కరీంనగర్ నగరపాలక సంస్థ పారిశుధ్య విభాగంలో విధుల కేటాయింపుపై దందా నడుస్తున్నట్టు వెలుగులోకి వస్తున్నది. అందులో పని చేసే సిబ్బందికి విధులు కావాలంటే ఆ విభాగంలోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, అధికారుల చేతులు తడపాల్సి వస్తున్నట్టు తెలుస్తున్నది. కాదంటే నెలల తరబడిగా కేటాయించకుండా కార్యాలయం చుట్టూ తిప్పుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఒకవేళ సిబ్బంది ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదులు చేసినా ఇప్పటి వరకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని తెలుస్తున్నది. దీంతో ఈ విభాగంలోని ఉద్యోగులు, అధికారులు ‘అంతా మా ఇష్టం’ అన్నట్టుగానే సాగుతున్నది.
కరీంనగర్ కార్పొరేషన్, మార్చి 9 : పారిశుధ్య విభాగంలో పని చేసే కార్మికులు, సిబ్బందిని ఎప్పుడైనా విధుల నుంచి తప్పించడం.. రోజుల తరబడిగా తమ చుట్టూ తిప్పుకోవడం.. అధికారుల ఇష్టం అన్నట్టుగా మారింది. విధుల నుంచి తప్పించిన కార్మికులు.. పై అధికారులకో, నేతలకో చెబితే వారు సరిగా పని చేయడం లేదన్న సాకు చూపుతున్నట్టు తెలుస్తున్నది. కనీసం ఆయా సిబ్బంది పని చేస్తున్నారా?.. లేదా? అన్న విషయాన్ని ఎక్కడా పరిశీలించే పరిస్థితి కూడా లేకుండా పోయింది. దీంతో అధికారులు ఆడింది ఆటగా అన్నట్టు సాగుతున్నది. కార్మికులు, సిబ్బంది తమ ఆరోగ్యం బాగా లేకో.. వ్యక్తిగత పనుల కోసం వారం రోజులు రాకుండా పోతే వారిని మళ్లీ విధుల్లోకి తీసుకోవాలంటే అధికారులకు ముడుపులు ఇవ్వాల్సి వస్తుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కొత్తగా ఈ విభాగంలోకి వచ్చిన ట్రాక్టర్లకు డ్రైవర్లు, కార్మికుల కేటాయింపుల్లోనూ పెద్ద ఎత్తునే ముడుపులు చేతులు మారాయన్న ఆరోపణలు ఉన్నాయి. వీటి కోసం రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు కూడా బేరసారాలు సాగాయన్న ప్రచారం జోరుగానే సాగుతోంది. కాగా, ఇప్పుడు కొత్తగా వచ్చిన 10 స్వచ్ఛ ఆటోల కేటాయింపుల విషయంలో ఇదే బేరసారాలు సాగుతున్నాయని తెలుస్తోంది. కాగా, ఇప్పటికే 20 వరకు స్వచ్ఛ ఆటోలు నగరపాలక ఆధ్వర్యంలోనే కొనసాగుతున్నాయి. వీటిని పారిశుధ్య విభాగం సిబ్బంది నిర్వహిస్తున్నారు.
వీటిల్లోనూ మార్పులు చేస్తామన్న ప్రచారం పేరుతో రూ.30 వేలకు పైగానే బేరసారాలు సాగిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే, ఈ విభాగంలో గతంలో పని చేసిన కార్మికుల్లో పలువురిని వివిధ కారణాల పేరుతో తొలగించారు. అయితే, తమ వద్ద మొదట లక్షల్లో ముడుపులు తీసుకొని విధులు కేటాయించారని, తొలగించిన తర్వాత నెలల తరబడిగా కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నా మళ్లీ కేటాయించడం లేదని ఆయా కార్మికులు వాపోతున్నారు. అయితే, ఈ విషయంలో నగరపాలక ఉన్నతాధికారులు కనీసం ఇప్పటి వరకు ఆ డబ్బులు తీసుకున్నది ఎవరు? అన్న విషయంలో విచారణ కూడా చేయడం లేదు. ముఖ్యంగా విధుల కేటాయింపు కోసం అధికారులు భారీగానే ముడుపులు తీసుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల కొందరు ఔట్ సోర్సింగ్ విధానంలో వారధి నుంచి పోస్టింగ్ వచ్చినా వారికి విధులు కేటాయించేందుకు పారిశుధ్య అధికారులు 80 వేల మేర వసూలు చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. అలాగే, పలువురు సిబ్బందికి ఇప్పటికీ విధులు కేటాయించకుండా కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ విభాగం ఎక్కువగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల చేతుల్లోనే ఉండడంతో అక్రమాలకు అడ్డుకట్ట లేకుండా పోతుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఈ విభాగంపై వస్తున్న ఆరోపణలపై దృష్టి సారిస్తే అనేక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.