ప్రైవేట్ బస్సుల యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఉపాధి కోసం వివిధ రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తుండడాన్ని ఆసరాగా చేసుకుంటున్నారు. జాతీయ రహదారి-44 మీదుగా పదుల సంఖ్యలో బస్సులు నడిపిస్తూ.. సామర్థ్యానికి మించి ప్రయాణికులను తీసుకెళ్తున్నారు. తాజాగా మంగళవారం ఉదయం జిల్లా రవాణా శాఖ అధికారులు హైదరాబాద్ నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్‌కు వెళ్తున్న మూడు ప్రైవేట్ బస్సులను పట్టుకున్నారు. ఒక బస్సులో 40 సీట్లకు 124 మంది, మరో బస్సులో 31 సీట్లకు 120, ఇంకో బస్సులో 31 సీట్లకు 52 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆ బస్సులను సీజ్ చేశారు.
– ఆదిలాబాద్, జూన్ 20(నమస్తే తెలంగాణ)
ఆదిలాబాద్, జూన్ 20 ( నమస్తే తెలంగాణ) : ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇతర రాష్ర్టాల ప్రజలకు సైతం ఉపాధిని కల్పిస్తున్నాయి. దీంతో ఉత్తరాది రాష్ర్టాల నుంచి హైదరాబాద్‌కు ఉపాధికోసం వేల సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారు. ప్రైవేటు పరిశ్రమలు, చిరువ్యాపారాలు, భవననిర్మాణ రంగంలో కార్మికులుగా పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, బిహార్ రాష్ర్టాల నుంచి నుంచి ఎక్కువ సంఖ్యలో నగరానికి వస్తుంటారు. కొందరు కుటుంబాలతో పాటు వచ్చి వారు పనిచేసే ప్రాంతా ల్లో నివాసం ఉంటారు. మరికొందరు మూడు, నాలుగు నెలలకొకసారి వారు తమ సొంత గ్రామాలకు పోయి సంపాదించిన డబ్బులను కుటుంబాల పోషణ కోసం ఇస్తు ఉంటారు. ఉత్తరాది రాష్ర్టాల ప్రజలు తమ ప్రయాణంలో భాగంగా రోడ్డు మార్గా న్ని ఎంచుకుంటారు. ఏడాదిపాటు రాకపోకలు కొనసాగుతుండగా ఎక్కువగా ప్రైవేటు బస్సుల్లో రాకపోకలు సాగిస్తారు.
32 సీట్ల బస్సుల్లో వంద మందికి పైగా ప్రయాణం
మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ర్టాల నుంచి వచ్చే బస్సుల్లో స్లీపర్‌కోచ్‌లు ఉంటా యి. వందల కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి ఉండ గా వీటిల్లో 30 నుంచి 40 వరకు సీట్ల పరిమితి ఉంటుంది. కానీ వాహనాల్లో వందకు పైగా ప్రయాణికులకు తీసుకుపోతున్నారు. ఆయా రాష్ర్టాల ప్రజ లు తమ గ్రామాలకు చేరుకోవాలంటే 24 నుంచి 26 గంటల ప్రయాణం చేయాల్సి వస్తుంది. మంగళవా రం ఉదయం జిల్లా రవాణాశాఖ అధికారులు హైదరాబాద్ నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్‌కు వెళ్తున్న మూడు ప్రైవేటు బస్సులను పట్టుకున్నారు. ఒక బస్సులో 40 సీట్ల కెపాసిటీ ఉండగా 124 మంది, మరో బస్సులో 31 సీట్లకు గాను 120 మంది, మూడో బస్సులో 31 సీట్లకు గాను 52 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆ బస్సులను సీజ్ చేసి, అందులోని ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో చేరవేశారు. బస్సుల నిర్వాహకులు ఉత్తరాది రాష్ర్టాల్లోని వివిధ ప్రాంతాలకు పోయే బస్సుల్లో సీట్లు ఉన్నాయంటూ ఫోన్లో సీట్ బుక్ చేస్తున్నారని, బస్సు వద్దకు వచ్చిన తర్వాత క్రిక్కిరిసి కూర్చోబెడుతున్నారని ప్రయాణికులు తెలిపారు. ఇందుకోసం రూ.1500 నుంచి రూ.3 వేల వరకు ఛార్జీలు తీసుకుంటున్నట్లు ప్రయాణికుల తెలిపారు. పరిమితికి మించి ప్రయాణికులు బస్సులో ఉండటం వల్ల ప్రమాదాలు జరగవచ్చని, ఎక్కువ మందిని తరిలించే బస్సుల యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని రవాణాశాఖ అధికారులు అంటున్నారు.
విస్తృతంగా తనిఖీలు చేస్తున్నాం
ఉత్తరాది రాష్ర్టాల నుంచి వివిధ ట్రావెల్స్‌కు చెందిన బస్సులు హైదరాబాద్‌కు ప్ర యాణికులను చేరవేస్తాయి. జిల్లాలోని జాతీయ రహదారిమీదుగా ఈ బస్సుల రాకపోకలు సాగుతాయి. ఒక్కో బస్సు ల్లో పరిమితికి మంచి మూడు రెట్లు ఎక్కువగా ప్రయాణికులను తీసుకెళ్తున్నారు.నిబంధనలు పాటించని ప్రైవేటు బస్సులపై చర్యలు తీసుకునేందుకు తనిఖీలు నిర్వహిస్తున్నాం. వీటిల్లో ప్రయాణించే వారు సీట్లు ఉంటేనే ప్రయాణం చేయాలని సూచిస్తున్నాం.
– పుప్పాల శ్రీనివాస్, డిప్యూటీ కమిషనర్, రవాణాశాఖ, ఆదిలాబాద్
కింద కూర్చోపెడుతున్నారు
నేను హైదరాబాద్‌లో భవన నిర్మాణ కార్మికునిగా పనిచేస్తూ ఉపాధి పొందుతున్న. సికింద్రాబాద్ నుంచి మా సొంతూరు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయపూర్‌కు వెళ్లడా నికి ప్రైవేటు బస్సు ఎక్కాను. ఏసీ బస్సు అని చెప్పి రూ. 3 వేలు తీసుకున్నారు. బస్సు ఎక్కిన తర్వాత కింద కూర్చొబెట్టారు. ఇలా ఎందుకు అని అడిగితే నీ ఇష్టం ఉంటే రా లేకపోతే లేదు అంటూ బెదిరించారు. ఆదిలాబాద్‌లో రవాణాశాఖ అధికారులు బస్సును సీజ్ చేశారు.
– మిథున్, ప్రయాణికుడు, రాయపూర్, ఛత్తీస్‌గఢ్