న్యూఢిల్లీ, నవంబర్ 26 : బంగారం ధరలు మళ్లీ రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. దేశీయంగా పెండ్లిళ్ల సీజన్ కావడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు అనూహ్యంగా డిమాండ్ నెలకొనడంతో ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం ధర రూ.1,200 ఎగబాకి రెండు వారాల గరిష్ఠ స్థాయి రూ.1.30 లక్షల పైకి చేరుకున్నది. చివరకు రూ.1,30,100గా నమోదైనట్లు ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది. అమెరికా ఫెడరల్ రిజర్వు వచ్చే నెలలో వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలుండటంతో పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్మెంట్లను సురక్షితమైన అతి విలువైన లోహాలకు మళ్లించడం వల్లనే వీటి ధరలు దూసుకుపోతున్నాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. అలాగే 99.5 శాతం స్వచ్ఛత కలిగిన గోల్డ్ కూడా అంతే స్థాయిలో అధికమై రూ.1,29,500 పలికింది. ఈ నెల 13న నమోదై రూ.1,30,900 తర్వాత ఇదే గరిష్ఠ స్థాయని పేర్కొంది. అమెరికా ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి వచ్చే నెలలో జరగనున్న ఫెడ్ సమీక్షలో వడ్డీరేట్లను పావుశాతం తగ్గించే అవకాశాలుండటం ధరలు పెరగడానికి కలిసొచ్చిందన్నారు.
వరుసగా రెండోరోజూ వెండి ధరలు పరుగులు పెట్టాయి. కిలో వెండి ఏకంగా రూ.2,300 అధికమై రూ.1,63,100 పలికింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో వెండి మరింత ప్రియమైంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ 33.50 డాలర్లు ఎగబాకి 4,164.43 డాలర్లు పలుకగా, వెండి 1.71 శాతం అధికమై 52.37 డాలర్లకు చేరుకున్నది.