ఆదివారం 29 మార్చి 2020
Zindagi - Mar 14, 2020 , 22:22:01

కష్టపడటం నా బాధ్యత

కష్టపడటం నా బాధ్యత

15 ఏళ్ల సినీ కెరీర్‌ .. దాదాపు 50 సినిమాలు.. అగ్రకథానాయిక అనుష్క శెట్టి కెరీర్‌ ఇది. హీరోలకు ఇది మామూలే అయినా హీరోయిన్లకు మాత్రం ఇదొక పెద్ద అచీవ్‌మెంట్‌. కేవలం గ్లామర్‌డాల్‌గానే పరిమితం కాకుండా కన్నెర్ర చేసిన ‘అరుంధతి’లా, కత్తియుద్ధాలు, గుర్రపుస్వారీలతో రౌద్రపరాక్రమాలు చూపిన ‘రుద్రమదేవి’లా, యుద్ధభూమిలో ‘దేవసేన’లా ఏ పాత్ర చేసినా ఆ పాత్రకు ప్రాణప్రతిష్ట చేసిన అరుదైన నాయిక అనుష్క శెట్టి. శక్తివంతమైన కథానాయిక పాత్రలకు చిరునామాలా మారిన ఈ స్వీటిశెట్టి ‘సూపర్‌'స్టార్‌గా ఎదిగినా ఎన్ని ప్రశంసలు అందుకున్నా ఆమె ఎప్పుడూ ‘నిశ్శబ్దం’గానే స్వీకరించింది. పదిహేనేండ్లుగా పలు వైవిధ్యమైన పాత్రలతో, తన అభినయ కౌశలంతో విజయవంతమైన కథానాయికగా కెరీర్‌ కొనసాగిస్తున్న అనుష్క శెట్టి తన 15 ఏళ్ల సినీ ప్రయాణం విశేషాలను ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా పంచుకున్నారు.

పదిహేనేండ్లు  ప్రయాణాన్ని పూర్తిచేసుకోవడం ఎలా అనిపిస్తున్నది?

సినీ కెరీర్‌ను మొదలుపెట్టి అర్థం చేసుకునేలోపే చాలా సినిమాలు చేసేశాను. ఇప్పుడు బ్రేక్‌ తీసుకున్నాను.  అందరూ పదిహేను సంవత్సరాలు పూర్తిచేయడం ఓ అచీవ్‌మెంట్‌ అంటున్నారు. ఈ మాటలు వింటుంటే నాలో ఇంకా బాధ్యత పెరిగింది. మరింత కష్టపడాలనిపిస్తుంది. తెలుగు పరిశ్రమలో చాలామంది విజేతలున్నారు. వాళ్లతో పోల్చుకుంటే నాది పెద్ద విజయమేమీ కాదు.  


ఈ ప్రయాణం ఎలా అనిపిస్తున్నది? 

క్షణాల్లో అయిపోయినట్లు ఉంది. పదిహేనేళ్లు ఎలా పూర్తయ్యాయో తెలియలేదు. కాలం వేగంగా గడిచినట్లుంది. ఈ ప్రయాణంలో ప్రతిరోజు షూటింగ్‌లలోనే ఎక్కువగా ఉన్నాను.  విరామం తీసుకున్న తర్వాత ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే తల్లిదండ్రులు, సన్నిహితుల వయసు పెరిగినట్లుగా అనిపించింది. అద్భుతమైన ప్రయాణమిది.  


స్టార్‌ హీరోయిన్‌గా  ఈ స్థాయికి చేరుకుంటారని తొలినాళ్లలో ఎప్పుడైనా ఊహించారా?

అస్సలు అనుకోలేదు. ఇండస్ట్రీలోకి రాకముందు సినిమాల్ని పెద్దగా చూసేదాన్ని కాదు. నటీనటులు, స్టార్‌డమ్‌  అంటే తెలియదు. సినిమాలు చూసుంటే అవన్నీ అవగాహన ఉండేది. ఇండస్ట్రీ గురించి ఎలాంటి పరిజ్ఞానం లేకపోవడంతో తొలినాళ్లలో ప్రతిదీ కొత్తగానే ఉండేది.  చిత్రసీమ నుంచి వెళ్లేలోపు ఏదో ఒకటి నేర్చుకోవాలి, కష్టపడాలనే తపనతో వచ్చాను. సినిమాల్లో ఇప్పటివరకు నేను సాధించినవన్నీ బోనన్‌గానే భావిస్తాను. 


ఈ ప్రయాణంలో కష్టాలు    ఎదుర్కొన్నారా? 

సినీ పరిశ్రమలోనే కాదు ఏ రంగంలోనైనా కష్టాలు ఉంటాయి. అది సహజం.  తొలినాళ్లలో నటించడం, డైలాగ్‌ చెప్పడంలో ఇబ్బందులుంటాయి. ఓ పాత్రను ఎంచుకున్నప్పుడు దానికి న్యాయం చేయగలనా లేదా అనే భయాలుంటాయి. ప్రతి నాలుగైదు నెలలకు కొత్త వ్యక్తులు, టీమ్‌తో పనిచేస్తుంటాం. ఆ తర్వాత మెల్లగా మనకు దగ్గరైన వారు జీవితాంతం వెన్నంటే ఉంటారని అర్థం చేసుకున్నాను. 


సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్‌ సుదీర్ఘ కాలం కొనసాగడం అరుదుగా కనిపిస్తుంటుంది ? 

ప్రస్తుతం ఆ ధోరణిలో మార్పులు కనిపిస్తున్నాయి. ఏ రంగంలోనైనా సుదీర్ఘకాలం కొనసాగాలంటే కష్టపడేతత్వమే ఉపయోగపడుతుందని నేను విశ్వసిస్తాను. వృత్తితో పాటు అనుబంధాలకు విలువ ఇవ్వడం ముఖ్యం. కొన్ని సార్లు మనం చేసే పని గొప్పది కాకపోయినా నిజాయితీగా శ్రమించాలి.  అవకాశాలు రావడం అదృష్టంగానే పరిగణిస్తాను. అయితే కొన్నిసార్లు పరాజయాలు ఎదురవుతాయి. వాటి నుంచి పాఠాలు నేర్చుకొని జీవితాన్ని కొనసాగించడం చాలా ముఖ్యం. 


 యాభై సినిమాల మైలురాయికి చేరువయ్యారు? మీ కెరీర్‌లో ఎక్కువ చాలెంజింగ్‌గా అనిపించిన సినిమాలేవి?

తొలి సినిమా ‘సూపర్‌'లో అవకాశం వచ్చిన సమయంలో కెమెరా ముందు నటించడం, డ్యాన్స్‌ చేయడం అదే నా జీవితంలో తొలిసారి కావడంతో చాలా భయపడిపోయాను. ఆ తర్వాత నిదానంగా  వాటిని అర్థం చేసుకున్నాను. ‘అరుంధతి’తో పాటు నా సినీ కెరీర్‌లో ప్రతి సినిమా సవాల్‌గానే నిలిచింది. ప్రతిభావంతులైన మంచి టీమ్‌తో పనిచేయడం వల్లే ఆ చాలెంజెస్‌ను అధిగమించగలిగాను. అరుంధతి, వేదం, రుద్రమదేవి, బాహుబలి ఇలా ప్రతి సినిమాలో తపన కలిగిన దర్శకనిర్మాతలతో పనిచేయడం వల్లే వైవిధ్యమైన కథ, పాత్రల్ని పోషించగలిగాను. 


హీరోలతో సమానంగా మార్కెట్‌, ఇమేజ్‌ రావడం   బాధ్యతగా  ఫీలవుతున్నారా?

నేనెప్పుడూ ఏ విజయాన్ని  నా ఒక్కదానికే ఆపాదించుకోను. నా వల్లే సక్సెస్‌ వచ్చిందని భావించుకోను. సినిమా ఇండస్ట్రీ అనేది 24 విభాగాల సమిష్టి కృషిపై ఆధారపడి ఉంటుంది. అందరూ కలిసి తపనతో పనిచేస్తేనే విజయాల్ని అందుకోగలుగుతాం. నటీనటుల విజయాల వెనుక ఎంతో మంది కష్టం ఉంటుంది. నటులకు ఓ విజయం వరించినప్పుడు ఇతరులతో పోలిస్తే పది మార్కులు ఎక్కువగా వస్తాయి. ఏదైనా  తప్పు జరిగితే మిగతా వారికంటే పది మార్కులు ఎక్కువగా కోల్పోవాల్సి ఉంటుంది. 


మిమ్మల్ని హీరోయిన్‌గా యాభై కోట్లు ఖర్చుపెట్టి సినిమా తీయొచ్చనే నమ్మకాన్ని ఎలా నిలబెట్టుకోగలిగారు?

అరుంధతి, బాహుబలి సినిమాలు నాకంటూ ప్రత్యేకంగా ప్లాట్‌ఫామ్‌ను ఏర్పరిచాయి. నాతో అలాంటి సినిమాలు చేయగలననే నమ్మకాన్ని తీసుకొచ్చాయి. అయితే  నా దృష్టిలో కథే అసలైన హీరో. ప్రేక్షకుల్ని ఎమోషన్స్‌తో కనెక్ట్‌ చేయగలిగే కథలు దర్శకులు రాయకపోతే ఏం చేసినా సినిమాను ముందుకు తీసుకెళ్లలేము. ఏదైనా కథలపైనే ఆధారపడి ఉంటుంది. 


‘బాహుబలి’ చిత్రం మీకు ఎలాంటి సంతృప్తిని మిగిల్చింది?

నా కెరీర్‌లో అన్ని షేడ్స్‌ ఉన్నగొప్ప పాత్రను పోషించే అవకాశం రావడం అదృష్టంగా అనిపించింది. యువరాణిగా, తల్లిగా, బందీగా నా పాత్రలో భిన్న పార్శాలుంటాయి. నటనపరంగా, వ్యక్తిగతంగా ప్రతి అంశంలో ఈ సినిమా సంతృప్తిని మిగిల్చింది.  అందరం కుటుంబంలా కలిసిపోయి పనిచేశాం. మా కష్టానికి పెద్ద స్థాయిలో  విజయం దక్కడంతో కన్నీళ్లు వచ్చాయి. కొన్నిసార్లు అలాంటి అద్భుతాలు జరుగుతాయి. 


‘బాహుబలి’ మీకు జాతీయ స్థాయిలో గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆ సినిమా తర్వాత బాలీవుడ్‌లో అవకాశాలు వచ్చాయా?

కొన్ని అవకాశాలు వచ్చాయి. కానీ బ్రేక్‌ తీసుకోవడం వల్ల ఏ సినిమాను అంగీకరించలేదు. బాలీవుడ్‌లో ప్రత్యేకంగా నటించాలనే కోరిక నాకు లేదు.  కథ సంతృప్తినివ్వడమే కాకుండా మంచి నటీనటులు, సాంకేతిక నిపుణులతో పనిచేశాననే సంతృప్తి ఉండాలి. అది లేకపోతే ఏ భాషలో సినిమా చేయను. చిత్రసీమలో మీకున్న మంచి స్నేహితులు? 


 సుప్రియ, ప్రశాంతి, నాని, రాజమౌళి, వల్లి, శ్యామ్‌ప్రసాద్‌ వీరందరినీ నా కుటుంబ సభ్యుల్లా భావిస్తాను. చిత్రసీమలో వారే  నాకు అత్యంత సన్నిహితులు. ఇప్పటికీ వారితో చక్కటి అనుబంధం కొనసాగుతూనే ఉన్నది.  మంచి సినిమాలతో మంచి వ్యక్తులు దొరకడం బోనస్‌గా భావిస్తాను. 


నిశ్శబ్దం సినిమాలో మీ క్యారెక్టర్‌ ఎలా ఉండబోతున్నది?

సంతోషంగా జీవితాన్ని వెళ్లదీసే  చిత్రకారిణిగా కనిపిస్తాను. సియాటెల్‌లోని ఓ అనాథాశ్రమంలో పెరిగిన ఆమె జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయన్నది తెరపై ఆసక్తిని పెంచుతుంది. 


ఈ మధ్యకాలంలో మీ పెళ్లిపై చాలా వార్తలు వినిపించాయి?

వాటిలో చాలావరకు నా వరకు రాలేదు. నేను టీవీ చూడను. వార్తలు చదవను. ఎవరైనా నీ గురించి ఫలానా వార్త వచ్చిందని చెబితేనే నాకు తెలుస్తుంది. ఎందుకు రాస్తారో నాకు తెలియదు. సోషల్‌మీడియాలో నేను లేను. నా అభిమానులే ఓ ఖాతాను కొనసాగిస్తున్నారు. అందులో నా గురించిన పాజిటివ్‌ వార్తలే పోస్ట్‌ చేస్తుంటారు. రూమర్స్‌ వస్తూనే ఉంటాయి. వాటి గురించి ఏం చేయలేము. 


కెరీర్‌ పరంగా, వ్యక్తిగతంగా స్వీయ నిర్ణయాలే తీసుకుంటారా?ఎవరి సలహాలైన స్వీకరిస్తుంటారా?

ఏదైనా సొంత నిర్ణయాలనే ఫాలో అవుతుంటాను. ఏదైనా కథ బాగుంటే దాని గురించి నా స్నేహితులతో పంచుకుంటాను. కానీ ఆ  సినిమా చేయాలా వద్దా అన్నది మాత్రం నా నిర్ణయానికే కట్టుబడి ఉంటాను. 


 పాత్రల కోసం బరువు పెరగడం, తగ్గడం సులభమని అనుకుంటున్నారా?

 అలాంటి పాత్రల వల్ల ఆరోగ్యం పాడైపోతుంది. ‘సైజ్‌జీరో’ సినిమా చేస్తున్నప్పుడు భవిష్యత్‌ పరిణామాలు ఊహించలేదు. కథ ఎైగ్జెటింగ్‌గా అనిపించడంతో నటించాను. ఆర్యోగాన్ని గురించి ఆలోచించుకోవడం ముఖ్యమని అర్థమైంది.  యోగ నా జీవితంలో ఓ భాగం. ఇప్పటికీ యోగ, మెడిటేషన్‌ రోజూ చేస్తూనే ఉంటాను. 


గ్లామర్‌తో పాటు అభినయానికి ప్రాధాన్యమున్న విభిన్నమైన పాత్రల్ని పోషించారు? 


 పూరిజగన్నాథ్‌, నాగార్జునలకు నాలో ఏదో ప్రతిభ ఉందని నమ్మి అవకాశమిచ్చారు. అలాగే ‘విక్రమార్కుడు’ సమయంలో నన్ను కలిసిన శ్యామ్‌ప్రసాద్‌ రెడ్డి ‘అరుంధతి’  సినిమాను నాతో చేయచ్చని నమ్మారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకున్నాను. మనసుపెట్టి నిజాయితీగా శ్రమించాను. 


 సినిమాలు కాకుండా మీకు ఇష్టమైన వ్యాపకమేది?

ట్రావెలింగ్‌కు ప్రాముఖ్యమిస్తాను. సంగీతం వింటాను. విరామం దొరికితే సన్నిహితులకు సమయాన్ని కేటాయిస్తాను.  కొన్ని సార్లు ఏం చేయకుండా ఖాళీగా ఉంటాను. ఏదైనా కొత్తగా నేర్చుకుంటాను. 


 మీ దగ్గర పనిచేసేవారి బాగోగుల్ని దగ్గరుండి చూసుకుంటారట?

అది మన వ్యక్తిత్వంపైన ఆధారపడి ఉంటుంది. ఇప్పటికీ నా స్కూల్‌ ఫ్రెండ్స్‌, యోగ స్నేహితులతో ఒకప్పుడు ఎలా ఉన్నానో ఇప్పటికీ అలాగే ఉంటాను. ఆ రిలేషన్‌షిప్‌లను అలాగే కొనసాగించడం ముఖ్యం. ఎవరికైనా విలువ ఇవ్వడమే నాకుండా ఆ అనుబంధాన్ని కొనసాగిస్తాను.  కమిట్‌మెంట్‌ ఉందని సినిమా చేయడం ముఖ్యం కాదు. నటీనటుల అసలైన కమిట్‌మెంట్‌ ప్రేక్షకులతోనే ఉంటుంది.  కథలను నమ్మి హార్డ్‌వర్క్‌ చేయడం ముఖ్యం.  దానినో బాధ్యతగా భావిస్తాను.


నటన పట్ల బోర్‌గా ఫీలయిన క్షణాలు ఉన్నాయా?

సినిమాలు ఎప్పుడూ బోర్‌ కొట్టలేదు. ‘సైరా’ షూటింగ్‌ సమయంలో మొదటిసారి కారావ్యాన్‌ మిస్‌ అయ్యాను. అది తప్ప మిగతా సమయమంతా కారావ్యాన్‌లోనే ఎక్కువగా గడిచిపోయింది. షూటింగ్‌లో ఎప్పుడూ ఏదో మ్యాజిక్‌ ఉంటుంది. లైట్‌బాయ్‌ నుంచి ప్రతి ఒక్కరూ కష్టపడుతూనే ఉంటారు. సెట్స్‌లో ఉంటే సమయం తెలియదు. మంచి, చెడు, కష్టనష్టాలు అన్నింటినీ దాటుకుంటూ ఈ స్థాయికి చేరుకునే క్రమంలో వ్యక్తిగతంగా  చాలా నేర్చుకున్నాను. 


దేవుడిని నమ్ముతారా?

గుళ్లకు వెళుతుంటాను. దేవాలయాల్లోని ఆహ్లాదకరమైన వాతావరణం అంటే ఇష్టం. దేవుడిని నమ్ముతాను. అయితే ప్రత్యేకంగా ఏ మతాన్నీ  అనుసరించను. 


హైదరాబాద్‌తో మీకున్న అనుబంధం?

హైదరాబాద్‌ నాకు సొంత ఊరిలా మారిపోయింది. నా మాతృభాష తుళు అయినా తెలుగులోనే ఎక్కువగా మాట్లాడుతాను. ‘సూపర్‌' నుంచి నేటివరకు తెలుగు ప్రేక్షకులు నన్ను ఆదరిస్తూనే ఉన్నారు. 


‘నిశ్శబ్దం’ సినిమాను అంగీకరించడానికి కారణం?


హేమంత్‌ మధుకర్‌ చక్కటి స్క్రీన్‌ప్లేతో   ఈ కథ తయారుచేశారు. కొత్తగా ఉంటుందనే ఆలోచనతో అంగీకరించాను. తొలుత  ఈ పాయింట్‌ విన్నప్పుడు డైలాగ్స్‌ లేకుండా ఎలా నటించాలో అర్థం కాలేదు. ఎలాగైనా చేయాలనే ఆసక్తిని నాలోరేకెత్తించింది. మూగయువతిగా నటించాలనే ప్లాన్‌ చేసుకోలేదు. కథలోనే నా పాత్ర అలా ఉండడంతో అలా జరిగిపోయింది. 


తొలిసారి సెట్‌లో అడుగుపెట్టిన  రోజు గుర్తుందా?

నా జీవితంలో మధురమైన జ్ఞాపకమది. ఆ రోజు ఇప్పటికీ గుర్తుంది. మార్చి 10న తొలిసారి కెమెరా ముందుకు వచ్చాను. మార్చి 12  2005లో అన్నపూర్ణ స్టూడియోలో తొలి సన్నివేశాన్ని నాపై చిత్రీకరించారు. 


మీ పెళ్లి గురించి..

పెళ్లికి  నేను వ్యతిరేకం కాదు.  అందుకు టైమ్‌ రావాలి. సరైన భాగస్వామి దొరకాలి. జీవితంలో అమ్మానాన్నలు ఎంత ముఖ్యమో పెళ్లిచేసుకునే వ్యక్తికి  అంతే ప్రాధాన్యం ఉంటుంది. పెళ్లి అనేది ఓ అందమైన భావన. దానిని రహస్యంగా దాచిపెట్టలేం. పెళ్లిచేసుకుంటే అందరికీ తెలిసిపోతుంది. పెళ్లి గురించి రూమర్స్‌ వచ్చినపుడు పట్టించుకోకుండా వదిలివేస్తాను. 


స్టార్‌డమ్‌ వచ్చిన తర్వాత సినిమాల ఎంపికలో సెలెక్టివ్‌గా ఉంటున్నారని అనుకోవచ్చా?

మంచి కథలకు ప్రాధాన్యమిస్తున్నాను.  ఇదివరకు చేసిన కథ, పాత్రలను పునరావృతం కాకుండా జాగ్రత్తపడుతున్నాను. కంఫర్ట్‌జోన్‌కు పరిమితం కాకుండా ప్రయోగాత్మక కథాంశాలతో సినిమాలు చేయాలి. ప్రతి కథను నటిగా కాకుండా ఓ ప్రేక్షకురాలిగా వింటాను. నేను స్క్రీన్‌పై చూడటానికి ఇష్టపడ్డ కథలతోనే సినిమాలు చేస్తాను. 


-మడూరి మధు         

-సిఎం. ప్రవీణ్‌


logo