ఉట్నూర్ రూరల్, నవంబర్ 26 : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని రాజులమడుగు గ్రామానికి చెందిన గర్భిణి టేకం జంగుబాయి (30) ప్రసవ సమయంలో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. కన్నాపూర్ జీపీ పరిధిలోని రాజులమడుగుకు చెందిన ఆనంద్‌రావు, జంగుబాయిలు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి నలుగురు సంతానం. గర్భంతో ఉన్న జంగుబాయి సోమవారం పురిటి నొప్పులు అధికం కావడంతో ఉట్నూర్ ప్రభుత్వ దవాఖానకు ఆటోలో బయలు దేరారు. పురిటినొప్పులు ఎక్కువ కావడంతో తిరిగి ఇంటికొచ్చారు.
అనంతరం జంగుబాయి మగ బిడ్డకు జన్మనిచ్చింది. రెండో బిడ్డకు ప్రసవ సమయంలో ఇబ్బందికి గురై రెండో బిడ్డకు జన్మనివ్వకుండానే తల్లి, బిడ్డలు మృతి చెందారు. మొదట ప్రసవించిన బిడ్డకు దవాఖానలో చికిత్స అందిస్తున్నారు. రాజులమడుగు గ్రామం మండల కేంద్రం నుంచి సుమారు 8 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అంబులెన్స్ వెళ్లడానికి దారి సౌకర్యంగా లేదు. దీనితోడు సెల్‌ఫోన్ మాట్లాడతాడానికి సిగ్నల్ కూడా లేదు. జంగుబాయి ఇంటి వద్దే మృతి చెందినట్లు సమాచారం ఉందని ఏజెన్సీ అదనపు వైద్యాధికారి మెస్రం మనోహర్ తెలిపారు.