హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): ఓఆర్ఎస్ బ్రాండ్ల పేరిట విక్రయాలను వెంటనే నిలిపేయాలని ఫుడ్‌సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) అన్ని రాష్ర్టాలు, యూనియన్ టెరిటరీలకు గురువారం ఆదేశాలు జారీ చేసింది.
మెడికల్ షాపులు, రిటైల్ ఔట్లెట్లు, ఈ కామర్స్ ప్లాట్‌ఫాంలలో ఓఆర్ఎస్ పేరిట అందుబాటులో ఉన్న టెట్రాప్యాక్ల స్టాక్‌ను వెంటనే సీజ్ చేయాలని అధికారులను ఆదేశించింది. ఆయా బ్రాండ్లపై ఓఆర్ఎస్ అని ముద్రించి.. డబ్ల్యూహెచ్‌వో సూచించిన ప్రొడక్టులు కాకుంటే వినియోగంలో లేకుండా చూడాలని కోరింది. ఓఆర్ఎస్ పేరును బ్రాండ్లపై ముద్రించవద్దని గతనెల 15న ఆదేశాలు ఇచ్చినట్టు గుర్తుచేసింది.