దేశమంతా ఎదురు చూస్తున్న చిత్రాల్లో నితీశ్ తివారీ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా పౌరాణిక దృశ్యకావ్యం ‘రామాయణం’ ఒకటి. ఇందులో సీతారాములుగా సాయిపల్లవి, రణబీర్‌కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే. దాదాపుగా మూడువేల కోట్ల నిర్మాణ వ్యయంతో రెండు భాగాలుగా నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ చిత్రం దీపావళి కానుకగా విడుదల కానున్నది. ఈ సందర్భంగా మేకర్స్ ఈ సినిమా సంగీత ప్రయాణాన్ని షురూ చేశారు. సినిమాలోని తొలి పాట ‘జై జై రామ్..’ తెలుగు వెర్షన్‌ని శుక్రవారం విడుదల చేశారు.
‘అచ్యుతం కేశవం.. కృష్ణ దామోదరం.. రామ నారాయణం జానకీ వల్లభం..’ అంటూ సాగే ఈ భక్తిరసాత్మక గీతాన్ని రాకేందు మౌళి రాయగా, ఏఆర్ రెహ్మాన్ స్వరపరిచారు. దీపాలి సహాయ్, రాఘవ్ కౌశిక్ ఆలపించారు. సినిమా నుంచి విడుదలైన ఈ తొలిపాట కథలోని ఆత్మను ప్రతిబింబిస్తుందని చిత్ర నిర్మాత నమిత్ మల్హోత్రా చెప్పారు. ప్రార్థనలోని స్వచ్ఛత, ఆత్మీయతకు ప్రతిరూపం ఈపాట అని ఏఆర్ రెహమాన్ అభిప్రాయపడ్డారు. భక్తుడికి రాముడితో ఉన్న అనుబంధాన్ని వ్యక్తీకరించే పాట ఇదని గీత రచయిత రాకేందు మౌళి చెప్పారు.