Boggula Srinivas | “పవన్ కల్యాణ్ హఠావో” బుక్ రచయిత బొగ్గుల శ్రీనివాస్ మరణంపై మిస్టరీ వీడింది. ఆర్థిక లావాదేవీలలో విభేదాల కారణంగానే హత్య జరిగిందని, సుపారీ గ్యాంగ్ ఈ హత్య చేసిందని ఖమ్మం పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఖమ్మం గ్రామీణ ఏసీపీ తిరుపతి రెడ్డి వివరాలను వెల్లడించారు.
ఏపీలోని నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలోని అల్లూరుకు చెందిన బొగ్గుల శ్రీనివాస్.. గత 20 ఏళ్లుగా హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. అతనికి తన స్నేహితుడు మేకల వేణుమాధవ రెడ్డితో వ్యాపార, ఆర్థిక వ్యవహారాల్లో వివాదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా జీఎస్టీ లావాదేవీల్లో పెండింగ్‌లో ఉన్న డబ్బుల విషయమై కొందరు వ్యక్తులతో శ్రీనివాస్‌కు విభేదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే వేణుమాధవ రెడ్డి రూ.5లక్షల సుపారీ ఇచ్చి ముగ్గురు వ్యక్తులతో ఈ హత్య చేయించాడు.
ప్లాన్ ప్రకారం పెండింగ్‌లో ఉన్న డబ్బులు ఇస్తామని నమ్మబలికి శ్రీనివాస్‌ను కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. ముందుగా సిద్ధం చేసుకున్న ప్రదేశంలో కత్తులు, ఐరన్ రాడ్లతో దాడి చేసి హత్య చేశారు. అనంతరం దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఈ నెల 14వ తేదీ తెల్లవారుజామున బొగ్గుల శ్రీనివాస్ మృతదేహాన్ని కారుతో పాటు పాలేరు రిజర్వాయర్‌లో తోసేశారు. అయితే మృతదేహంపై గాయాలు ఉండటంతో కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగి దర్యాప్తు జరిపారు. కాల్ డేటా, ఆర్థిక లావాదేవీలు, సీసీటీవీ ఫుటేజీ వంటి ఆధారాలను పరిశీలించి చివరకు నిందితులను పట్టుకున్నారు.