నిరుపేదల సొంతింటి కల నెరవేర్చేందుకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గ్రేటర్ హైదరాబాద్‌లో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించారు. గత ప్రభుత్వ హయాంలోనే సగానికి పైగా ఇండ్లను అర్హులైన నిరుపేదలకు పంపిణీ చేశారు. మరికొన్ని ఇండ్లు నిర్మాణ దశలోనే ఉండగానే ప్రభుత్వం మారడంతో పంపిణీ నిలిచిపోయింది. నాటి బీఆర్ఎస్ పేదలకు పంపిణీ చేసేందుకు నిర్మించిన వేలాది ఇండ్లను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తున్నది. నగర బస్తీల్లోని నిరుపేదలను కాదని.. అనర్హులకు కేటాయిస్తూ పేదల సొంతింటి కలను కాలరాస్తున్నది. ఇప్పటికే నగరంలోని పలు ప్రాంతాల్లో కేసీఆర్ నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఎమ్మెల్యేల అనుచరులకు కేటాయిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే మూసీ పరీవాహక ప్రాంతమైన మలక్‌పేట నియోజకవర్గం ముసారాంబాగ్ డివిజన్లోని అంబేద్కర్‌నగర్ బస్తీవాసులను మూసీ సుందరీకరణ పేరిట ఖాళీ చేయాలని ప్రభుత్వం సూచించింది. వారికి పునరావాసం కింద డబుల్ బెడ్రూం ఇండ్లను మంజూరు చేస్తామని ప్రకటించారు. అంబేద్కర్ బస్తీవాసులకు 90 ఇండ్లు మంజూరు చేస్తూ ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టాలు అందజేశారు. కానీ ఇండ్లు మంజూరైన వారిలో 70 మందికి పైగా అంబేద్కర్ నగర్ బస్తీవాసులు లేకపోవడంతో అవాక్కయ్యారు. మూసీ సుందరీకరణ పేరిట తమ ఇండ్లు ఖాళీ చేయాలని.. సంబంధం లేని వ్యక్తులకు ఇండ్లివ్వడంపై అర్హులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే తన అనుచరులు, అనుకూల వ్యక్తులకు పేదల ఇండ్లను కట్టబెడుతున్నారని ఆరోపిస్తున్నారు. అనర్హులకు ఇండ్లు ఇవ్వడంపై తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
– సిటీ బ్యూరో, జూలై 27 (నమస్తే తెలంగాణ)
సిటీ బ్యూరో, జూలై 27 (నమస్తే తెలంగాణ): అంబేద్కర్‌నగర్ బస్తీలో 200 కుటుంబాలకుపైగా ఏండ్ల తరబడిగా మూసీ పరీవాహకంలో జీవనం సాగిస్తున్నారు. దినసరి కూలీలు, ఆటో డ్రైవర్లు, అడ్డా కూలీలుగా పనిచేసుకుని కుటుంబాలను పోషించుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే ఆ బస్తీలోని ఇండ్లను మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో కోల్పోయిన వారికి కేసీఆర్ నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని ప్రకటించారు. కొన్ని ఇండ్లకు మార్కింగ్ కూడా చేసి కూల్చివేతలు చేపట్టారు.
కానీ అసలైన లబ్ధిదారులను పక్కకు పెట్టి ఒక్కో ఇంటికి రూ.3 లక్షలు వసూలు చేస్తూ స్థానికేతరులకు అమ్ముకుంటున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇప్పటివరకు అంబేద్కర్ నగర్ బస్తీ వాసుల పేరిట 90 ఇండ్లు మంజూరు చేస్తే వారిలో అర్హులు కాకుండా వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్‌కు చెందిన ఉన్నారని వాపోతున్నారు. అంబేద్కర్‌నగర్‌లో ఇండ్లు లేనివారికి తమ పేరిట ఎలా మంజూరు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఎమ్మార్వో దగ్గరకు వెళ్తే ఆర్డీవో దగ్గరికి పంపుతున్నారని, ఆర్డీవో దగ్గరికి వెళ్తే కలెక్టర్‌ను అడగాలని అంటున్నారని ఆవేదన చెందుతున్నారు. కలెక్టర్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకుంటే నిర్లక్ష్యం వహిస్తున్నారని వాపోతున్నారు.
మూసీ సుందరీకరణ కింద మా ఇండ్లు కోల్పోతుండటంతో డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేయాలని 2024 నుంచి పోరాడుతున్నాం. తహసీల్దార్ నుంచి కలెక్టర్ దాకా అధికారులందరిని కలుస్తున్నాం. గత ప్రభుత్వంలో మూసీ పరీవాహక ప్రాంతంలోని ప్రజలను ఇబ్బంది పెట్టలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మూసీ సుందరీకరణ పేరిట మా ఇండ్లను కూలుస్తూ… మరొకరికి ఇండ్లను కేటాయిస్తున్నారు. మూసీ పరీవాహకంలో ఇండ్లు లేని ఇతర జిల్లాల వారికి డబుల్ ఇండ్లు అమ్ముకుంటున్నారు. వాళ్లకు అనుకూలురకు ఒకే ఇంట్లో నాలుగు రేషన్ కార్డులు ఇస్తున్నారు. ఒకే ఇంట్లో ముగ్గురు నలుగురికి ఇండ్లు మంజూరు చేస్తున్నారు. మాలాంటి వాళ్లను ఇబ్బందులకు గురిచేయడం ప్రభుత్వానికి సరికాదు. సీఎం రేవంత్‌రెడ్డి విచారణ చేపట్టి అసలైన లబ్ధిదారులను గుర్తించాలని డిమాండ్ చేస్తున్నాం. – యాదగిరి, అంబేద్కర్‌నగర్
మూసీ సుందరీకరణలో భాగంగా ఇండ్లు కోల్పోయే వారికి కాకుండా ఇతర జిల్లాల వాళ్ల నుంచి రూ.3 లక్షల చొప్పున తీసుకుని డబుల్ బెడ్రూం ఇండ్లు అమ్ముకుంటున్నారు. మాకు రావాల్సిన ఇండ్లను డబ్బులున్నోళ్లకు విక్రయించడంపై ప్రభుత్వం వెంటనే విచారణ చేపట్టాలి. అంబేద్కర్‌నగర్‌లో నివాసముంటున్న వాళ్లకే ఇండ్లు అందేలా చర్యలు తీసుకోవాలి. మా బాధలను కలెక్టర్‌కు విన్నవిస్తే వారంలో విచారణ చేపడతామన్నారు. ఇప్పటికీ రెండు నెలలు కావొస్తున్నది. ప్రజావాణిలో దరఖాస్తు చేస్తే పరిశీలిస్తామని ఇప్పటిదాకా స్పందించ లేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు కుమ్మక్కై పేదల పొట్టకొట్టడం సరికాదు. పోరాటం చేస్తూనే ఉంటాం.
– శారద, అంబేద్కర్‌నగర్
మేం ఏండ్ల తరబడిగా మూసీ ఒడ్డున నివసిస్తున్నాం. మూసీ ప్రాజెక్టులో ఇండ్లు కోల్పోతే అక్కడే కట్టించి ఇవ్వాలి. కానీ మేం ప్రభుత్వానికి సహకరించి నగరంలో డబుల్ బెడ్రూం ఇండ్లు ఎక్కడ ఇచ్చిన వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మా పేరు మీద ఎవరికో ఇండ్లు మంజూరు చేస్తున్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి ఇంటి మంజూరు పత్రాలను మా ప్రాంతానికి వచ్చి ఇస్తే.. మేం నిలదీస్తామని ఎక్కడో ఉండి ఇక్కడి వాళ్లకు ఇస్తున్నట్లు డబ్బులిచ్చిన వాళ్లకు మంజూరు చేశారు. ఒక్కో ఇల్లును రూ.3 లక్షలకు అమ్ముకుంటున్నారు. డబుల్ బెడ్రూం ఇండ్ల పేరిట రూ.3 కోట్ల అవినీతికి పాల్పడ్డారు. మాకు రావాల్సిన ఇండ్లను వాళ్ల అనుచరులు, ధనవంతులకు ఇస్తున్నారు.
– స్వప్న, అంబేద్కర్‌నగర్