాలో రైతులు వానకాలం సీజన్లో పత్తి పంటను సాగు చేశారు. జిల్లాలో నల్లరేగడి నేలలు ఈ పంట సాగుకు అనుకూలంగా ఉండడం ఇందుకు కారణం. పత్తి సాగు రైతులకు లాభదాయకంగా మారింది. దీంతో ఏటా జిల్లాలో పంట సాగు విస్తీర్ణం పెరుగుతుంది. గతేడాది 3,83,251 ఎకరాల్లో రైతులు తెల్ల బంగారాన్ని పండించగా ఈ ఏడాది 4,12,436 ఎకరాల్లో పంట వేశారు. గతేడాది జిల్లాలో ప్రైవేట్ వ్యాపారులు మద్దతు ధర కంటే ఎక్కువ ధర వెచ్చించి రైతుల నుంచి పంటను కొనుగోలు చేశారు. మద్దతు ధర రూ.6380 ఉంటే రూ.9 వేల వరకు చెల్లించి పంటను సేకరించారు. ఈ ఏడాది పంట కొనుగోళ్లకు అధికారులు పకడ్బందీగా ప్రణాళికలు తయారు చేశారు. కలెక్టర్ రాహుల్‌రాజ్ ఇటీవల వ్యవసాయ, మార్కెటింగ్, ఫైర్, తూనికలు, కొలతలు, సీసీఐ అధికారులతో సమావేశం నిర్వహించి పంట కొనుగోళ్లకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులు ఇబ్బందులు పడకుండా మార్కెట్‌యార్డుల్లో తాగునీరు. ఇతర సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
ఈ నెల చివరి వారంలో కొనుగోళ్లు
జిల్లాలో పత్తి కొనుగోళ్లను ఈ నెల చివరి వారంలో ప్రారంభించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ సీజన్లో 28.87 లక్షల క్వింటాళ్ల పంట మార్కెట్‌కు వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఆదిలాబాద్, బోథ్, ఇంద్రవెల్లి, ఇచ్చోడ, జైనథ్ మార్కెట్ యార్డుల పరిధిలో పది సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వం ఈ ఏడాది పత్తి క్వింటాల్‌కు రూ.7020 మద్దతు ధర ప్రకటించింది. గతేడాది క్వింటాల్‌కు రూ. 6380 ఉండగా రూ.640 పెంచింది. పంట సేకరణలో భాగంగా జిల్లాలో సీసీఐ ఆధ్వర్యంలో పది కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనున్నారు. ఆదిలాబాద్‌లో రెండు, బేల, ఇచ్చోడ, బోథ్, సొనాల, పొచ్చర, నేరడిగొండ, ఇంద్రవెల్లి, నార్నూర్‌లో మద్దతు ధరతో పంటను సేకరించనున్నారు. సీసీఐ ద్వారా కొనుగోలు చేసిన పత్తిని ప్రాసెసింగ్ చేయడానికి 14 జిన్నింగ్ మిల్లులను అధికారులు గుర్తించారు. రైతులు నుంచి దళారులు పత్తిని తక్కువ ధరకు విక్రయించకుండా వ్యవసాయ, మార్కెటింగ్, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులతో టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశారు. సీసీఐ కేంద్రాల్లో ఆధార్ ఆధారిత పంట కొనుగోళ్లు చేపట్టనున్నారు. ఇందుకోసం అధికారులు గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నారు.
ఆధార్ అథెంటిఫికేషన్ చేయించుకోవాలి
ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది సీసీఐ ఆధార్ ఆధారిత పత్తి కొనుగోళ్లు జరుగనున్నాయి. ఇందుకోసం మార్కెట్ యార్డుల్లో అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం. రైతులు తమ ఆధార్ రుజువులను విక్రయ కేంద్రాల్లో అందజేయాల్సి ఉంటుంది. ముందుగా రైతులు తమ ఆధార్ అథెంటిఫికేషన్ చేయించుకోవాలి. వేలిముద్రలు రాకుంటే ఐరిశ్, ఫేస్, ఓటీపీ, ఆధార్ క్యూఆర్ కోడ్ ద్వారా ప్రామాణికాన్ని నిర్ధారించుకునే అవకాశాలున్నాయి. జిల్లాలోని పది కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.
-శ్రీనివాస్, జిల్లా మార్కెటింగ్ అధికారి