నమస్తే తెలంగాణ నెట్వర్క్, మార్చి 28: సింగరేణిలో మెడికల్ బోర్డును వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ శనివారం సింగరేణి వ్యాప్తంగా టీబీజీకేఎస్ నేతృత్వంలో కార్మికులు ఆందోళనకు దిగారు. టీబీజీకేఎస్, బీఆర్ఎస్ నాయకులు భూపాలపల్లి ఏరియాలోని అంబేద్కర్ సెంటర్లో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, వరంగల్ జడ్పీ మాజీ చైర్పర్సన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి పాల్గొన్నారు.. అనంతరం టీబీజీకేఎస్, బీఆర్ఎస్ నాయకులు సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ.. నెలకు రెండు మెడికల్ బోర్డులు నిర్వహిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు వాటిని రద్దు చేసేందుకు కుట్ర చేస్తున్నదని మండిపడ్డారు. 27 నెలల కాంగ్రెస్ పాలనలో ఎన్ని మెడికల్ బోర్డులు పెట్టి ఉద్యోగాలిచ్చారో కార్మికులకు తెలుపాలని డిమాండ్ చేశారు.
టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి మాట్లాడుతూ.. సింగరేణి సంస్థకు ప్రభుత్వం ఇవ్వాల్సిన రూ. 50 వేలకోట్లను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా పరిధిలో సింగరేణి మూడు రీజియన్లలోని బొగ్గు గనులు, డిపార్టుమెంట్ల వద్ద టీబీజీకేఎస్ నాయకులు, కార్మికులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. సింగరేణిలో మెడికల్ బోర్డు, కారుణ్య నియామకాలపై డిప్యూటీ సీఎం భట్టి వ్యాఖ్యలు, కాంగ్రెస్ వైఖరిని తప్పుబట్టారు. భద్రాద్రి కొత్తగూడెంలోని అన్ని సింగరేణి ఏరియాల్లో ఆయా సంఘాల ఆధ్వర్యంలో వినూత్నంగా నిరసనలు తెలిపారు. కొత్తగూడెం పీవీకే5 గనిలో ఏఐటీయూఈసీ ఆధ్వర్యంలో కార్మికులు ముఖాలకు నల్లరిబ్బన్లు కట్టుకొని ప్లకార్డులతో ఆందోళన చేసి, బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి వినతిప త్రం అందజేశారు. ఇల్లెందులో కార్మికులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. పాత పద్ధతిలో మెడికల్ బోర్డు నిర్వహించే వరకు ఉద్యమిస్తామని టీబీజీకేఎస్ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ రంగనాథ్ అన్నారు. ఈ నెల 30న జీఎం కార్యాలయం ఎదుట జరిగే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.