రాజన్న సిరిసిల్ల : తెలంగాణ ప్రాజెక్టుల ( Telangana Projects ) అనుమతుల రద్దు కుట్రను అడ్డుకోవాలని, జీఆర్ఎంబీ ( GRMB ) ఎజెండా నుంచి అంశాన్ని వెంటనే తొలగించాలని బీఆర్ఎస్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్( Boinapally Vinod Kumar ) డిమాండ్ చేశారు. తెలంగాణ హక్కులపై భంగం కలుగుతుంటే బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు మౌనంగా ఎందుకుంటున్నారని ప్రశ్నించారు.
సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య నివాసంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 18న హైదరాబాద్‌లో జరగనున్న గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (GRMB) ఎజెండా నుంచి తెలంగాణ ప్రాజెక్టుల అనుమతుల రద్దుకు సంబంధించిన అంశాన్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలోని పలు ప్రాజెక్టుల అనుమతులను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించడం, ఆ అంశాన్ని జీఆర్ఎంబీ సమావేశం ఎజెండాలో చేర్చడం తీవ్ర ఆందోళన కలిగించే విషయమని వినోద్‌కుమార్ అన్నారు. ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేస్తే తెలంగాణ రైతాంగం, సాగునీటి రంగం, రాష్ట్ర భవిష్యత్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
తెలంగాణ ఎంపీలందరూ వెంటనే ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి , తెలంగాణ ప్రాజెక్టుల అనుమతుల రద్దు అంశాన్ని తొలగించేలా ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ వేదికగా కూడా ఈ అంశంపై తెలంగాణ తరఫున గట్టిగా పోరాడాలని కోరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిపై విమర్శలు జీఆర్ఎంబీ బీఆర్ఎస్ పార్టీ బహిష్కరించాలని కోరుతోందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వినోద్‌కుమార్ విమర్శించారు.
జీఆర్ఎంబీ సమావేశాన్ని బహిష్కరించాలన్నది బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ కాదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాజెక్టుల అనుమతులను రద్దు చేస్తే రాష్ట్రంలో తీవ్ర విపత్కర పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని వినోద్‌కుమార్ హెచ్చరించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య , రాష్ట్ర మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, సెస్ డైరెక్టర్ కృష్ణ హరి, పీఏసీఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, సర్పంచ్ నర్సింహులు, సీనియర్ నాయకులు రాఘవరెడ్డి, రాజిరెడ్డి, నర్సింహారెడ్డి , కిషన్, జక్కుల నాగరాజు, మురళి పాల్గొన్నారు.