Bala Krishna | టాలీవుడ్ సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణకు మరో విశిష్ట గౌరవం లభించింది. గోవాలో గురువారం (నవంబర్ 20) గ్రాండ్‌గా ప్రారంభమైన 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ) వేడుకల్లో బాలయ్యను ప్రత్యేకంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా అభినందనలు తెలియజేశారు. గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, కేంద్ర సమాచార ప్రసారశాఖ సహాయ మంత్రి ఎల్. మురుగన్, గోవా సీఎం ప్రమోద్ సావంత్ సమక్షంలో ఈ సన్మానం జరగడం విశేషం.
సినీ పరిశ్రమలో నటుడిగా బాలకృష్ణ 50 ఏళ్ల ప్రయాణం పూర్తి చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ గౌరవం అందించారు. కార్యక్రమంలో బాలయ్య మాట్లాడుతూ.. సినిమాల్లోకి వచ్చి 50 ఏళ్లు అయిందని, వయసు గురించి అసలు అడగొద్దని అంటూ చమత్కరించారు బాలయ్య. నా 50 ఏళ్ళ ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎన్టీఆర్- బసవతారకం దంపతులకు జన్మించడం నా అదృష్టం. ఈ జర్నీలో భార్య వసుంధర సపోర్ట్ ఎంతో ఉంది. నట ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది అని బాలయ్య అన్నారు. ఇక ఇదిలా ఉంటే బాలయ్య ప్రస్తుతం అఖండ 2 చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా బోయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఇటీవల మూవీ నుండి సాంగ్ విడుదల కాగా, దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
నవంబర్ 20 నుండి 28 వరకు జరగనున్న ఇఫీ వేడుకలు దేశ–విదేశాల సినీ ప్రముఖులకు వేదికగా మారాయి. ప్రారంభ వేడుకకు బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్, హీరోయిన్ శ్రీలీల, నిర్మాత దిల్ రాజు తదితరులు హాజరై వేడుకను మరింత ప్రత్యేకం చేశారు. ఇఫీ ముగింపు కార్యక్రమంలో సూపర్ స్టార్ రజనీకాంత్‌ను కూడా సన్మానించేందుకు ప్లాన్ చేశారు. 50 ఏళ్ల సినీరంగ ప్రయాణం పూర్తి చేసుకుంటున్న రజనీకు ఈ సందర్భంగా ప్రత్యేక గౌరవం లభించనుంది.