Kalyan Banerjee : పశ్చిమబెంగాల్ (West Bengal) లో ప్రస్తుత పరిణామాలపై తృణమూల్ కాంగ్రెస్ (TMC) స్పందించింది. ఇటీవల టీఎంసీ చీఫ్ విప్‌గా నియమితులైన కల్యాణ్ బెనర్జీ (Kalyan Banerjee) మాట్లాడుతూ.. గతంలో మమతాబెనర్జీ (Mamata Banerjee) నాయకత్వాన్ని ఆకాశనికెత్తిన వారే ఇప్పుడు పార్టీ అధికారంలో లేదనే సాకుతో విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇది కేవలం అధికారం కోసం చేస్తున్న ద్రోహమని ఆయన ధ్వజమెత్తారు. ఈ తిరుగుబాటు నేతలకు తమ పదవులకు రాజీనామా చేసే మళ్లీ గెలిచే దమ్ముందా..? అని ఆయన ప్రశ్నించారు.
పశ్చిమబెంగాల్లో అధికారం కోల్పోయిన తృణమూల్ కాంగ్రెస్ ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. పార్టీ అధినేత్రి మమతా బెనర్జి నాయకత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సుమారు 20 మంది లోక్‌సభ ఎంపీలు, పార్లమెంటులో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. తమను ప్రత్యేక వర్గంగా గుర్తించాలని కోరుతూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాసినట్లు రెబల్ ఎంపీ కకోలీ ఘోష్ దస్తిదార్ ప్రకటించారు. రాష్ట్రంలో 15 ఏళ్ల టీఎంసీ పాలనకు తెరదించుతూ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది.
అధికార తృణమూల్ తిరిగి తన అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయింది. అయితే ఈ ఓటమి అనంతరం టీఎంసీలో అసమ్మతి జ్వాలలు మిన్నంటాయి. ఇప్పటికే 58 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. తాజాగా ఈ సంక్షోభం పార్లమెంటుకు సైతం పాకింది. పార్టీలో పెరుగుతున్న అవినీతి, సీనియర్ నేతలను విస్మరించడం, మమత కుటుంబసభ్యుల ఆధిపత్యమే ఈ తిరుగుబాటుకు ప్రధాన కారణాలని అసమ్మతి నేతలు ఆరోపిస్తున్నారు. పలువురు రెబల్ ఎంపీలు ఇప్పటికే కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్, బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారితో సమావేశమయ్యారు.