కరీంనగర్ కలెక్టరేట్, మార్చి 9 : ధాన్యం సేకరణలో అధికారుల నిర్లక్ష్యాన్ని కూడా డిఫాల్టర్లపై రుద్దుతూ జరిమానా, వడ్డీ పేరిట రాక్షసుల్లా పీక్కుతింటున్నారని కరీంనగర్ జిల్లా రైస్‌మిల్లర్ల సంక్షేమ సంఘం ప్రతినిధులు మండిపడ్డారు. కొన్నేళ్లుగా తమ బాధలు ప్రభుత్వానికి విన్నవించుకునేందుకు కూడా అవకాశమివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేల వద్ద కూడా తమ గోడు వెల్లబోసుకున్నా ఫలితం లేదని వాపోయారు. ఇలాగే కొనసాగితే రైస్‌మిల్లర్ల పరిశ్రమ పూర్తిగా మూతపడడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైస్‌మిల్లర్లతో చర్చలు జరపాలని, డిఫాల్టర్ల నుంచి వసూలు చేస్తున్న 25 శాతం జరిమానా, 12 శాతం వడ్డీని మాఫీ చేయాలని, నాలుగు వాయిదాల్లో సీఎంఆర్ వసూలు చేయాలని కోరారు. లేనిపక్షంలో ఈ సీజన్లో కోటి టన్నుల ధాన్యం సేకరణకు జిల్లాలో తాము దూరంగా ఉంటామని స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం కరీంనగర్‌లోని ఆ సంఘం జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సంఘ అధ్యక్ష, కార్యదర్శులు, రాష్ట్ర నాయకులు బీ నర్సింగారావు, టీ కరుణాకర్, శ్రీధర్ మాట్లాడుతూ, మిల్లర్లపై పాలకులు అనుసరిస్తున్న తీరుపై ధ్వజమెత్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న అస్పష్టమైన విధానంతోనే రైస్‌మిల్లర్లు డిఫాల్టర్లుగా మారుతున్నారని స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లాలో మిల్లర్లు చెల్లించాల్సిన మొత్తం 400 కోట్లు కాగా, తమకు రావాల్సిన మొత్తం 1,500 కోట్ల దాకా ఉంటుందని చెప్పారు. దీనిపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. సొంత వ్యాపారం నిలిపేసి, సీఎంఆర్ మాత్రమే మరాడిస్తున్నా యంత్రాంగం మాత్రం తమపై వేధింపులు ఆపడం లేదని వాపోయారు. ఓవైపు మల్టీ నేషనల్ కంపెనీలకు రుణరాయితీలు ప్రకటిస్తున్న ప్రభుత్వం, తమ వద్ద మాత్రం ముక్కు పిండి వసూలు చేస్తున్నదని దుయ్యబట్టారు. రైతుల నుంచి పూర్తిగా ధాన్యం సేకరించేలా తమను అనేక ఇబ్బందులకు గురిచేస్తుండగా, తమ వద్ద నుంచి మరాడించిన మొత్తం ధాన్యం ఎందుకు తీసుకోవడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
రైతుల నుంచి ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులూ రాకుండా తాము అహర్నిశలు శ్రమిస్తుంటే, తరుగు ధాన్యం భారం కూడా తమపైనే వేయడం ఏమేరకు సముచితమో చెప్పాలన్నారు. రెండు సీజన్ల నుంచి సేకరించిన 80 లక్షల ధాన్యం మిల్లుల్లోనే ఉండగా, కొత్తగా మరో కోటి టన్నులు సేకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుండడం మిల్లర్లపై మరింత భారం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులకు అనుకూలంగా గైడ్‌లైన్స్ రూపొందించుకుని మిల్లర్లపై ఒత్తిడి తెస్తున్నారని, ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించలేక, అధికారుల ఒత్తిడి భరించలేక మిల్లర్లంతా నష్టాల బాట పట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా చిన్న, మధ్యతరగతి మిల్లర్లు నష్టాలను భరించలేని పరిస్థితుల్లో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, కేశవపట్నం మండలం కొత్తగట్టులోని రైస్‌మిల్లర్ తణుకు స్వప్న ఆత్మహత్యే అందుకు నిదర్శనమని ఆవేదన చెందారు. ఇదేబాటలో మరింతమంది సాగడం తథ్యమన్నారు.
పెండింగ్‌లో ఉన్న సమస్యలే తమకు ప్రాణగండంగా మారుతున్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా 3,500 మిల్లులుండగా ఇప్పటివరకు 2500 మిల్లులు మాత్రమే నడుస్తున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి మిల్లులకు పైగా మూతపడగా సుమారు లక్షకు పైగా కార్మికులు, ఇతరుల జీవనోపాధి తగ్గిందన్నారు. మిగతా వారికి కూడా రాబోయే రోజుల్లో గడ్డు పరిస్థితులు ఎదురవడం తప్పనిసరని పాలకుల వైఖరి స్పష్టం చేస్తుందన్నారు. అనంతరం ప్రజావాణిలో కలెక్టర్ చిత్రామిశ్రాను కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. తాము పడుతున్న ఇబ్బందులను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైసుమిల్లు పరిశ్రమ మూతపడకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. కొన్నేళ్లుగా తాము ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించి, నష్టాల ఊబిలో కూరుకుపోతున్న తమను గట్టెక్కించాలని కోరారు. పౌరసరఫరాల విభాగం పర్యవేక్షించే అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ను కూడా కలిసి, తమ బాధ కలెక్టర్‌కు చెప్పాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వంద మందికి పైగా రైసుమిల్లర్లు పాల్గొన్నారు.