సుల్తాన్‌బజార్, మార్చి 28: బీసీ రాజ్యాధికారం దిశగా ఏప్రిల్ 7న రాజకీయ కార్యాచరణ ప్రకటిస్తామని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ వెల్లడించారు. ఈ మేరకు ఆ రోజు అన్ని బీసీ సంఘాలు, పార్టీల ప్రతినిధులు, సానుభూతిపరులతో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తామని తెలిపారు. బీసీల నేతృత్వంలో రాజకీయ పార్టీని ఏర్పర్చుకొని అధికారంలోకి రావడం మినహా మరో మార్గం లేదని, ఉద్యమ దిశను అటువైపే పయనించాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ హనుమాన్ టేక్డీలోని బీసీ సాధికారత భవన్లో శనివారం పాండుయాదవ్, కాశీనాథ్ అధ్యక్షతన బీసీ కులాల ఐఖ్యవేదిక జనరల్ బాడీలో సత్యనారాయణ మాట్లాడారు. తాము కేంద్రంలో అధికారంలోకొస్తే బీసీ డిక్లరేషన్ అమలుపరిచే వాళ్లమని అసెంబ్లీ నిండు సభ సాక్షిగా సీఎం రేవంత్‌రెడ్డి తమ మోసాన్ని ఒప్పుకొన్నారని ధ్వజమెత్తారు.
ఈ నేపథ్యంలో బీసీలు సంఘటితంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. హిందూత్వ పేరుతో ఫ్యూడల్ స్వభావంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీలను అణచివేస్తున్నదని ధ్వజమెత్తారు. అన్నిరంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రగల్భాలు పలికి గద్దెనెక్కిన కాంగ్రెస్.. రెండున్నరేండ్లు దాటినా కోర్టు తీర్పు వైపుగా దిశను మళ్లించి చేతులు దులుపుకొన్నదని బీసీ నేత వీజీఆర్ నారగోని విమర్శించారు. కాంట్రాక్టుల్లో 42 శాతం రిజర్వేషన్లు తదితర హామీలనూ అమలు చేయకుండా అగ్రకుల అనుకూల పాలన కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. సమావేశంలో బీసీసీఈ ఇన్చార్జి రచయిత ఇంద్రవెల్లి రమేశ్, బీసీ సంక్షేమ సంఘం సభ్యులు గుజ్జ కృష్ణ, చీమల జగదీశ్‌యాదవ్, వేముల రామకృష్ణ, సంధ్యారాణి, విజయ్ మహేంద్ర, తదితరులు పాల్గొన్నారు.