హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 28(నమస్తే తెలంగాణ): వేసవి ఆరంభంలోనే గ్రేటర్ హైదరాబాద్‌లో కరెంట్ కష్టాలు మొదలయ్యాయి. నగరంలో అప్రకటిత కరెంట్‌కోతలతో జనం అల్లాడిపోతున్నారు. ఏ నిముషానికి కరెంట్ పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో చాలాచోట్ల రోజుకు ఐదారుసార్లు కరెంట్ పోయి రావడంతో నగరవాసులు అసహనానికి గురవుతున్నారు. కొన్నిచోట్ల వోల్టేజి హెచ్చుతగ్గులతో గృహోపకరణాలు కాలిపోతున్నాయన్న ఫిర్యాదులు కూడా దక్షిణ డిస్కంకు వస్తున్నాయి. నాలుగైదురోజులుగా సాయంత్రం వర్షం కురిసి ఉష్ణోగ్రతలు కొంత తగ్గినప్పటికీ మధ్యాహ్నం వేళ ఎండలు మండిపోతూ ఉక్కపోత కూడా ఉండటంతో విద్యుత్ వినియోగం పెరుగుతూనే ఉంది. గ్రేటర్‌లోని మూడుజోన్ల పరిధిలో పది సర్కిళ్లలోని అనేక డివిజన్లలో పగలనకా, రాత్రనకా కరెంట్‌కోతలకు సమయం అంటూ లేకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ముఖ్యంగా పరీక్షల సమయం కావడంతో విద్యార్థులు , వర్క్‌ఫ్రంహోమ్ కారణంగా ఐటీ, ఇతర ఉద్యోగులు ఇంటర్నెట్ అంతరాయంతో అసహనానికి గురవుతున్నారు. గ్యాస్ కొరత కారణంగా ఇండక్షన్ స్టవ్‌లు, ఎలక్ట్రిక్ స్టవ్‌ల కారణంగా వినియోగం పెరుగుతూ లోడ్ అధికం కావడంతో ఫీడర్లు తరచూ ట్రిప్ అవుతున్నాయని సిబ్బంది చెబుతున్నారు. ఇదిలా ఉంటే మూ డు నాలుగు రోజులుగా సాయంత్రం వేళల్లో కురుస్తున్న వర్షాలకు గంటల తరబడి కరెంట్ పోతున్నదని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలాప్రాంతాల్లో కరెంట్‌కోతలపై స్థానికులు ఫ్యూజ్ ఆఫ్ కాల్‌కు ఫిర్యాదు చేసే ప్రయత్నం చేసినా స్పందన లేదని నగర ప్రజలు మండిపడుతున్నారు.
మోటర్లు కాలుతున్నయ్..
లో ఓల్టేజీతో విద్యుత్ మోటర్లు కాలిపోతున్నయి. ఎండలు ముదరక ముందే రైతులు పంటలకు నీళ్లు పెట్టుకుంటరు. ఇప్పుడు ఎవుసానికి వచ్చే కరెంట్ సరిపోత లేదు. లో ఓల్టేజీ సమస్య ఎక్కువగా ఉన్నది. కరెంట్ మోటర్లపై తీవ్ర ప్రభావం పడుతున్నది. ఫలితంగా అవి కాలిపోతున్నయి. ఈ విషయం అధికారులకు చెప్పినా పట్టించుకుంట లేరు. లో ఓల్టేజీతో కాలిపోయిన మోటర్లు రీ వైండింగ్ చేసేందుకు అడ్డగోలు పైసలు ఖర్చవుతున్నయి. రెండు మూడు సార్లు కాలిపోయిన మోటర్లు పని చేయడం లేదు. విధి లేక కొత్తవి కొంటున్నం.
– మంద తిరుపతి, గోపాల్పూర్, కరీంనగర్
పంటలకు నీరందడం లేదు
పంటలకు కరెంటు రాత్రి నుంచి సాయంత్రం నాలుగు గంటల దాకా ఉండేది. ఇప్పుడు ఎక్కువసార్లు కరెంటు పోతున్నది. మళ్లీ కరెంట్ రావడానికి ఎక్కువ టైం పడుతున్నది. ఎండలకు పంటలకు నీళ్లు ఎక్కువ అవసరమైతానయి. కరెంటు కోతల వల్ల సరిపడా నీళ్లు పారడంలేదు. కరెంటు కట్ చేసి ఇవ్వడం వల్ల ఒకేసారి లోడ్ ఎక్కువై ట్రాన్స్ఫార్మర్లు, మోటర్లు, స్టాటర్లు కాలిపోతున్నయి. అవసరమైనంత కరెంటు ఇస్తేనే యాసంగి పంటలు బతుకుతయి.
-పల్లెబోయిన సురేశ్, లక్ష్మీపురం, పరకాల మండలం, హనుమకొండ జిల్లా
రోజుకు ఐదారుసార్లు కట్
ఐదు ఎకరాలల్ల వరి వేసిన. కరెంటు సరిగా వస్తలేదు. రోజులో ఐదారుసార్లు పోయి వస్తున్నది. దీంతో మోటర్లు సరిగా పనిచేయడం లేదు. కరెంటు పోవుడు వచ్చుడు వల్ల మోటర్లు ఖరాబైతనాయి. ఎండల కారణంగా బోర్లళ్ల నీళ్లు తగ్గుతున్నయి. ఇప్పుడు కరెంటు సరిగా లేకుంటే పంట పండది.
-బొలగాని ఉప్పలయ్య, చీకటాయపాలెం,తొర్రూరు మండలం, మహబూబాబాద్ జిల్లా
పదేండ్లు కరెంట్ కష్టాలు లేకుండే..
కరెంటు పోవుడు వచ్చుడుతోని ఇబ్బంది అయితాంది. ఎండలు ఎక్కువయినయి. ఎకరంల వరి, ఎకరంల మొకజొ న్న వేసిన. పొట్టకు వచ్చినయి. గతంలో పదేండ్లు కరెంట్ కష్టాలు లేకుండే. ఇప్పుడు నీళ్లు అందక ఎండిపోతున్నయి. కరెంటు మం చిగ ఇచ్చి మా పంటలు కాపాడాలె.
-జాటోత్ నెహ్రూ, అమర్‌సింగ్ తండా,తొర్రూరు మండలం, మహబూబాబాద్ జిల్లా
కరెంట్ ఇవ్వకుంటే పంట ఖతమే..
కరెంటు పోయి వచ్చుడుతోని ఇబ్బంది అయితాంది. బీఆర్ఎస్ ఉన్నప్పుడు మోటరు పెట్టి వస్తే ఫుల్లుగా పారేదాక పురస్తు ఉండేది. ఇప్పుడు కరెంటు పోవుడు వచ్చుడుతోని మోటారు కాడి కి వచ్చి చూసుకోవాల్సి వస్తున్నది. వేరే పని చేసుకునుడుకు ఇబ్బంది అయితాంది. పంట చేతికి వచ్చేదాకా కరెంటు ఇట్లనే ఉంటే అంత నష్టమే అయితది.
-వజీరు బకయ్య, జఫర్‌గఢ్, జనగామ జిల్లా
తక్కువ ఓల్టేజీకి నడిచేలా వైండింగ్ చేస్తున్నం..
లో వోల్టేజీతో మోటర్లు రిపేర్‌కు వస్తున్నయి. గతంలో చిన్న చిన్న సమస్యలతో వచ్చే మోటర్ల సంఖ్య ఎక్కువగా ఉండేది. ఇటీవల గ్రామీణ ప్రాంతాల్లో ఓల్టేజీతో వ్యవసాయానికి వినియోగించే మోటార్ల వైండింగ్ కాలిపోయి రిపేరింగ్ కోసం వస్తున్నయి. గత పదేళ్లుగా తగ్గిపోయిన వైండింగ్ రిపేర్లు మళ్లీ మొదలయ్యాయి. రానున్న కరెంట్ కష్టాలను దృష్టిలో ఉంచుకొని తక్కువ ఓల్టేజీకి నడిచే విధంగానే వైండింగ్ మరమ్మతులు చేస్తున్నం
– ఆర్ కృష్ణ, మోటర్ రిపేరింగ్ సెంటర్ నిర్వాహకుడు, శివనగర్, వరంగల్
సబ్‌స్టేషన్ వద్దే కావలి కాస్తున్నం
కృష్ణకాలనీ, మార్చి 28: కాంగ్రెస్ వచ్చినంక గ్రామాల్లో కరెంట్ కష్టాలు మళ్లీ మొదలైనయ్. మా గ్రామంలో కరెంటు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియడం లేదు. నాకు పదెకరాల భూమి ఉంది. పొలానికి నీళ్లు పెట్టుకోవాలంటే రాత్రింబవళ్లు కరెంటు కోసం సబ్ స్టేషన్ వద్ద కావలి కాస్తున్నాం. రోజుకు 10 గంటలు కూడా ఇవ్వడం లేదు. పొట్టకు వచ్చిన పొలాలు ఎండిపోతున్నయి. కాంగ్రెస్ మాయమాటలు నమ్మి ఓటేసినం. కరెంట్ కోతలతో ఉకపోతకు ఇండ్లల్లో ఉండలేక చెట్ల కింద కూర్చుంటున్నం. మాకు 24 గంటలు కరెంటు ఇచ్చి ఆదుకోవాలి. – పిన్నింటి సమ్మిరెడ్డి, రైతు, దీక్షకుంట, భూపాలపల్లి మండలం
విద్యుత్ కోతతో సమస్యలు
కరీమాబాద్, మార్చి 28: ఇటీవల విద్యుత్ సమస్యలు ఎక్కువయ్యాయి. సరఫరాలో హెచ్చు తగ్గుల వల్ల పనులు ఆగిపోతున్నాయి. గంటల కొద్దీ సమస్య అలాగే ఉంటుంది. దీనికి తోడు అప్రకటిత కరెంట్ కోతలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వేసవి కాలం ప్రారంభానికి ముందే ఇలా ఉంటే మునుముందు ఎలా ఉంటుందో తలుచుకుంటేనే భయమవుతున్నది. గతంలో ఇలాంటి సమస్యలు తలెత్తలేదు.
-శరత్ చంద్ర, ఆన్లైన్ సెంటర్ నిర్వాహకుడు, వరంగల్
సమస్యల సాకుతో కరెంట్ తీస్తున్నరు
చిట్యాల, మార్చి 28 : సమస్యల సాకుతో కరెంట్ తీసేస్తున్నరు. నేను చిట్యాల మండల కేంద్రంలో సెల్ఫోన్లు రిపేరు చేస్తుంట. కరెంట్ సమస్యతో సెల్ఫోన్లు సకాలంలో రిపేరు చేసి ఇవ్వడం సాధ్యం కావడం లేదు. ఎండ పెరగడంతో కరెంట్ పోతే ఉక్కపోతకు ఉక్కిరిబిక్కిరవుతున్నం. అయినా 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తానన్న ప్రభుత్వం కోతలు పెట్టడం సరికాదు. ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోవాలి.
– చింతల రాజేందర్, మొబైల్ షాప్, చిట్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లా
కరెంట్ పోతే చెట్లకింద ఉంటున్నం
భూపాలపల్లి రూరల్, మార్చి 28 : కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక కరెంట్ కష్టాలు మొదలైనయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 24 గంటలు కరెంట్ ఉండేది. ఎలాంటి ఇబ్బంది పడలేదు. మార్చిలోనే తీవ్రంగా ఉన్న ఎండలకు చెట్ల కింద కూర్చుంటున్నం. కొన్ని రోజుల నుంచి మధ్యాహ్నం, రాత్రి సమయంలో కరెంట్ పోతున్నది. పిల్లలు పడుకోలేక ఏడుస్తున్నారు. ఇప్పుడే ఇట్లుంటే రానున్న రోజుల్లో ఎలా ఉంటుందో? కరెంట్ కోతలు లేకుండా అధికారులు చూడాలి.
– గొల్లెపెల్లి విజయలక్ష్మి, గృహిణి, సుభాష్‌కాలనీ, భూపాలపల్లి
కోతల భయంతో ఐదెకరాలే సాగు చేసిన..
పోయిన ఏడాది యాసంగిలో ఎనిమిదెకరాల్లో సాగు చేసిన. రెండు బోరుబావులు ఉన్నప్పటికీ అధికారులు కరెంటు కోతలు విధించడంతో మూడెకరాలకు పూర్తిస్థాయిలో నీరందలేదు. అందుకే ఈ ఏడాది యాసంగిలో ఐదెకరాల్లో వరి, మక్క వేసిన. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంది కరెంటు ఎప్పుడు ఉం టుందో.. ఎప్పుడు పోతుందో తెలియడం లేదు. రోజూ సాయంత్రం ఐదు గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు కరెంటు కోతలు పెడ్తున్నరు. బోరు బావుల నుంచి పంటలకు రాత్రంతా నీళ్లను పారించాలని పొలం కాడికి వెళ్లి ఆటోమెటిక్ స్టార్టర్లు ఆన్ చేసి ఇంటికొచ్చి పడుకుంటం. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 24గంటలు కరెంటు సరఫరా జరిగే ది. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతులు అన్ని విధాలుగా ఇబ్బందులు పడుతున్నరు.
– ఉర్మెల నర్సారెడ్డి, రైతు, నర్సాపూర్(డబ్ల్యూ), లక్ష్మణచాంద మండలం, నిర్మల్ జిల్లా