హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అంబర్‌పేట పీఎస్ లో డిటెక్టివ్ ఎస్సై భానుప్రసాద్ వ్యవహారం పోలీస్ డిపార్ట్మెంట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బెట్టింగ్‌కు బానిసైన ఎస్సై.. సర్వీస్ రివాల్వర్‌ను అమ్మేసినట్టు తెలుస్తున్నది. రివాల్వర్ ఎక్కడుందో తెలుసుకుని, స్వాధీనం చేసుకోవాలని సీపీ ఆదేశించడంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. కానీ ఎంత ప్రశ్నించినా తుపాకీ ఏమైందో తనకు తెలియదని, పీఎస్‌లోని డ్రా నుంచి మిస్సయిందని ఎస్సై బుకాయిస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే 2020 బ్యాచ్‌కు చెందిన ఎస్సై భానుప్రకాశ్ అంబర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో క్రైమ్ విభాగంలో డిటెక్టివ్ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నాడు. తన రివాల్వర్ కనిపించడం లేదంటూ ఉన్నతాధికారికి ఫిర్యాదు చేశాడు. విచారణలో నివ్వెరపోయే వాస్తవాలు బయటకు వస్తున్నాయి.
2025 జనవరిలో ఓ చోరీ కేసులో 4 తు లాల బంగారాన్ని ఎస్సై భానుప్రకాశ్ రికవరీ చేశాడు. కానీ ఆ బంగారాన్ని బాధితులకు ఇవ్వకుండా లోక్‌అదాలత్‌లో కేసు క్లోజ్ చేయించాడు. బంగారం ఇవ్వకుండా భానుప్రకాశ్ సతాయిస్తున్నాడంటూ బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా, అతనిమీద కేసు నమోదు చేసి సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన తర్వాత ఎస్ఐ భానుప్రకాశ్ ఇటీవల అంబర్‌పేట పీఎస్‌కు వచ్చా డు. తనకు ఏపీలో గ్రూపు-2 ఉద్యోగం వచ్చిందని.. తాను అక్కడ ఉద్యోగంలో చేరుతానని అధికారులకు చెప్పాడు. స్టేషన్ లో తన వస్తువులను తీసుకోవడానికి వచ్చానని నమ్మించాడు. ఆ తర్వాత స్టేషన్ ఇన్స్పెక్టర్ వద్దకు వెళ్లి, తన డ్రాలో పెట్టిన 9ఎంఎం పిస్టల్ కనబడటం లేదని, సీసీటీవీ ఫుటేజీ చెక్ చేయాలని కోరాడు. పీఎస్ ఉన్నతాధికారి సమక్షంలో డ్రాతీసి చూడగా అందులో బుల్లెట్లు మాత్రమే దొరికాయి. సస్పెండ్ అయినప్పుడు రివాల్వర్ అప్పగించలేదని స్టేషన్లో ఆర్మ్ విభాగం అధికారులు చెప్తున్నారు. నాలుగు నెలలుగా రివాల్వర్ ఎందుకు తీసుకోలేదని కమిషనర్ సీరియస్ అయినట్టు తెలిసింది.
బెట్టింగ్‌లో రూ.80 లక్షలు కోల్పోయి!
ఎస్సైగా జాయిన్ అయినప్పటి నుంచి భానుప్రకాశ్ ఏ రోజు కూడా సరిగా డ్యూటీ చేయలేదని తోటి పోలీసులు తెలిపారు. ఈ సందర్భంలోనే అతను బెట్టింగ్ మాయలో పడి, రూ.80 లక్షల వరకు పోగొట్టుకున్నట్టు పోలీసుల అంతర్గత విచారణలో తేలినట్టు సమాచారం. ఆఖరికి సర్వీస్ రివాల్వర్‌ను కూడా అమ్మేసి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భాను ప్రకాశ్ మాత్రం గన్ గురించి తనకు తెలియదని, డ్రాలో పెట్టానని చెప్తున్నట్టు తెలిసింది.