జీవితం అంటే ఏమిటి? నిజమైన సుఖం ఎక్కడ ఉంది?
జీవితం అంటే ఏమిటి? నిజమైన సుఖం ఎక్కడ ఉంది? వంటి తదితర ప్రశ్నలు మడికి సింగన రచించిన వాశిష్ఠ రామాణంలోని ఒక పద్యంలోనివి. రాముడి జీవితంలోని ఒక కీలకమైన మానసిక సందర్భాన్ని ఆధారంగా చేసుకుని రాసిన పద్యం ఇది.
తెలంగాణ ప్రబంధ పరిమళం, రామచంద్రుడి ప్రశ్న
ఉ॥ చిత్తసమాకులీకరణశీలమనోరమ దైన్యసాధ్య ని
స్సత్త మహాభుజంగకులసంశ్రయగర్తసమృద్ధవల్లి దు
ర్వృత్తగృహాంతవాసిని నవీనవిలాసిని లక్ష్మి; యిట్టిసం
పత్తి సమస్తదోష భవబంధభయప్రద గాక సౌఖ్యమే
ఈ పద్యం మడికి సింగన రచించిన వాశిష్ఠ రామాయణం లోనిది. ఇది వాల్మీకి రామాయణంలా రాముడి జననం నుంచి పట్టాభిషేకం వరకు జరిగిన సంఘటనలను వరుసగా చెప్పే రామకథ కాదు. రాముడి జీవితంలోని ఒక కీలకమైన మానసిక సందర్భాన్ని ఆధారంగా చేసుకుని, జీవితం అంటే ఏమిటి? సంపద ఎందుకు దుఃఖానికి కారణమవుతుంది? కోరికలు మనిషిని ఎలా బంధిస్తాయి? నిజమైన సుఖం ఎక్కడ ఉంది? అనే ప్రశ్నలకు తాత్త్విక సమాధానాలు వెతికే రచన. దీనికి సంస్కృతంలో యోగవాశిష్ఠం, వాశిష్ఠ మహారామాయణం, జ్ఞానవాశిష్ఠం అనే పేర్లు కూడా ఉన్నాయి
మనసును కలవరపరిచే స్వభావం కలిగి (చిత్త సమాకు లీకరణ) చూడటానికి అనుభవించడానికి మనోహరంగా ఉండేది, దీనస్థితి కలిగించి సాత్త్విక స్వభావం లేనటువంటిది (దైన్య సాధ్యనిస్సత్త) మహా సర్పాల సమూహానికి ఆశ్రయమైన పుట్టలో సమృద్ధిగా పెరిగిన తీగ లాంటిది (మహాభుజంగ కుల సంశ్రయ గర్త సమృద్ధ వల్లి), దుష్టమైన నడత గలిగిన గృహాలలో నివసించేది, ఎప్పటికప్పుడు కొత్త ఆకర్షణలను విలాసాలను ప్రదర్శించేది (నవీన విలాసిని) లక్ష్మి, సమస్త దోషాలకు, సంసార బంధాలకు, భయాలకు కారణం కాకుండా సౌఖ్యం కలగజేస్తుందా అని ప్రశ్నిస్తున్నాడు శ్రీరామచంద్రుడు.
లక్ష్మి అంటే సంపద. ఆ సంపద చూడటానికి ఎంతో అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ, దాని వెనుక మనిషి మనసును అశాంతికి గురిచేసే శక్తి దాగి ఉంటుంది. సంపదపై మమకారం పెరిగితే మనిషిలో లోభం, అహంకారం, అసూయ, దురాశ వంటి దుర్గుణాలు పెరుగుతాయి. మనిషి తన సాత్త్వికతను కోల్పోయి, కొత్త కొత్త భోగవిలాసాల వెంట పరుగెత్తుతాడు. అది అందంగా కనబడే పాముల పుట్టపై పుట్టిన అందమైన తీగ. అటువంటి సంపద అనేక దోషాలకు, సంసార బంధాలకు, భయాలకు కారణమవుతుంది. అలాంటి సంపదను నిజమైన సుఖానికి మూలమని ఎలా భావించగలం? అన్నది ఈ పద్యంలోని ప్రశ్న.
– చేపూరి శ్రీరాం, హన్మకొండ
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

