న్యూఢిల్లీ: పాఠశాలలో ఉపాధ్యాయుల వేధింపులు భరించ లేక విద్యార్థి ఆత్మహత్య (Student Suicide) చేసుకున్న ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకున్నది. స్కూల్ హెడ్మాస్టర్ (Headmaster) సహా ముగ్గురు ఉపాధ్యాయులను పాఠశాల యాజమాన్యం సస్పెండ్ (Suspend) చేసింది. పోలీసు విచారణకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేసింది. 16 ఏండ్ల శౌర్య పాటిల్ అనే విద్యార్థి ఢిల్లీలోని సెయింట్ కొలంబో స్కూల్లో (St Columba’s School) పదో తరగతి చదువుతున్నాడు. అయితే ఈ నెల 18 ఢిల్లీలోని మెట్రో స్టేషన్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. టీచర్ల నుంచి అవమానాలు, వేధింపులు తట్టుకోలేక ఉసురు తీసుకుంటున్నానని, వారిపై చర్యలు తీసుకోవాలని తన సూసైడ్ నోట్లో విజ్ఞప్తి చేశాడు. ‘అమ్మా నన్ను క్షమించు. స్కూల్ సిబ్బంది వేధింపులకే నేనీ పని చేస్తున్నా. మరణించాక నా అవయవాలు ఏమైనా పనికి వస్తే వాటిని అవసరమైన వారికి అమర్చండి. అమ్మా.. నీ హృదయాన్ని చాలాసార్లు బాధపెట్టా. ఇప్పుడు ఆఖరిసారిగా చేస్తున్నా’ అంటూ సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. దీంతో విద్యార్థి తండ్రి ప్రదీప్ పాటిల్ తన కుమారుడి బలవన్మరణానికి స్కూల్ హెడ్మాస్టర్ (క్లాస్ 5 నుంచి 10 వరకు) అపరాజిత పాల్, ఉపాధ్యాయులు జూలీ వర్గీస్, మను కల్రా, యుక్తి అగర్వాల్ మహాజన్ కారణమంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదుచేశారు.
ఈ నేపథ్యంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న హెడ్మాస్టర్తోపాటు ముగ్గురు ఉపాధ్యాయులను స్కూల్ ప్రిన్సిపల్ సస్పెన్షన్ వేటు వేశారు. మీపై ఎఫ్ఐఆర్ నమోదయింది. ఆరోపణల తీవ్రత దృష్ట్యా మీమ్మల్ని తక్షణమే సస్పెండ్ చేస్తున్నామని తెలిపారు. విచారణకు అందుబాటులో ఉండాలని, విచారణ ముగిసే వరకు స్కూల్‌కు రావడం కానీ, విద్యార్థులు, సిబ్బంది, పేరెంట్స్‌తో మాట్లాడటం కానీ చేయవద్దని స్పష్టం చేశారు.