హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసులు వేసి అభివృద్ధి పనులను అడుగడునా అడ్డుకునేందుకు యత్నించారు. ఇప్పుడు అధికార పక్షంలోకి వచ్చాక.. ‘కేసులు వేసి పనులను అడ్డుకోవడమేంటి? ప్రజాపతినిధిగా ఉండే అర్హత ఉందా?’ అంటూ దబాయిస్తున్నారు. ఇది ఆయన ద్వంద్వ నీతికి నిదర్శనమన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే అనేక అంశాల్లో మాటమార్చడమేకాదు, తన మాటలకు, ఆచరణకు పొంతన ఉండబోదని నిరూపించుకున్న ఆయన మరోమారు తన అవకాశవాదాన్ని బయటపెట్టుకున్నారు. మంచిరేవులలోని వీరభద్రస్వామి ప్రాంగణంలో శనివారం ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా మూసీ నది ప్రక్షాళన పూర్తి చేసి తీరుతామని అన్నారు.
‘ఈ ప్రాజెక్టును అడ్డుకోవాలని మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్‌రెడ్డి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు వేశారు. ఎన్నో పదవులు అనుభవించిన ఆ అక కొడుకు అభివృద్ధిని అడ్డుకునేందుకు ఎన్జీటీలో కేసు వేశారు. అభివృద్ధిని అడ్డుకునే వారికి ప్రజాప్రతినిధిగా ఉండే అర్హత ఉందా? మా అకకు ఈ వేదికగా విజ్ఞప్తి చేస్తున్నా.. కేసును వెనకి తీసుకోండి’ అంటూ దబాయింపులకు దిగారు. రేవంత్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నూతన సచివాలయం నిర్మాణానికి శ్రీకారం చుట్టగా, ఎంపీగా ఉన్న రేవంత్‌రెడ్డి అడ్డుకొనేందుకు తీవ్రంగా యత్నించారు. నూతన సచివాలయాన్ని హుస్సేన్‌సాగర్ బఫర్‌జోన్‌లో నిర్మిస్తున్నారని, పనులను నిలుపుదల చేయాలని కోరుతూ ఎన్జీటీలో ఆయనే స్వయంగా పిటిషన్ దాఖలు చేశారు. కానీ ఎన్జీటీ ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి, వచ్చిన నివేదిక ఆధారంగా సచివాలయానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ప్రజాప్రతినిధిగా ఉండి నాడు ఎన్జీటీని ఆశ్రయించిన రేవంత్‌రెడ్డి.. నేడు కేసులు ఎలా వేస్తారని ప్రశ్నించడం విస్మయం కలిగిస్తున్నది. దీనిపై సోషల్‌మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ ద్వంద్వ నీతిని నెటిజన్లు ఎండగడుతున్నారు.