జెరూసలేం, మార్చి 2: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల వెనుక ముఖ్య కారణాన్ని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియోన్ సార్ బయటపెట్టారు. ఇరాన్ అణు, క్షిపణి కార్యక్రమంపై అమెరికా గడువు విధించిందని, దీనిని పట్టించుకోకుండా ఇరాన్ సమయాన్ని వృధా చేయటమే.. ఈ యుద్ధానికి దారితీసిందని అన్నారు. సోమవారం ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘అణు, క్షిపణి తయారీ కేంద్రాల్లోని కీలక భాగాల్ని, వనరులను అండర్‌గ్రౌండ్‌కు తరలించేందుకు ఇరాన్ పాలకులు సిద్ధమయ్యారు. అమెరికా, ఇజ్రాయెల్ గగనతల దాడులు చేసినా దెబ్బతీయలేని విధంగా వీటిని లోతైన భూగర్భ కేంద్రాల్లో దాచాలన్నది ఇరాన్ వ్యూహం’ అని అన్నారు. ఇరాన్‌తో చర్చల వేళ ఈ విషయాన్ని అమెరికన్లు పసిగట్టారని, ఇరాన్ టైమ్ పాస్ వ్యవహారమే ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడులకు దారితీసిందని అన్నారు.