హైదరాబాద్, మార్చి 2 (నమస్తేతెలంగాణ): కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లు దాటినా ఆరు గ్యారెంటీలు అమలే చేయడం లేదని బీఆర్ఎస్ నేత కురవ విజయ్‌కుమార్ ప్రశ్నించారు. సోమవారం రాహుల్‌గాంధీకి ఆయన రాసిన బహిరంగలేఖను విడుదల చేశా రు. అసెంబ్లీ ఎన్నికల ముందర యూత్, బీసీ, ఎస్సీ డిక్లరేషన్ల పేరిట ఇచ్చిన హామీల ఊసే ఎందుకు ఎత్తడంలేదని ప్రశ్నించారు. ఏటా రెండు లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పి మోసం చేసిన తీరును లేఖలో ప్రస్తావించారు.
వరంగల్ డిక్లరేషన్‌లో ప్రకటించిన మేరకు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయడంలో, ఎకరాకు రూ.15 వేల చొప్పున రైతుభరోసా ఇవ్వడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని విమర్శించారు. యువతులకు స్కూటీలు, మహిళలకు రూ.2,500 చొప్పున ఇస్తామన్న హామీని ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. ఆసరా పింఛన్ల పెంపుపై దృష్టి పెట్టడమే లేదని ఆరోపించారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టాలని, తెలంగాణలోని రేవంత్ సర్కార్‌కు తగిన దిశానిర్ధేశం చేయాలని సూచించారు.