పాలకుర్తి, మార్చి 28 : అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతల అండదండలతో కొందరు అక్రమంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల తాళాలు ధ్వంసం చేసి స్వాధీనం చేసుకున్న ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం సిరిసన్నగూడెంలో చోటుచేసుకున్నది. నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలనే ధ్యేయంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం సిరిసన్నగూడెంలో 20 ఇండ్లు నిర్మించింది. ఇంతలో అసెంబ్లీ ఎన్నికలు రావడంతో లబ్ధిదారుల ఎంపిక వాయిదా పడింది. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రెండున్నరేండ్లు గడిచినా సర్కార్ లబ్ధిదారులను ఎంపిక చేయలేదు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు ఎమ్మెల్యే అండదండలతో పలువురి నుంచి డబ్బులు వసూలు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు 20 మంది బుధవారం రాత్రి అక్రమంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల తాళాలు పగులగొట్టి స్వాధీనం చేసుకున్నారు. వీరంతా ఆర్థికంగా ఉన్నవారేనని ఆరోపణలు వినిపిస్తున్నాయి.