Sonu Sood | బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఇటీవల జెన్ జీ (Gen Z) యువతపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై తాజాగా ప్రముఖ నటుడు సోనూ సూద్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. యువతను ఉద్దేశించి అవమానకరంగా మాట్లాడటం సరికాదని, ప్రజా జీవితంలో ఉన్నవారు మాటలను చాలా జాగ్రత్తగా వాడాలని ఆయన సూచించారు. ఓ మీడియా సమావేశంలో సోనూ సూద్‌ను కంగనా వ్యాఖ్యల గురించి ప్రశ్నించగా, మొదట తాను పూర్తి వ్యాఖ్యలు వినలేదని తెలిపారు. అనంతరం కంగనా యువతను ఉద్దేశించి అవమానకరమైన పదజాలం ఉపయోగించారని విలేకరులు వివరించడంతో ఆయన స్పందించారు.
ఒకవేళ ఆమె నిజంగానే అలా మాట్లాడి ఉంటే అది చాలా సిగ్గుచేటు. ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. మనం నటులుగా, ప్రజాప్రతినిధులుగా ప్రజల ప్రేమతోనే ఈ స్థాయికి వచ్చాం. ముఖ్యంగా యువత మద్దతు ఉన్నంతవరకే మన ప్రయాణం కొనసాగుతుంది. వారి సపోర్ట్ లేకుంటే ఎవరూ ఎదగలేరు. అందుకే ప్రతి ఒక్కరినీ గౌరవించాలి. ప్రజలతో మమేకమైనప్పుడే మన వృత్తికి విలువ ఉంటుంది. ప్రజలే మనకు దేవుళ్లు అని సోనూ సూద్ అన్నారు.ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన యువత నిరసనలపై స్పందించిన కంగనా రనౌత్, సోషల్ మీడియాలో చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి.
నిరసనల్లో పాల్గొన్న జెన్ జీ యువతపై ఆమె చేసిన వ్యాఖ్యలు అనేక వర్గాల నుంచి అభ్యంతరాలను ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా యువతను ఉద్దేశించి ఆమె ఉపయోగించిన పదజాలంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ వివాదంపై పలువురు రాజకీయ నాయకులు కూడా స్పందించారు. కంగనా వ్యాఖ్యలు బాధ్యతాయుతంగా లేవని, ప్రజాప్రతినిధిగా మరింత జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉందని విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా యువతను ఒకే కోణంలో చూడటం సరికాదని పలువురు అభిప్రాయపడ్డారు. తనపై వచ్చిన విమర్శలకు కంగనా కూడా ఘాటుగానే స్పందించారు. తనను విమర్శించిన వారిపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, తన సినీ ప్రయాణం, సాధించిన విజయాలను ప్రస్తావించారు. రాజకీయాల్లోకి వచ్చిన కాలం తక్కువే అయినప్పటికీ, రెండు దశాబ్దాలుగా ప్రజల మధ్యే ఉన్నానని పేర్కొన్నారు.