Rahul Gandhi : జార్ఖండ్‌లో ఆందోళన చేస్తున్న విద్యార్థులపైకి పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతోపాటు టియర్ గ్యాస్ ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మండిపడ్డారు. విద్యార్థులపైకి బలప్రయోగం చేయడం ఏంటని హేమంత్ సోరెన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా గత నెల నుంచి జార్ఖండ్ రాజధాని రాంచీలో విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వంతో ఇటీవల పలుమార్లు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. విద్యార్థుల డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో సోమవారం విద్యార్థుల అసెంబ్లీ ముట్టడికి యత్నించారు.
ఈ క్రమంలో విద్యార్థులపైకి పోలీసులు లాఠీఛార్జి చేశారు. టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లు ప్రయోగించారు. దీనిపై రాహుల్ గాంధీ సోమవారం మీడియాతో మాట్లాడారు. విద్యార్థులకు నిరసన తెలియజేసి, ఆందోళన నిర్వహించే హక్కు ఉందని, శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపై బలగాల్ని ప్రయోగించడం ఏంటని రాహుల్ ప్రశ్నించారు. చర్చల ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వానికి సూచించారు. విద్యార్థుల ఆందోళనని ప్రభుత్వం అర్థం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని సూచించారు. జార్ఖండ్ ప్రభుత్వంలో కాంగ్రెస్ కూడా భాగస్వామిగా ఉండటం విశేషం. అక్కడ జేఎంఎం, ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే, అత్యధిక సీట్లు కలిగిన జేఎంఎం ఆధ్వర్యంలోనే ప్రభుత్వం కొనసాగుతోంది. కూటమిలో ఉన్నప్పటికీ రాహుల్ ప్రభుత్వ తీరును తప్పుబట్టడం విశేషం.
మరోవైపు ఢిల్లీలో సీజేపీ ఆందోళనకారులపై జరిగిన దాడి విషయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై రాహుల్ విమర్శలు చేశారు. విద్యార్థులపై దాడి చేయమని అమిత్ షా ఆదేశించారా లేదా అని ప్రశ్నించారు. ఈ విషయంలో అమిత్ షా సమాధానం చెప్పాలన్నారు. విద్యార్థులపై దాడి జరిగిన తర్వాత నుంచి అమిత్ షా పార్లమెంట్‌కు రావడం మానేశారు. దీనిపై కూడా రాహుల్ ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీతోపాటు అమిత్ షా కూడా 15 రోజులుగా సభకు ఎందుకు రావడం లేదని రాహుల్ ప్రశ్నించారు. సభకు రావడానికి ధైర్యం లేదా అంటూ నిలదీశారు.