హాజీపూర్, నవంబర్ 20 : గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఓటరు జాబితా సవరణకు షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 20 నుంచి ఈ నెల 23వ తేదీ వరకూ ఓటరు జాబితాలను సవరించాలని ఆదేశాలిచ్చింది. 20న దరఖాస్తులు, అభ్యంతరాలను యంత్రాంగం స్వీకరించనున్నది. 21న పరిష్కరించనున్నది. 23న తుది ఓటరు జాబితా విడుదల చేసి, పోలింగ్ కేంద్రాల్లో ప్రదర్శించనున్నది. డిసెంబర్ రెండో వారంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల చేసే అవకాశమున్నది.
నెలలోగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసే వీలుంది. ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రెండు నెలల్లో రెండుసార్లు ఓటరు జాబితా సవరణ చేపడుతున్నది. సెప్టెంబర్ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర హైకోర్టు ఆదేశాలిచ్చిన విషయం విదితమే. ఆ మేరకు ఆగస్టులో ఓటరు జాబితా సవరణ చేసి.. తుది జాబితా ప్రదర్శించింది. ఎన్నికల నిర్వహణకు నామినేషన్ల పర్వం కూడా మొదలైంది. కానీ, బీసీ రిజర్వేషన్ల అంశంపై కోర్టుకు వెళ్లడం.. రిజర్వేషన్ల అమలుకు విడుదల చేసిన జీవో నంబర్ 29ను రద్దు చేస్తూ కీలక తీర్పునివ్వడంతో ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అనాలోచిత నిర్ణయాల వల్లే యంత్రాంగపై అనవసరమైన భారం పడుతుందన్న ఆరోపణలున్నాయి.
కుంటుపడిన అభివృద్ధి
2019, జనవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగగా, అదే ఏడాది ఫిబ్రవరి 2న పాలకవర్గాల బాధ్యతలు చేపట్టిన విషయం విదితమే. వీరి పద వీ కాలం 2024 ఫిబ్రవరి ఒకటిన ముగిసింది. కానీ ఇప్పటి వరకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో ప్రత్యేకాధికారుల పాలన సాగుతున్నది. జీపీలను పట్టించుకునే వారు లేక సమస్యలు పే రుకుపోతున్నాయి. అభివృద్ధి కుంటుపడింది. 15వ ఆర్థిక సంఘం నిధులు సైతం ఆగిపోయా యి. కేంద్ర, రాష్ట్ర ప్రభత్వాల నిధులు గ్రామాలకు దక్కాలంటే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.
జిల్లాలో 306 జీపీల్లో..
మంచిర్యాల జిల్లాలో 306 గ్రామ పంచాయతీలు, 2,680 వార్డులు ఉండగా, 3,76,676 మంది ఓటర్లున్నారు. ఇందుకుగాను 3,632 బ్యాలెట్ బాక్స్‌లు, 2,680 పోలింగ్ స్టేషన్లు, 7,527 మంది ఎన్నికల సిబ్బందిని ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు.