రాజన్న సిరిసిల్ల, మార్చి 2 (నమస్తే తెలంగాణ) : రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి, ఇల్లంతకుంట మండలాల్లోని పలు గ్రామాలకు సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. కేసీఆర్ సర్కార్ హయాంలో రంగనాయకసాగర్ నుంచి కాళేశ్వరం 11వ ప్యాకేజీలో చేపట్టిన ఎల్-4, ఎల్-5, ఎల్-6 కాలువలను కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోకపోవడం రైతులకు శాపంగా మారింది. కాలువ కోసం నిరుడు ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్‌లో రైతులు దీక్షలు చేపట్టగా.. మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ స్పందించి ఆరు నెలల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఏడాదైనా పూర్తి చేయకపోవడంతో 12 గ్రామాల రైతులు ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్‌లో మళ్లీ 20 రోజులుగా దీక్షలు చేస్తున్నారు. అంతేగాకుండా భిక్షాటనతో నిరసన తెలిపినా సర్కార్ కనికరించడంలేదు. దీంతోపాటు తంగళ్లపల్లి మండల కేంద్రంలోనూ రైతులు రెండు రోజులుగా దీక్షలు చేపట్టడం గమనార్హం. కెనాల్ నిర్మాణం పూర్తి చేస్తే ప్రత్యక్షంగా 10 వేల ఎకరాలు, పరోక్షంగా 20 వేల ఎకరాలకు సాగునీరు అంది రైతుల కష్టాలు తీరనున్నాయి. ఈ మూడు కెనాళ్ల నిర్మాణాలపై కాంగ్రెస్ కక్షపూరితంగా వ్యవహరించడంతో రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్, దాచారం, బోటుమీదపల్లె, చిక్కుడువానిపల్లె, రామోజీపేట, తంగళ్లపల్లి మండలం బస్వాపూర్, రామన్నపల్లె, బాలమల్లుపల్లె, అంకుసాపూర్, లక్ష్మీపూర్, పాపయ్యపల్లె, గోపాల్‌రావుపల్లె గ్రామాల్లో కెనాల్ నిర్మాణం పూర్తికాకపోవడంతో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఇప్పటికే నాట్లు వేసి సాగునీటి కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. బోర్లు ఎత్తిపోవడం, బావులు అడుగంటడంతో చేతికొచ్చే దశలో పంట ఎండిపోతుందేమోననే భయాందోళనలో ఉన్నారు.
సీఎస్, మంత్రితో మాట్లాడిన కేటీఆర్
తంగళ్లపల్లి, ఇల్లంతకుంట మండలాల్లోని 12 గ్రామాల రైతుల సాగునీటి కష్టాలపై ఇటీవలే తంగళ్లపల్లి, ఇల్లంతకుంట మండలాల ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నేతలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో ఫోన్లో మాట్లాడి సమస్యను వివరించారు. రంగనాయకసాగర్ నుంచి తంగళ్లపల్లి, ఇల్లంతకుంట మండలాలకు, మల్లన్నసాగర్ నుంచి ముస్తాబాద్ మండలం వరకు కెనాళ్ల నిర్మాణం గతంలోనే చేపట్టామని వివరించారు. భూ పరిహారంతోపాటు నిలిపివేసిన కెనాళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని కోరారు. పెండింగ్ బిల్లులు చెల్లించి కాలువలు పూర్తి చేయాలని సూచించారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించినట్టు కేటీఆర్ తెలిపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాళేశ్వరం 11వ ప్యాకేజీలో రంగనాయకసాగర్ నుంచి ఎల్ఎం 6 కాలువ ఇల్లంతకుంట మండలం దాచారం నుంచి ప్రారంభమై తాడూర్ వరకు 17.08 కిలోమీటర్ల మేర పొడవు కాలువ కాగా, ఇందులో 10 కిలోమీటర్లు పూర్తయింది. ఎల్ఎం 4 కాలువ సిద్దిపేట జిల్లాలో 5.50 కిలోమీటర్లు పొడవు కాగా, రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలో ప్రారంభమై దేశాయిపల్లి మీదుగా కస్బెకట్కూర్ వరకు 12 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. మిగిలిన పనుల భూసేకరణ కోసం కేసీఆర్ సర్కార్ హయాంలోనే రూ.3.19 కోట్లు కేటాయించగా, ప్రభుత్వం మారగానే నిధులు విడుదల చేయకపోవడంతో పనులు ఆగిపోయాయి. కాలువలు పూర్తయితే తంగళ్లపల్లి మండలంలోని 38 గొలుసుకట్టు చెరువులన్నీ నింపుకొనే అవకాశం ఉంటుంది.
ఈ చిత్రంలోని రైతు పేరు మిట్టపల్లి జవహర్‌రెడ్డి. తంగళ్లపల్లి మండలం, లక్ష్మీపూర్ గ్రామం. ఇతను నాలుగెకరాల్లో వరి సాగు చేశాడు. సాగునీటి కోసం బావి ఉండటంతోపాటు ఇటీవల రెండు బోర్లు వేశాడు. ప్రస్తుతం బావిలో నీరు తగ్గింది. ఒక బోరు కొద్ది సేపే పోస్తున్నది. ఈ రెండేండ్లలో ప్రతి యాసంగిలో సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నాడు. పంట నష్టం జరుగుతున్నది. అంతగిరి ప్రాజెక్ట్ నుంచి వచ్చే కాలువ పనులు పెండింగ్ ఉన్నాయి. కాలువ పూర్తి చేసి నీటి విడుదల చేస్తే ఈ రైతుకు సాగునీటి తిప్పలు తప్పుతాయి. ఇప్పటికే బోర్లు, బావి తవ్వకాలకు అప్పులు చేశామని, కాలువ పూర్తి చేసి సాగునీటిని అందించి ఆదుకోవాలని జవహర్‌రెడ్డి వేడుకుంటున్నాడు.
నేను 12 ఎకరాల్లో వరి వేసిన. బావిలో నీళ్లు అడుగంటుతున్నయ్. లక్షలు వెట్టి మూడు బోర్లు వేసిన. మూడు బోర్లలో ఒకటి ఎత్తిపోయింది. రెండు గంటల తరబడి పోసేవి. ఇప్పుడు గంట కూడా పోత్తలేవు. మా ఊర్లోకి వచ్చే కాలువ పూర్తయితే చెరువులు నిండి పుష్కలంగా నీళ్లు ఉండేవి. యాసంగి పంటలకు రెండేండ్లుగా కష్టాలు పడుతున్నాం. చేతికొచ్చే పంటలు మరో 15 రోజుల్లో ఎండిపోయే పరిస్థితి కన్పిస్తున్నది. ఏం చేయాలో అర్థమైతలేదు. సర్కార్ పట్టించుకొని సాగునీటి బాధలు తీర్చాలి.
– వెంకట్‌రెడ్డి, రైతు, లక్ష్మీపూర్
కేసీఆర్ సర్కార్ హయాంలోనే కేటీఆర్ ప్రత్యేక చొరవతో 95 శాతం కాలువ పనులు పూర్తయ్యాయి. భూ సేకరణ నిధులను సైతం నిల్వ ఉంచారు. 2023లోనే నిధులు అందించారు. ప్రభుత్వం మారడంతో వాటిని విడుదల చేయకపోవడంతో పనులు సాగలేదు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోలేదు. రెండేండ్లుగా కాలువల పనులను పెండింగ్‌లో పెట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు భూముల పరిహారం అందించాలి. కాలువలను త్వరగా పూర్తి చేసి పంటలను కాపాడాలి.
– మాట్ల మధు, జిల్లా సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షుడు (జిల్లెల్ల)