హైదరాబాద్ : వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే రానున్న మరో మూడు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురియ నుండటంతో 9 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఉమ్మడి కరీంనగర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు భారీ వర్షాల నేపథ్యంలో 6 జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.
భారీ వర్షాలకు ఉత్తర తెలంగాణతో పాటు నిజామాబాద్ జిల్లాలోని చెరువులు, కుంటలు అలుగుపోస్తున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వర్షాలను దృష్టిలో పెట్టుకొని జగిత్యాల జిల్లాలో పాఠశాలలకు సెలవను ప్రకటించారు. మేడిగడ్డ బ్యారేజ్‌కు వరద పొటెత్తడంతో అధికారులు గేట్ల 85 గేట్లను ఎత్తివేశారు. ఈ సీజన్లో తొలిసారిగా జూరాల ప్రాజెక్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదలారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఉదయం 6 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదయిన వర్షపాతం
వాజేడులో అత్యధికంగా వాజేడులో 16.5 సెం.మీ. ఏటూరునాగారం, 15.2, సర్వాయిపేటలో 14.3, జైపూర్‌లో 14 సెం.మీ, బెజ్జూరులో 14, సెం.మీ., కన్నాయిగూడెంలో 13 సెం.మీ., వెంకటాపురం, 12.6, ముత్తారం, మహదేవ్‌పూర్‌లో 12.2 సెం.మీ., నస్పూర్ 11.8 సెం.మీ. ఆసిఫాబాద్‌లో 11.3 సెం.మీ., సింగరేణి(రెబ్బన)లో 11.2 సెం.మీ., కాగజ్‌నగర్, మేడారంలో 10.6 సెం.మీ., సిర్పూర్(టి)లో 10.5 సెం.మీ., కౌతాలంలో 104, కాటారంలో 10.3, నెన్నెలలో 10.3 సెం.మీ. వర్షపాతం నమోదయింది.