మంచిర్యాల అర్బన్, నవంబర్ 20 : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ నాలుగు నెలల బాలుడు మృతి చెందగా, వైద్యుడి నిర్లక్ష్యం వల్లేనంటూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వారి కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లాకు చెందిన పాలపు శేఖర్, సౌందర్య దంపతులకు నాలుగు నెలల బాబు కార్తీక్ ఉన్నాడు. ఇటీవల శేఖర్ తన భార్య, కుమారుడిని తీసుకొని అత్తగారి ఊరైన కాసిపేట మండలం దేవాపూర్‌కు వచ్చాడు. రెండు రోజుల క్రితం కార్తీక్‌కు శ్వాసకు సంబంధించిన సమస్య రాగా, మంచిర్యాలలోని బస్టాండ్ ఏరియాలోగల రాఘవేంద్ర పిల్లల హాస్పిటల్‌కు తీసుకొచ్చారు. వైద్యులు పరిశీలించి బాబును అడ్మిట్ చేసుకున్నారు. రెండు రోజుల పాటు చికిత్స అందించారు.
ఈ క్రమంలో బుధవారం రాత్రి బాబుకు కార్డియాక్ సమస్య వచ్చి మృతి చెందాడు. దీంతో ఆగ్రహించిన బాబు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు హాస్పిటల్ అద్దాలు పగులగొట్టి ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న మంచిర్యాల పట్టణ సీఐ ప్రమోద్‌రావు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫిర్యాదు చేస్తే విచారణ చేపట్టి బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని బాధిత కుటుంబ సభ్యులకు నచ్చజెప్పారు. కాగా, ఈ విషయమై డాక్టర్ సతీశ్ స్పందిస్తూ బుధవారం రాత్రి తల్లి బాబుకు పాలు పట్టిస్తున్న సమయంలో గుండెకు సంబంధించి హిడెన్ అనే సమస్య వచ్చిందని, వెంటనే చికిత్స అందించానని, మెరుగైన వైద్యం కోసం కరీంనగర్, హైదరాబాద్ నగరాల్లోని కార్డియాలజిస్ట్ వద్దకు తీసుకెళ్లాలని సూచించానని, వారు ఆలస్యం చేయడం వల్లే బాబు మృతి చెందాడని తెలిపారు.