హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. ప్రోత్సాహకాలు ఇచ్చి సాగుకు అండగా నిలవాల్సింది పోయి ఉన్న పంట పొలాలను కూడా లాక్కునేందుకు ప్రభు త్వం చేస్తున్న ప్రయత్నాలతో అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇప్పటికే రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) సహా వివిధ రహదారులు, పారిశ్రామికవాడల పేరుతో రైతుల నుంచి వేలాది ఎకరాలను సేకరిస్తున్న ప్రభుత్వం.. తాజాగా గ్రీన్‌ఫీల్డ్ హైవే కింద మళ్లీ వేలాది ఎకరాల పంట పొలాల సేకరణకు సిద్ధమైంది. ఫ్యూచర్ సిటీ-బందరు పోర్టు మధ్య ప్రతిపాదించిన 12 లేన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణానికి 5 వేల ఎకరాలకు పైగా సాగు భూములు లాక్కునేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. ఇరు రాష్ర్టాలు సంయుక్తంగా రూపొందించిన ప్రాథమిక అలైన్మెంట్ ప్రకారం ఈ రహదారి వల్ల తెలంగాణలో 40 గ్రామాల పరిధిలోని భూములు ప్రభావితం కానున్నాయి. 5 వేల ఎకరాలు అంచనా కాగా మొత్తం ఎన్ని వేల ఎకరాలు సేకరిస్తారన్నది డీపీఆర్ తయారయ్యాకే తేలనున్నది.
రాష్ట్ర పునర్విభజన చట్టంలోని హామీ ప్రకారం హైదరాబాద్-అమరావతి మధ్య ప్రతిపాదిత గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వేకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రహదారికి డీపీఆర్ రూపొందించాలని హోంశాఖ జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ (ఎంఆర్ఆర్టీహెచ్)ను ఆదేశించింది. దీంతో ఇరు రాష్ర్టాలు సంయుక్తంగా ఓ అలైన్‌మెంట్‌ను రూపొందించి ఇటీవలే కేంద్రానికి సమర్పించాయి. ఈ అలైన్మెంట్ పూర్తిగా సాగు భూములను చెరిపివేసేలా ఉన్నది. వాస్తవానికి పునర్విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం ఇరు రాష్ర్టాల రాజధానులను కలుపుతూ రహదారి నిర్మించాల్సి ఉన్నా తెలంగాణ ప్రభుత్వం దీన్ని ఫ్యూచర్‌సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్‌పోర్టు వరకు నిర్మించాలని ప్రతిపాదించింది. దీనికి కేంద్రం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది.
రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలోని ఫ్యూచర్ సిటీ నుంచి ఏపీలోని బందరు పోర్టు వరకు సుమారు 297 కి.మీ మేర 12 లేన్లతో రహదారి నిర్మించాలని నిర్ణయించారు. ప్రాథమిక అలైన్మెంట్ ప్రకారం ఈ రహదారి తెలంగాణలోని ముచ్చర్ల సమీపంలోని తిప్పారెడ్డిపల్లి వద్ద మొదలై నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి, గొట్టిముక్కల వద్ద రాష్ట్ర సరిహద్దులు దాటుతుంది. అనంతరం అమరావతి మీదుగా బందరు పోర్టు వరకు సాగుతుంది. కేంద్రం ఆదేశాల ప్రకారం, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఇందులో భాగంగా ఈ నెలాఖరులోగా కన్సల్టెంట్‌ను నియమించి డిసెంబర్‌లోగా డీపీఆర్ సిద్ధం చేయాలని భావిస్తున్నది.
ఈ రహదారి నిర్మాణం వల్ల రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల పరిధిలో దాదాపు 118 కి.మీ మేర 40 గ్రామాల్లోని భూములు ప్రభావితం కానున్నాయి. గ్రీన్‌ఫీల్డ్ రహదారి పూర్తిగా పంట పొలాల గుండానే సాగుతుంది. వేలాది ఎకరాల పచ్చని పొలాలతో పాటు అటవీ భూములు, చెరువులు, కుంటలు కనుమరుగుకానున్నాయి. 340 కి.మీ పైగా పొడవున 6 లేన్లతో ప్రతిపాదించిన ట్రిపుల్ ఆర్తో సుమారు 5 వేల ఎకరాలకుపైగా భూములు ప్రభావితమవుతున్నాయి.
ప్రస్తుతం ప్రతిపాదించిన గ్రీన్‌ఫీల్డ్ రహదారిని 12 లేన్లతో నిర్మించాలని నిర్ణయించినందున ఈ హైవేకు కూడా 5 వేల ఎకరాలకు పైగానే భూములు సేకరించాల్సి ఉంటుందని అధికారులు చెప్తున్నారు. దీంతో రంగారెడ్డి జిల్లా పరిధిలో మీర్ఖాన్పేట, తాడిపర్తి, సింగారం, నందివనపర్తి, నక్కెర్త, మేడిపల్లి, యాచారం, మల్కీజ్‌గూడ, మంది గౌరెల్లి, తక్కెళ్లపల్లి, చింతపట్ల, తుమ్మలోనిగూడ, నల్లవెల్లి, మాల్, మంతన్ గౌరెల్లి తదితర గ్రామాలతోపాటు నల్లగొండ జిల్లాలోని తుమ్మాడపల్లి, అజీలాపూర్, ఏరుగండ్లపల్లి, కొండూరు, మర్రిగూడ, రామ్‌రెడ్డిపల్లి, వట్టిపల్లి, లింగోటం, భీమనపల్లి, దామెర, చిట్టెంపహాడ్, నాంపల్లి, మొహమ్మదాపురం, ఉట్లపల్లి, తేనెపల్లె, గుర్రంపోడ్, చేవూర్, మోసంగి, తెప్పలమడుగు, హాలియా, మాచర్ల, కొంపల్లి, బోయగూడెం, రాజవరం, అడవి దేవులపల్లి గ్రామాల్లోని భూములను సేకరించాల్సిన అవసరం ఉంటుంది.
దాదాపు ఎనిమిదేండ్ల క్రితం మంజూరైన ట్రిపుల్ఆర్ ప్రాజెక్టుకే ఇంతవరకు భూసేకరణ పూర్తికాని ప్రస్తుత పరిస్థితుల్లో మరో రహదారి కోసం రైతుల నుంచి భూములు సేకరించడం దాదాపు అసాధ్యమనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. రహదారులు, పరిశ్రమలు, నీటిపారుదల ప్రాజెక్టులు తదితర అవసరాల కోసం రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో ఇప్పటికే పలుమార్లు భూములు సేకరించారు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలోని ఏ మారుమూల గ్రామంలోనైనా ఎకరం ధర రూ.2 కోట్లకు తక్కువ లేదు. నల్లగొండ జిల్లాలో సైతం ఎకరం రూ.50 లక్షలకు పైగానే ధర పలుకుతున్నది.
ఫ్యూచర్ సిటీ-బందర్ పోర్టు మధ్య గ్రీన్‌ఫీల్డ్ రహదారిని ఎన్హెచ్ఏఐ ఆధ్వర్యంలోనే నిర్మించనున్నప్పటికీ బహిరంగ మార్కెట్ ప్రకారం రైతులకు నష్ట పరిహారం చెల్లించే అవకాశం లేదు. ప్రస్తుతం అమల్లో ఉన్న భూసేకరణ చట్టం ప్రకారం గ్రామాల్లోని ఆస్తులకు రిజిస్ట్రేషన్ ధరపై నాలుగు రెట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు రెట్లు నష్టపరిహారం చెల్లిస్తారు. ప్రస్తుతం రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో భూముల రిజిస్ట్రేషన్ ధరలు ఎకరాకు రూ.5 లక్షల్లోపే ఉన్నాయి. దీని ప్రకారం రైతులకు మహా అయితే రూ.20 లక్షలకు మించి నష్టపరిహారం చెల్లించే అవకాశం లేదు. ఆ భూముల్లో ఏమైనా పంటలు, ఇతర ఆస్తులు ఉంటే వాటికి అదనంగా నష్టపరిహారం చెల్లిస్తారని, అంతా కలిపినా నష్టపరిహారం ఎకరాకు రూ.25 లక్షలలోపే ఉంటుందని అధికార వర్గాలు చెప్తున్నాయి.
ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత నష్టపరిహారాన్ని భరించి బహిరంగ మార్కెట్ ధర చెల్లించినా రైతులు భూములు ఇవ్వడం అనుమానమేనని, ఇప్పటికే ట్రిపుల్‌ఆర్‌తోపాటు, పారిశ్రామికవాడల భూబాధితులు తమ భూమికి బదులు మరో భూమి ఇవ్వాలని కోరుతున్నారని వారు ఉదహరిస్తున్నారు.
ఇప్పటికే సంగారెడ్డి, యాదాద్రి, చౌటుప్పల్ తదితర ప్రాంతాల్లో ట్రిపుల్ఆర్ భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన నిర్వహిస్తున్నా రు. అది సమసిపోకముందే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ-బందరు పోర్టు గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రతిపాదన పట్టాలెక్కుతున్నది. ఈ ఏడాది చివరికల్లా ఈ రహదారి డీపీఆర్ సిద్ధమై ప్రజలముందుకొస్తే రెండు జిల్లాల పరిధిలో అలజడి రేగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్రిపుల్ఆర్ బాధితులకు అధికారపక్షంలోని నాయకులు సైతం అండగా నిలుస్తుండటంతో ఇంతవరకు భూసేకరణ పూర్తికాలేదు. దీంతో టెండర్ల ప్రక్రియ ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్నట్టుగా ఉన్నది. ఇదేవిధంగా గ్రీన్‌ఫీల్డ్ హైవే భూసేకరణ అలైన్మెంట్ ప్రజల ముందుకురాగానే మరో ఉద్యమం తథ్యమని పలువురు విశ్లేషకులు చెప్తున్నారు.

కడ్తాల్, నవంబర్ 20: గ్రీన్‌ఫీల్డ్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు భూమికి భూమి పరిహారం అందించాలని భూ నిర్వాసితులు డిమాండ్ చేశారు. కడ్తాల్ మండలంలో చేపట్టనున్న గ్రీన్‌ఫీల్డ్ నిర్మాణంపై రైతులు నుంచి ఫిర్యాదులు అందడంతో, గురువారం మండలంలోని మర్రిపల్లిలో భూసేకరణపై భూ నిర్వాసితులతో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (భూ సేకరణ) ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భూనిర్వాసితులు మాట్లాడుతూ గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు నిర్మాణంతో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు నిర్మాణంలో భూమికి భూమి ఇవ్వని పక్షంలో భూసేకరణను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌కు రైతులు వినతిపత్రం అందజేశారు.
రంగారెడ్డి జిల్లా పరిధి : మీర్ఖాన్పేట, తాడిపర్తి, సింగారం, నందివనపర్తి, నక్కెర్త, మేడిపల్లి, యాచారం, మల్కీజ్‌గూడ, మంది గౌరెల్లి, తక్కెళ్లపల్లి, చింతపట్ల, తుమ్మలోనిగూడ, నల్లవెల్లి, మాల్, మంతన్ గౌరెల్లి
నల్లగొండ జిల్లా : తుమ్మాడపల్లి, అజీలాపూర్, ఏరుగండ్లపల్లి, కొండూరు, మర్రిగూడ, రామ్‌రెడ్డిపల్లి, వట్టిపల్లి, లింగోటం, భీమనపల్లి, దామెర, చిట్టెంపహాడ్, నాంపల్లి, మొహమ్మదాపురం, ఉట్లపల్లి, తేనెపల్లె, గుర్రంపోడ్, చేవూర్, మోసంగి, తెప్పలమడుగు, హాలియా, మాచర్ల, కొంపల్లి, బోయగూడెం, రాజవరం, అడవి దేవులపల్లి.