ఖలీల్‌వాడి, సెప్టెంబర్ 25: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వినాయక శోభాయాత్ర ప్రారంభించే విషయంలో కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు బాహాబాహీకి దిగాయి. జెండా ఊపి శోభాయాత్రను ప్రారంభించడంపై రెండు పార్టీల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సర్వజనిక్ గణేశ్ మండలి ఆధ్వర్యంలో చేపట్టే శోభాయాత్రను గణేశ్ మండలి అధ్యక్షుడు జెండా ఊపి ప్రారంభించడం ఆనవాయితీగా వస్తున్నది.
రెండేండ్లుగా ఇందుకు భిన్నంగా సాగుతున్నది. శోభాయాత్రను ప్రారంభించే విషయంలో కాంగ్రెస్, బీజేపీ గొడవలకు దిగుతున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం కూడా మరోమారు రెండు పార్టీల శ్రేణుల మధ్య చోటుచేసుకున్న గొడవ వీధి పోరాటాన్ని తలపించింది. జెండా ఊపడానికి పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా వర్గీయులు సిగపట్లు పడ్డారు. ఇద్దరు నేతల సాక్షిగా ఇరువర్గాలు తోపులాటకు దిగాయి. నిరుడు కూడా ఇలాగే రెండు పార్టీల కార్యకర్తలు గొడవకు దిగారు.