అద్భుతాలేమీ జరుగలేదు! సొంతగడ్డపై 13 నెలల వ్యవధిలో రెండో వైట్‌వాష్‌ను తప్పించుకోవాలని చూసిన భారత ప్రయత్నాలేవీ ఫలించలేదు. రికార్డు ఛేదన (549)లో మరోసారి పేలవమైన బ్యాటింగ్‌తో టీమ్ఇండియా తమ టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యంత దారుణంగా ఓడింది. ప్రత్యర్థి బ్యాటర్లు గంటల తరబడి క్రీజులో నిలబడిన చోట.. మన ఆటగాళ్లు మరోసారి స్పిన్ ఉచ్చులో చిక్కుకుని విలవిల్లాడారు. దీంతో మెన్ ఇన్ బ్లూ ప్రత్యర్థికి సిరీస్‌ను కట్టబెట్టి కనీవినీ ఎరుగని అవమానకర ఓటమిని మూటగట్టుకుంది. ఈ విజయంతో 25 ఏండ్లుగా భారత ఉపఖండంలో టెస్టు సిరీస్ గెలుపు కోసం వేచిచూసిన దక్షిణాఫ్రికా.. తమ కలను సగర్వంగా నెరవేర్చుకుంది.
గువహటి: అనుకున్నదే అయింది. స్వదేశంలో భారత జట్టు మరో వైట్‌వాష్‌కు గురైంది. దక్షిణాఫ్రికాతో గువహటిలో జరిగిన రెండో టెస్టులో 408 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయం పాలైన భారత్.. 0-2తో సిరీస్‌ను కోల్పోయింది. సిరీస్ డ్రా చేసుకునే అవకాశం లేకున్నా కనీసం మ్యాచ్‌లో ఓడిపోకుండా ఉండాలంటే ఆఖరి రోజు పూర్తిగా బ్యాటింగ్ చేయాల్సిన తరుణంలో.. టీమ్ఇండియా బ్యాటర్లు మరోసారి సఫారీ ఆఫ్ స్పిన్నర్ సైమన్ హర్మర్ (6/37) స్పిన్ ఉచ్చులో చిక్కుకుని లంచ్‌కు ముందే పెట్టాబేడా సర్దుకున్నారు. ఫలితంగా రెండో ఇన్నింగ్స్‌లో 63.5 ఓవర్లలో 140 పరుగులకే కుప్పకూలి తమ టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యంత దారుణమైన ఓటమి (పరుగుల పరంగా)ని చవిచూశారు. రవీంద్ర జడేజా (87 బంతుల్లో 54, 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్ కాగా మిగిలిన బ్యాటర్లలో ఒక్కరు కూడా 20 పరుగుల మార్కును చేరుకోలేదు. దీంతో దక్షిణాఫ్రికా 2-0తో టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. మార్కో యాన్సెన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, సిరీస్‌లో 17 వికెట్లు తీసిన హర్మర్కు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ దక్కింది. ఇరుజట్ల మధ్య ఈనెల 30 నుంచి వన్డే సిరీస్ మొదలవనుంది.
ఆఖరి రోజు యాన్సెన్‌తో పాటు బౌలింగ్ దాడిని ఆరంభించిన హర్మర్.. తొలి గంటలోనే భారత ఓటమిని ఖరారుచేశాడు. ఆట మొదలయ్యాక 9వ ఓవర్లో (ఇన్నింగ్స్ 24వ)నే కుల్దీప్ (5)తో పాటు ధ్రువ్ జురెల్ (2) నూ ఔట్ చేసి సఫారీ విజయానికి బాటలు వేశాడు. డ్రింక్స్ విరామం తర్వాత అతడు.. పంత్ (13)ను పెవిలియన్‌కు పంపడంతో భారత్ 58/5తో నిలిచింది. ఈ క్రమంలో సాయి సుదర్శన్, జడేజా 16 ఓవర్ల పాటు క్రీజులో పట్టుదలగా ఆడారు. 139 బంతులాడి 14 పరుగులు చేసిన సాయిని టీ విరామం అనంతరం ముత్తుస్వామి బోల్తా కొట్టించాడు. కొద్దిసేపటికే సుందర్ (16) కూడా హర్మర్ బౌలింగ్‌లోనే మార్క్మ్క్రు క్యాచ్ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత లోయారార్డర్ కూడా పెద్దగా ప్రతిఘటించకుండానే ప్రత్యర్థికి తలొగ్గింది. లంచ్‌కు కొద్దిసేపు ముందు మహారాజ్.. జడేజా, సిరాజ్‌ను ఔట్ చేసి సఫారీలకు చరిత్రాత్మక విజయాన్ని ఖరారుచేశాడు.
తాజా ఓటమితో వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్స్ (డబ్ల్యూటీసీ) 2025-27 సైకిల్ పాయింట్ల పట్టికలో భారత జట్టు ఐదో స్థానానికి పడిపోయింది. ఈ సైకిల్లో ఇప్పటిదాకా 9 మ్యాచ్‌లు ఆడిన టీమ్ఇండియా.. 4 గెలిచి నాలుగింట్లో ఓడి ఒక మ్యాచ్‌ను డ్రా చేసుకుని పాకిస్థాన్ (4వ స్థానం) తర్వాతి స్థానంలో నిలిచింది. ఈ స్థితిలో భారత జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే ఈ సైకిల్లో ఆడబోయే మిగిలిన 9 టెస్టుల్లో కనీసం ఏడింటిలో అయినా గెలవాల్సి ఉంటుంది.
దక్షిణాఫ్రికా ఫస్ట్ ఇన్నింగ్స్: 489; భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్: 201;
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: 260/5 డిక్లేర్డ్; భారత్ రెండో ఇన్నింగ్స్: 63.5 ఓవర్లలో 140 (జడేజా 54, సుందర్ 16, హర్మర్ 6/37, మహారాజ్ 2/37)
1 పరుగుల పరంగా భారత్‌కు ఇదే అతిపెద్ద ఓటమి. గతంలో 342 రన్స్ తేడాతో ఆస్ట్రేలియా చేతిలో (2004లో) ఓడటమే ఇప్పటిదాకా రికార్డు.
2 సౌతాఫ్రికాకు టెస్టుల్లో ఇది రెండో పెద్ద (అంతకుముందు ఆస్ట్రేలియాపై 498 రన్స్) విజయం.
9 ఈ మ్యాచ్‌లో మార్క్మ్ పట్టిన క్యాచ్‌లు. టెస్టుల్లో ఒక ఫీల్డర్ ఇన్ని క్యాచ్‌లు అందుకోవడం ఇదే మొదటిసారి. గతంలో ఈ రికార్డు అజింక్యా రహానే (8) పేరిట ఉండేది.
25 ఏండ్ల తర్వాత దక్షిణాఫ్రికాకు భారత్‌లో ఇదే తొలి టెస్టు సిరీస్ విజయం. 2000 సంవత్సరంలో హ్యాన్సీ క్రానే సారథ్యంలో ఆ జట్టు సిరీస్ గెలిచింది.
భారీ అంచనాలతో భారత జట్టు హెడ్‌కోచ్ పగ్గాలు అందుకున్న గౌతం గంభీర్‌కు ఏదీ కలిసిరావడం లేదు. గౌతీ కోచ్‌గా వచ్చాక భారత జట్టుకు జరిగిన లాభం కంటే నష్టమే (ముఖ్యంగా టెస్టుల్లో) ఎక్కువ అనేది గణాంకాలు చెబుతున్న కఠోర వాస్తవం. గంభీర్ హయాంలో 19 టెస్టులాడిన భారత్.. పదింట్లో ఓడి ఏడు మాత్రమే గెలిచి రెండింటిని డ్రా చేసుకుంది. కోచ్‌గా అతడి విజయాల శాతం 36.82 మాత్రమే. కిర్‌స్టెన్, కుంబ్లే, రవిశాస్త్రి, ద్రావిడ్ హయాంలో ఉన్నత శిఖరాలకు చేరిన భారత జట్టు.. గౌతీ వచ్చాక దారుణంగా డీలాపడింది. కోచ్‌గా ప్రస్థానం ఆరంభించిన తొలినాళ్లలోనే 27 ఏండ్ల తర్వాత శ్రీలంక చేతిలో వన్డే సిరీస్ ఓటమినెదుర్కున్న టీమ్ఇండియా.. నిరుడు న్యూజిలాండ్ చేతిలో టెస్టు సిరీస్‌ను ఓడిపోవడం అతడి కెరీర్‌తో పాటు భారత క్రికెట్లోనూ ఓ మాయని మచ్చగా మిగిలింది.

ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలోనూ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని నిలబెట్టుకోలేకపోగా ఆ సిరీస్‌లోనూ దారుణ ప్రదర్శన చేసింది. ఇంగ్లండ్‌లో ఫర్వాలేదనిపించినా మళ్లీ సొంతగడ్డపై దక్షిణాఫ్రికా చేతిలోనూ వైట్‌వాష్ తప్పలేదు. స్వదేశంలో అతడు కోచ్‌గా భారత్ ఆడిన గత ఏడు మ్యాచ్‌ల్లో.. మెన్ ఇన్ బ్లూ ఏకంగా ఐదు ఓడిపోవడం గమనార్హం. గౌతీని టెస్టుల్లో తొలగించాలన్న డిమాండ్లు ఇప్పటికే ఊపందుకున్నాయి. గువహటి టెస్టు ముగిశాక విలేకరులు అడిగిన ఇదే ప్రశ్నకు అతడు సమాధానమిస్తూ.. ‘దానిపై బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుంది’ అని చెప్పాడు. తాజా ఓటముల నేపథ్యంలో బీసీసీఐ ఏం చేస్తుందనేది ఆసక్తికరం.