మణుగూరు టౌన్, మార్చి 9 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు బీసీ గురుకుల బాలికల వసతిగృహంలో ఆహారం కలుషితమై 15 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటన సోమవారం చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకెళ్తే.. మణుగూరు వసతిగృహంలో మొత్తం 270మంది విద్యార్థినులు, టీచింగ్, నాన్‌టీచింగ్ కలిపి 21మంది సిబ్బంది ఉన్నారు. ఆదివారం రాత్రి హాస్టల్లో విద్యార్థినుల కోసం తయారుచేసిన ఫుడ్‌ను అందరూ తిన్నారు. సోమవారం ఉదయం 7వ తరగతి చదువుతున్న విద్యార్థినులు హర్షిత(సత్తుపల్లి), కే.రిషిత(పాల్వంచ), బి.బేబీ భవ్యశ్రీ(సందెళ్ల రామాపురం), జలజ(మణుగూరు) ఈ నలుగురు కడుపునొప్పితోపాటు వాంతులై తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని మణుగూరు వంద పడకల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
ఈ విషయం బయటికి రావడంతో డీసీవో బ్యూలారాణి హాస్టల్‌ను సందర్శించి అస్వస్థతకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. హాస్టల్లో ఉన్న విద్యార్థినులతో మాట్లాడి రాత్రి భోజనం ఏం తిన్నారు.. ఎలా ఉంది.. అని వివరాలు సేకరించారు. హాస్టల్లో వండిన భోజనం తినడం వల్లనే ఫుడ్‌పాయిజన్ అయిందని విద్యార్థినులు చెబుతుండగా, బయట నుంచి ఫుడ్ తెప్పించుకొని తింటున్నారని టీచర్లు ఆరోపిస్తున్నారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో ఆదేశాల మేరకు విద్యార్థినులకు వైద్యసేవలు అందించేందుకు వచ్చిన భద్రాచలం వైద్యసిబ్బందిని సైతం సదరు హాస్టల్ సిబ్బంది లోనికి అనుమతించకుండా సుమారు గంటసేపు బయట నిలబెట్టడం గమనార్హం. ప్రస్తుతం విద్యార్థినుల పరిస్థితి నిలకడగానే ఉందని, రాత్రి తీసుకున్న భోజనం ఫుడ్‌పాయిజన్ అయి అస్వస్థతకు గురయ్యారని వైద్యులు చెప్పారు.
విద్యార్థినులను పరామర్శించిన రేగా..
ఘటన తెలిసిన వెంటనే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు విద్యార్థినులను పరామర్శించేందుకు గురుకుల వసతిగృహానికి రాగా అక్కడున్న సిబ్బంది ఆయన్ని లోనికి అనుమతించలేదు. మణుగూరు ఆస్పత్రిలో వైద్యం పొందుతున్న విద్యార్థినులను పరామర్శించి వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు. బాధ్యులైన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సాయంత్రం మరో 11 మందికి అస్వస్థత..
మరో 11 మంది విద్యార్థినులు సోమవారం సాయంత్రం కడుపునొప్పితోపాటు వాంతులు కావడంతో హాస్టల్ సిబ్బంది వారిని కూడా మణుగూరు ప్రభుత్వ వందపడకల ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ అద్దంకి నరేశ్ ఆస్పత్రికి చేరుకొని విద్యార్థినులను పరామర్శించారు. వైద్యులను అడిగి వారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు.