హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): సీఐడీ విభాగంలో నేర విశ్లేషణ, సాంకేతికత కోసం క్రైమ్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఎనాలసిస్ పేరుతో ప్రత్యేక వింగ్‌ను ఏర్పాటు చేసినట్టు డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు ఎంపిక చేసిన జిల్లాల్లో ‘సేఫ్ విలేజ్’ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించనున్నట్టు వెల్లడించారు.
ఈ మేరకు రాష్ట్రంలోని పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తీవ్రమైన నేరాలు, ఆర్థిక నేరాలు, బాలలకు సంబంధించిన నేరాలపై లోతుగా చర్చించారు. రాష్ట్రంలోని ఏడు జిల్లాల పరిధిలో ‘సేఫ్ విలేజ్ ప్రోగ్రాం’ను విస్తృతంగా నిర్వహించనున్నట్టు తెలిపారు.