సిటీ బ్యూరో, జూలై 27 (నమస్తే తెలంగాణ): ప్రత్యేక ఓటరు సవరణ జాబితా ప్రక్రియలో బీఎల్వోల తీరు గ్రేటర్ హైదరాబాద్ ఓటర్లను గందరగోళానికి గురిచేస్తున్నది. గడువు సమీస్తున్న కొద్ది సర్ ప్రక్రియను పూర్తిచేయాలనే ఉద్దేశంతో బీఎల్వోలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఓటర్లు ఆరోపిస్తున్నారు. ఎన్యూమరేషన్ పత్రాలపై ఏమైనా సందేహాలుంటే చెప్పకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని అంటున్నారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లిన ఓటర్లతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని వాపోతున్నారు. సందేహాలను నివృత్తి చేయాలని అడిగితే.. తాము బిజీగా ఉన్నామని, తర్వాత రావాలని చెబుతున్నారు.
మరికొంత మంది ఒకరికి ఒకలా ఇంకొకరికి మరోలా సమాధానం చెబుతుండడంతో ఏది నిజమే.. ఏది కాదో తెలియక ఓటర్లు అయోమయానికి గురవుతున్నారు. ఎన్యూమరేషన్ ఫారాల్లో ఏ కాలమ్‌లో ఏం నింపాలో చెప్పాలని అడిగితే.. ఇష్టమున్నది నింపుకోండి అని దాటవేస్తూ ఓటర్లను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. ఓటర్లు వివరాలు నమోదు చేసి ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫారాలను కనీసం చూడటం లేదని ఆరోపిస్తున్నారు. చూసి తప్పులేమన్నా ఉంటే చెప్పాలని కోరినా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీఎల్వోల తీరుతో తమ ఓటు ఉంటుందో గల్లంతవుతుందోనని ఓటర్లు అయోమయానికి గురవుతున్నారు.
ఓటర్ల వివరాలను ఆన్లైన్ చేసే ఎన్యూమరేషన్ యాప్‌పై కొంత మంది బీఎల్వోలకు ఇప్పటిదాకా పూర్తి అవగాహన రాకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. సర్ ప్రక్రియ ప్రారంభమై నెల దాటినా వివరాలు నమోదు చేయడంలో బీఎల్వోల్లో చాలామంది ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తున్నది. కొన్నిచోట్ల వివరాలు తప్పుగా నమోదు చేస్తున్నట్లు ఓటర్లు ఆరోపిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే నిర్లక్ష్యపు సమాధానాలు చెబుతున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెల రోజులుగా సర్ప్రక్రియ పై పనిచేస్తున్నా ఆన్లైన్ ప్రక్రియపై అవగాహన లేక పోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ అధికారులు బీఎల్వోలు ఆన్లైన్ ప్రక్రియ ఎలా చేపడుతున్నారో నిరంతరం తనిఖీ చేపట్టాలని ఓటర్లు కోరుతున్నారు.