ఎర్రుపాలెం, ఆగస్టు 13 : దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయ, విద్యారంగ, పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యుఎస్పీసీ) ఆధ్వర్యంలో రెండో దశ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల తాసీల్దార్ సునీత ఎలిజబెత్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, పెండింగ్‌లో ఉన్న పీఆర్సీని అమలు చేయాలని, డీఏ బకాయిలను వెంటనే చెల్లించాలని, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని యుఎస్పీసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ నెల 7న మొదటి దశలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా యుఎస్పీసీ జిల్లా స్టీరింగ్ కమిటీ నాయకుడు అనుమోలు కోటేశ్వరరావు ముత్తయ్య మాట్లాడుతూ.. పీఆర్సీ గడువు ముగిసి మూడేళ్లు దాటినా ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆరు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన కోట్లాది రూపాయల బిల్లులు చెల్లింపులకు నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేయడం లేదన్నారు. ఉద్యోగులు, పెన్షనర్లకు హెల్త్ కార్డులను సక్రమంగా అమలు చేయాలని, అశాస్త్రీయంగా ఉన్న 25వ జీవోను సవరించాలని, పర్యవేక్షక పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కేజీబీవీ, మోడల్ స్కూల్, గురుకుల ఉపాధ్యాయుల సమస్యలను కూడా ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని నాయకులు కోరారు. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 19న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, 29న హైదరాబాద్‌లో మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. అప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోతే సెప్టెంబర్ మొదటి వారంలో ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమం చేపడతామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో యుఎస్పీసీ నాయకులు కంచర్ల శ్రీనివాసరావు, నుండ్రు వెంకటేశ్వరరావు, భూషణ్‌రాజ్, నీలం సైదారావు, టి. వెంకటకృష్ణ, నరాల సాంబశివరెడ్డి, సుధాకర్, ఎన్. జ్యోతి, ధనలక్ష్మి, రత్నకుమారి, నరసింహారావు, ఉపేంద్ర, సతీష్, రవికుమార్, సుబ్బారామరాజు, బాలకృష్ణ, నిరంజన్, పుల్లారావు, జి. శ్రీనివాస్, శంకర్, రామకృష్ణ, మురళి, రిటైర్డ్ ఉపాధ్యాయులు నీలం అజయ్‌కుమార్, బండారుపల్లి రాజారావు, మురళి పాల్గొన్నారు.