KTR | డబుల్ ఇంజిన్ అని కేంద్ర పాలకులు డబ్బా కొడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణలోని సింగిల్ ఇంజిన్ మోత మోగించలేదా అని ప్రశ్నించారు. తెలంగాణ కన్నా మెరుగ్గా పనిచేసిన డబుల్ ఇంజిన్ రాష్ట్రం ఉందా అని అడిగారు. దేశంలోని 28 ఇంజిన్లు పోటీపడి ఉరికితే బాగుపడమా అని ప్రశ్నించారు.
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ మెట్రోకు కేంద్రం ఎందుకు పర్మిషన్ ఇవ్వదని కేటీఆర్ ప్రశ్నించారు. ఎలక్షన్లు ఎక్కడుంటే అక్కడ మాత్రం మెట్రోలు ఇస్తున్నారని తెలిపారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ ఎక్కడుందని అడిగారు. మీతో అంటకాగని రాష్ట్రాలపై కక్షగట్టడమేనా మీ వికాసం అని ప్రశ్నించారు. మనకన్నా చిన్న దేశాలు ఎక్కడికో దూసుకెళ్లాయని చెప్పారు. మనం మాత్రం కులమతాల కొట్లాటల్లోనే ఉన్నామని అన్నారు. ఎన్నికలు రాగానే దేవుళ్ల పేర్లు చెప్పడం, అక్షింతలు పంచడం చేస్తున్నారని విమర్శించారు. పక్కా మళ్లీ తెలంగాణ పట్టాలు ఎక్కుతుందని ధీమా వ్యక్తం చేశారు.
దేశం బాగుపడాలంటే ఆ మార్పు మన ఇంటి నుంచే మొదలవ్వాలని కేటీఆర్ అన్నారు. జాతి నిర్మాణంలో తెలంగాణ పాత్ర పెద్దది అని కేటీఆర్ తెలిపారు. జీడీపీలో 5.2 శాతం వాటా మన తెలంగాణదే అని పేర్కొన్నారు. దేశాన్ని సాదుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని చెప్పారు. ఇవాళ ఉన్న సన్నాసులకు తెలివి లేదు అని విమర్శించారు. దివాళా తీసిందని కూతలు కూస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ మళ్లీ పట్టాలెక్కాలంటే సమర్థ నాయకుడు రావాలన్నారు. ప్రజలందరూ ప్రేమించే నాయకుడు కేసీఆర్ అని అన్నారు. రాబోయే రెండేళ్లు గట్టిగా పనిచేద్దాం.. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వాలిపోదామని పేర్కొన్నారు. జిల్లాలు, నియోజకవర్గాల్లో యాక్టివిటీ పెంచుదామని చెప్పారు.