LordJagannath | మహాప్రభు జగన్నాథ్ (Mahaprabhu Jagannath) అనే యానిమేషన్ సినిమా విడుదలను బ్యాన్ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. కొద్దిమంది వ్యక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయనే కారణంతో సినిమాను నిషేధిస్తే, దేశంలో ఏ కళకు, సృజనాత్మకతకు తావు ఉండదని అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది. జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఆర్. మహదేవన్ లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC) ఇప్పటికే ఈ చిత్రానికి సర్టిఫికేట్ జారీ చేసిందని, రథయాత్ర ముగిసిన తర్వాత జూలై చివరిన లేదా ఆ తర్వాతి రోజుల్లో సినిమా విడుదలను అనుమతిస్తూ తాము ఇచ్చిన ఉత్తర్వులను సవరించబోమని స్పష్టం చేసింది.
ఒక భక్తుడు ఈ సినిమా జగన్నాథ్‌ని కించపరిచేలా ఉందని బ్యాన్ చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ విచారణ జరిగింది. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. కళ స్వేచ్ఛకు భంగం కలిగిస్తే.. హిందూ దేవుళ్లు, దేవతలు లేదా పురాణాల ఆధారంగా ఎలాంటి కళారూపాలు భవిష్యత్‌లో రాకుండా నిషేధించే పరిస్థితి వస్తుందని, కబీర్ రామాయణం, వివిధ రాష్ట్రాల్లోని రామాయణాలు, టెలివిజన్లలో ప్రసారమయ్యే రామాయణ, మహాభారతాలు కూడా నిలిచిపోతాయని జస్టిస్ నాగరత్న వ్యాఖ్యానించారు. యానిమేషన్ సినిమాలు పిల్లల కోసం తీస్తారని, కళాకారులను ఇలా ఇబ్బంది పెట్టకూడదని కోర్టు పేర్కొంది. ఈ కేసుపై ఒడిశా అడ్వకేట్ జనరల్ ప్రింబర్ ఆచార్య ఆలయ కమిటీ తరఫున వాదిస్తూ, దేవుడిని యానిమేషన్ రూపంలో చూపడంపై అభ్యంతరాలు వ్యక్తం చేయగా, నిర్మాత తరఫు సీనియర్ అడ్వకేట్ దేవదత్ కామత్ వాదనలను ఖండించారు. అంతకుముందు జూలై 15న ఒడిశా హైకోర్టు ఈ సినిమా విడుదలను నిలిపివేస్తూ ఇచ్చిన స్టే ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టివేసింది.