Chia Seeds | చిన్నగా ఉన్నప్పటికీ చియా గింజలు అనేక పోషకాలను కలిగి ఉంటాయి. ఆరోగ్యకరమైన డైట్లో భాగంగా వీటిని తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. వీటిలో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. చియా గింజల్లో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. కనుక వీటిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియతో పాటు జీర్ణవ్యవస్థ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. వీటిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి వాపును తగ్గించడంలో సహాయపడతాయి. చియా గింజలు నీటిని తమ బరువుకు 10-12 రెట్లు వరకు పీల్చుకుంటాయి. కనుక వీటిని తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. అలాగే ఎక్కువసేపు పొట్ట నిండిన భావన కలిగించి బరువు నియంత్రణకు కూడా సహాయపడతాయి.
అయితే చియా గింజలు ఆరోగ్యానికి మేలు చేసేవే అయినప్పటికీ ఇవి అందరికీ సరిపోవు. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వీటిని జాగ్రత్తగా తీసుకోవాలి లేదా పూర్తిగా నివారించడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. ఎటువంటి సమస్యలతో బాధపడే వారు చియా గింజలు తీసుకునే విషయంలో జాగ్రత్త వహించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చియా గింజలు నీటిలో నానబెట్టినప్పుడు పరిమాణంలో పెరుగుతాయి. మింగడంలో ఇబ్బంది ఉన్నవారికి లేదా ఆహార నాళం సన్నగా ఉన్నవారికి ఇవి ప్రమాదకరంగా మారవచ్చు. అలాగే పొడిగా తింటే అరుదుగా ఆహారనాళం బ్లాక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ ముందుగా నీటిలో నానబెట్టే తినాలనే వైద్యులు సూచిస్తున్నారు.
చియా గింజల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కనుక IBS ఉన్న వారిలో ఇది పొట్ట ఉబ్బరం, గ్యాస్, అసౌకర్యం వంటి సమస్యలను పెంచవచ్చు. 2 టేబుల్ స్పూన్ల చియా గింజల్లో దాదాపు 10 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఒక్కసారిగా ఎక్కువ ఫైబర్ తీసుకుంటే IBS ఉన్నవారికి ఇబ్బంది కలగవచ్చు. అలాగే రక్తాన్ని పలుచగా చేసే మందులు వాడే వారు కూడా వీటిని తీసుకునే విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. చియా గింజల్లో ALA ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లం ఉంటుంది. ఇది కొంతవరకు రక్తాన్ని పలుచగా చేసే ప్రభావం కలిగించవచ్చు. అందువల్ల రక్తాన్ని పలుచగా చేసే మందులు తీసుకునే వారు ఎక్కువ పరిమాణంలో చియా గింజలు తినే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది. అదే విధంగా కొందరిలో గాస్ట్రోపారేసిస్ లేదా ఇతర జీర్ణక్రియ మొటిలిటీ వంటి సమస్యలు ఉంటాయి. చియా గింజలు నీటితో కలిసినప్పుడు జెల్లా మారతాయి. ఈ జెల్‌లాంటి ఫైబర్ జీర్ణక్రియను మరింత కష్టతరం చేయవచ్చు.
అలాగే కొంతమందికి ఈ గింజలకు అలర్జీ ఉండవచ్చు. అలాంటి వారికి చియా గింజలు తింటే అలర్జిక్ రియాక్షన్ వచ్చే అవకాశం ఉంది. చియా గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి ఫైబర్, ఒమెగా-3, పాలీఫీనాల్స్, ప్రీబయోటిక్ లాభాలు అందిస్తాయి. అయితే వీటిని తీసుకునే ముందు పరిమాణం, ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకోవడం కూడా మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. చియా గింజలను తీసుకునే సరైన పద్దతి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చియా గింజలు నీటిని ఎక్కువగా పీల్చుకుంటాయి కాబట్టి ముందుగా నానబెట్టి తినాలి. మొదట 1 టేబుల్ స్పూన్ తో ప్రారంభించాలి. నీరు, పెరుగు లేదా స్మూతీలో నానబెట్టి తీసుకోవడం మంచిది. తరువాత వీలును బట్టి నెమ్మదిగా 2 టేబుల్ స్పూన్ల వరకు పెంచుకోవచ్చు. చియా గింజలు చాలా పోషకమైన ఆహారం అయినప్పటికీ, కొన్ని ఆరోగ్య పరిస్థితులు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి లేదా పూర్తిగా నివారించడం మంచిది అని వైద్యులు సూచిస్తున్నారు.