మానవునికి మరణాన్ని మించిన భయమేముంది?
‘భక్త కవిరాజు బమ్మెర పోతరాజు’ భాగవతంలో ప్రతి స్కంధాంతంలో, భవహరమగునటుల తన నోట భావ బంధురంగా భాగవతాన్ని పలికించిన రామభద్రుని భక్తితో నుతించడం నియమంగా నిర్ణయించి నైపుణ్యంతో నిర్వహించాడు. ఈ చతుర్థ స్కంధం చివరిలో కూడా ‘కరకంఠ కార్ముక విఖండను’ని అఖండ కీర్తిని చతురతతో ఇలా కీర్తించాడు-

చ॥ సరస వచో విలాస! గుణసాగర! సాగరమేఖలా మహీ
భరణ ధురంధర ప్రకట భవ్యభుజా భుజగేంద్ర! రాజశే
ఖర! ఖరదూషణ ప్రముఖ గాఢతమః పటల ప్రచండ భా
స్కర! కరకంఠ కార్ముక విఖండన ఖేలన భక్త పాలనా!
‘రసవత్తరమైన వాక్కులను పలికే, పలికించే వాడా! కల్యాణ గుణరత్న రత్నాకరా! సముద్ర పర్యంతమైన మహీ(భూ) భారాన్ని వహించగల్గిన అహీంద్రుని (శేషుని) వంటి మహా బలిష్ఠమైన బాహుదండాలు కల్గిన వాడా! చక్రవర్తి చూడామణీ! ఖరదూషణాదుల దురహంకారమనే ఘన అంధకారాన్ని అంతమొందించే దుర్నిరీక్ష్య (చూడశక్యం గాని) దినమణీ! అవలీలగా శివ ధనుస్సును విరిచిన వీరాగ్రణీ! భక్త రక్షణ దీక్షాదక్షా! త్రిలోకాభిరామా! నీకు నమోవాకాలు!’ పోతన వంటి జీవన్ముక్త మహా భాగవతుని పవిత్ర పదపద్మాలను గట్టిగా పట్టుకున్న ముముక్షువుకి బహు యాతనామయ సంసార విముక్తి కరతలామలకమన్న ధ్వనికి సూచకంగా, ప్రరోచకంగా ఈ చంపకమాల వృత్తంలో (గుణసాగర! సాగర మేఖలా.., రాజశేఖర! ఖరదూషణ.., భాస్కర! కరకంఠ..) ‘ముక్త పదగ్రస్తం’ (ముక్తుల పాద గ్రహణం) అన్న ‘అలంకార’ విశేషం ప్రయుక్తమయింది. ముముక్షువులకు ఈ ఒక్క అలంకారం ‘నాలం వా’ (చాలదా)?
జీవుని అనాది అవిద్యా (అజ్ఞాన) భంజక (వినాశక)ము, హృద్యమైన ఆత్మవిద్యా అభివ్యంజకము అయిన పురంజనోపాఖ్యానాన్ని అమాత్యుడు పోతన సహృదయ హృదయ రంజకంగా అనువదించాడు. ‘సంసారే కిం సారం కంసారేః చరణ కమల పరిభజనం’ అని ‘శ్రీకృష్ణ కర్ణామృతం’లో లీలాశుకుని సూక్తి. సారం లేని ఈ సంసారంలో కంసారి శ్రీకృష్ణుని పరిసేవనమే సారం! నారద ఉవాచ- ప్రాచీన బర్హి మహారాజా! తన విభుడు, నిత్యసఖుడు, ఆత్మేశ్వరుడు అయిన అవిజ్ఞాతుని-కంసారి (కృష్ణు)ని విస్మరించి కేవలం సంసారంలోనే (అనాత్మ కర్మలలోనే) ఆసక్తుడై ఆదమరచి ఉన్న పురంజనునికి అవసానకాలం దాపురించింది. కాల-కన్య ‘జర’ (ముసలితనం)తో కూడి ‘చండవేగుడు’ (సంవత్సర, ఆయన, మాసాది గణన రూపమైన కాలం) అనే గంధర్వరాజు మూడువందలఅరవై మంది గంధర్వులు (పగళ్లు), అంతేమంది గంధర్వ కాంతలు (రాత్రులు) తెలుపు-నలుపు రంగుల జంటలై వెంట రాగా పురంజను (జీవు)ని పురం (ఒంటి) మీద దాడికి పూనుకుంటారు. చండవేగుని సేనాని ‘భయుడు’ (మృత్యువు). వానికి అన్న ‘ప్రజ్వారుడు’
(ప్రాణాంతకమైన జ్వరం).
నారద మహర్షి నరనాథుడు (రాజు) ప్రాచీనబర్హికి ‘తత్తమసి’ మహావాక్య పరమార్థాన్ని నూరిపోస్తున్నాడు. రాజా! కాలకన్య జర (వృద్ధాప్యం) తనని వరించేవాని కోసం లోకాలన్నీ వెతికింది. రాజర్షి యయాతి మహారాజు కనిష్ఠ పుత్రుడు ‘పూరువు’ తండ్రి ఆనందం కొరకు ఆయన కోరికను మన్నించి తన యవ్వనం ఆయనకిచ్చి ఆయన ‘జర’ను (వృద్ధాప్యాన్ని) తాను వరిస్తాడు. కాలకన్య జర తననే వరించినట్లుగా భావించి, ఎంతో సంతోషించి పూరువుకి తండ్రి ద్వారా రాజ్యాధికార వారసుడుగా వరం ప్రసాదించింది. తరువాత ఆ తరుణిని, ఆ దుర్భగ (దౌర్భాగ్యవతి)ని ఏ నరుడూ వరించలేదు.

ముసలితనాన్ని చూసి ముచ్చటపడే, మురిసిపోయే మనిషి లోకంలో ఎచ్చటైనా మచ్చుకైనా ఉంటాడా? రాజా! మదను (మన్మథు)ని పదును తూపు (బాణా)లకు తాళలేక ఒకనాడు జర నా వద్దకు వచ్చి వరించమని వేడుకుంది. నేను తిరస్కరించగా అందుకు పురస్కారంగా కోపంతో ‘ఒకచోట నిలుకడ లేకుండా పలు తావులలో తిరుగుతూ ఉందువు గాక’ అని నాకు శాపం పెట్టింది. తాపం తట్టుకోలేక ఆపసోపాలు పడుతోంది కదా! పోనీలే పాపమని యవనరాజు భయుని భర్తగా వరించమని ఉపదేశించాను. ఆధివ్యాధులు (మానసిక శారీరక రోగాలే) యవనాలు. వాటికి అధిపతియే యవనరాజు భయుడు (మృత్యువు). మానవునికి మరణాన్ని మించిన భయమేముంది? తనను భార్యగా గ్రహించమని భయుణ్ని వేడుకున్నది భామిని జర. దేవ రహస్యాన్ని (మరణాన్ని) అమలు పరచవలసిన ఆమె (వృద్ధాప్యము)ను చూసి భయుడు మందహాసం చేసి- ‘ఓ సుందరీ! లోకంలో నువ్వు కోరినవారందరూ మందభాగ్య (దౌర్భాగ్యురాల)వని నీ పొందుమాట దేవుడెరుగు, మా బొందిలో ప్రాణముంటే అదే చాలని నీ ముందుకు రావడానికి కూడా భయపడిపోతున్నారు. అందుకని, నేను జ్ఞాన దృష్టితో కని (చూచి) నీకు తగిన మగని నిర్ణయిస్తా. అన్నీ ‘కావాలి కావాలి’ అనే లోకం నిన్ను మాత్రం మన్నించడం (సమ్మతించడం) లేదు. అసలు నీకు ఏ ఒకడూ పతి కాడు. నీవే ఈ లోకమంతటికీ పతివి. కాన, నీవే ఈ ప్రాణి లోకాన్ని మహారాణివై అనుభవించు. ఈ ప్రజ్వారుడు నాకు సోదరుడు. నీవు నా సహోదరివి. నీకు నిత్యం తోడుగా ఉండే నా సైన్య సహాయంతో నీవు ప్రజానాశనం చెయ్యి’ అని ఆదేశించాడు. ప్రాణులకు వైర్యాగం కలగకుండా ఉండటానికి గీర్వాణులు (దేవతలు) మరణాన్ని మహా రహస్యంగా ఉంచుతారట! ‘నచికేతో మరణం మానుప్రాక్షీః’-కఠోపనిషత్తులో జిజ్ఞాసువైన నచికేతుడు ఆచార్యుడైన యమధర్మరాజుని మరణ రహస్యం చెప్పమనగా అది మాత్రం అడగవద్దని యమధర్మరాజు దాటవేస్తాడు.
యవనరాజు భయుని ఆజ్ఞతో భటులందరూ ముసలిపాము (ప్రాణం)చే రక్షించబడుచున్న పురంజన పురాన్ని (శరీరాన్ని) ముట్టడించారు. పురాధీశుడు ప్రమదోత్తమతో ప్రమోదిస్తూ (కులుకుచూ) రాగల ప్రమాదం పట్టించుకోలేదు. పాపం! పురాధ్యక్షుడైన ప్రజాగరుడు (మరణం వరకు మెలకువ వహించి ఉండే ప్రాణం) ఒక్కడే శత వత్సరాలు విరోధి శక్తులతో వీరోచితంగా పోరాడి బలహీనపడ్డాడు. మేదిని (భూమి)ని దహించివేసే, మేరువును పిండి-పిండి గావించే, సాగర జలాలను కూడా శోషింపజేసే (ఎండగట్టే) కాలానికి ఈ పాంచభౌతిక కళేబరం (శరీరం) ఒక లెక్కా? వృద్ధాప్యం దారి చూపుతుండగా ఉగ్రమైన వ్యాధులనే సైనికులతో మృత్యువనే అమిత్రుడు (శత్రువు) వచ్చి మీద పడి భక్షిస్తుంటే రక్షకునికై ఏల వీక్షించవు? అని గరుడ పురాణ గర్జన! (సశేషం)
– తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ
98668 36006
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
jagadguru adi shankaracharya | ఆదిశంకరుడికి జీవంపోసిన అరుణ్ యోగిరాజ్
Diwali special | పిలక లేని కొబ్బరికాయను దేవుడికి కొడితే ఏమవుతుంది?
ఆది శంకరాచార్యులు సన్యాసం స్వీకరించేందుకు తల్లిని ఎలా ఒప్పించాడో తెలుసా?
లక్ష్మీదేవి 8 రూపాల వెనుక ఆంతర్యమిది.. దీన్ని అర్థం చేసుకుంటే సిరిసంపదలకు కొదవ ఉండదు
తులసీదాసు భరోసా హనుమాన్ చాలీసా
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

