Fatigue | అలసట, జుట్టు రాలడం వంటి సమస్యలను చాలామంది సాధారణంగా ఒత్తిడి, నిద్రలేమి లేదా జీవనశైలి కారణాలుగా భావిస్తుంటారు. అయితే ఈ లక్షణాలు కొన్ని సందర్భాల్లో థైరాయిడ్ గ్రంథి పనితీరులో లోపాలకు కూడా సంకేతాలుగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరంలో జీవక్రియలు, శక్తి ఉత్పత్తి, జుట్టు పెరుగుదల, మానసిక స్థితి వంటి అనేక కీలక ప్రక్రియలను నియంత్రించడంలో థైరాయిడ్ హార్మోన్లు ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఈ హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడితే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. మన దేశంలో ముఖ్యంగా మహిళల్లో థైరాయిడ్ సమస్యలు అధికంగా కనిపిస్తున్నప్పటికీ, చాలా సందర్భాల్లో అవి నిర్ధారణ కాకుండానే మిగిలిపోతున్నాయి. థైరాయిడ్ వ్యాధులు నెమ్మదిగా అభివృద్ధి చెందడం వల్ల ప్రారంభ లక్షణాలను చాలామంది పట్టించుకోరు. అందువల్ల ప్రతి సంవత్సరం ఆరోగ్య పరీక్షల్లో భాగంగా థైరాయిడ్ పరీక్షలు చేయించుకోవడం మంచిది.
థైరాయిడ్ సమస్యలకు సంబంధించిన ప్రధాన లక్షణాల్లో నిరంతర అలసట ఒకటి. రాత్రి ఎనిమిది గంటలకు పైగా నిద్రపోయినా రోజంతా నీరసంగా, శక్తిలేనట్టుగా అనిపిస్తే అది థైరాయిడ్ పనితీరులో లోపానికి సంకేతం అయి ఉంటుంది. ముఖ్యంగా హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు శరీర జీవక్రియలు మందగించి శక్తి ఉత్పత్తి తగ్గిపోతుంది. ఫలితంగా అలసట, బద్ధకం ఎక్కువగా కనిపిస్తాయి. జుట్టు రాలడం లేదా జుట్టు పలచబడడం కూడా మరో ముఖ్యమైన హెచ్చరిక సంకేతం. సాధారణంగా ప్రతి ఒక్కరికీ కొంతమేర జుట్టు రాలడం సహజమే. అయితే జుట్టు అసాధారణంగా రాలడం, పొడిగా మారడం, పెళుసుగా తయారవడం వంటి మార్పులు కనిపిస్తే థైరాయిడ్ పరీక్షలు చేయించుకోవడం అవసరం. థైరాయిడ్ హార్మోన్లు జుట్టు పెరుగుదల చక్రాన్ని ప్రభావితం చేయడంతో ఈ మార్పులు చోటుచేసుకుంటాయి.
ఆహారపు అలవాట్లలో పెద్దగా మార్పులు లేకపోయినా అకస్మాత్తుగా బరువు పెరగడం లేదా తగ్గిపోవడం కూడా థైరాయిడ్ సమస్యలకు సంకేతంగా ఉంటుంది. హైపోథైరాయిడిజం ఉన్నవారిలో జీవక్రియలు మందగించడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. మరోవైపు హైపర్‌థైరాయిడిజం ఉన్నవారిలో జీవక్రియలు వేగవంతమై బరువు తగ్గుతారు. చర్మం పొడిబారడం, గోర్లు బలహీనపడటం వంటి లక్షణాలు కూడా థైరాయిడ్ అసమతుల్యతతో సంబంధం కలిగి ఉంటాయి. శరీర కణాల పునరుత్పత్తి ప్రక్రియ మందగించడం వల్ల చర్మం తేమ కోల్పోయి పొడిబారుతుంది. అదే సమయంలో గోర్లు బలహీనంగా మారి సులభంగా విరిగే అవకాశం ఉంటుంది.
మానసిక స్థితిలో మార్పులు, ఏకాగ్రత లోపం, జ్ఞాపకశక్తి మందగించడం లేదా నిరాశ వంటి లక్షణాలు కూడా థైరాయిడ్ సమస్యలతో ముడిపడి ఉంటాయి. థైరాయిడ్ హార్మోన్లు మెదడు పనితీరుపై ప్రభావం చూపుతాయి. అందువల్ల చిరాకు, మూడ్ స్వింగ్స్, ఆలోచనల్లో మందగింపు వంటి సమస్యలు కనిపిస్తాయి. అలసట, జుట్టు రాలడం థైరాయిడ్ లోపాలకు సంబంధించిన తొలి సంకేతాల్లో ముఖ్యమైనవి. అయితే చాలా మంది వీటిని సాధారణ సమస్యలుగా తీసుకుని నిర్లక్ష్యం చేస్తారు. ఒక సాధారణ రక్త పరీక్ష ద్వారా థైరాయిడ్ పనితీరును అంచనా వేసి సమస్యను ప్రారంభ దశలోనే గుర్తించవచ్చు. ముందస్తు నిర్ధారణ ద్వారా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను నివారించే అవకాశం ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు.