Dasyam Vinay Bhaskar | నిన్న మాజీ మంత్రి హరీష్ రావుకు, నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్కు సిట్ నోటీసులు జారీ చేయడం రాజకీయ కక్ష సాధింపు చర్యలేనని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ శాసనసభ్యుడు, బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు.
కేటీఆర్కు సిట్ అధికారుల నోటీసుల నేపథ్యంలో దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ రెండేళ్లలో కమిషన్ల పేరిట, నోటీసుల పేరిట, సిట్ పేరిట, విచారణల పేరిట ప్రతిపక్ష నాయకులను రాజకీయంగా వేధించే ప్రయత్నం చేస్తోందన్నారు. ఇటీవల మాజీ మంత్రి హరీష్ రావుకు, నేడు కేటీఆర్కు నేడు సిట్ నోటీసులు ఇవ్వడం రాజకీయ కక్ష సాధింపు చర్యలుగానే తెలంగాణ సమాజం భావిస్తోందన్నారు. పాలన చేత కాక ప్రజల తరపున ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలను కాంగ్రెస్ సర్కారు టార్గెట్ చేస్తోందన్నారు.
కేసీఆర్ స్థాయిని తగ్గించాలని..
కమిషన్ల పేరిట, విచారణ పేరుతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ స్థాయిని తగ్గించాలని, తప్పుగా చూపాలనే కుట్రలు, కుంతంత్రాలకు కాంగ్రెస్ సర్కారు ఒడిగట్టిందని దాస్యం వినయ్ భాస్కర్ ఆరోపించారు. పాలకులు, ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా, ఎంత వేధించాలని చూసినా బాధ్యత గల ప్రతిపక్షంగా, ఉద్యమకారులుగా, స్వరాష్ట్ర సాధకులుగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు న్యాయస్థానాల మీద, ప్రజాస్వామ్యంపై గౌరవంతో నిజాయితీగా సమాధానాలు ఇస్తూనే, ప్రజల తరపున పోరాడుతారన్నారు.
420 హామీలు, 6 గ్యారంటీలు అమలు చేతకాకే ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులను కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పెట్టాలని చూస్తోందని ఆరోపించారు వినయ్ భాస్కర్. ఉద్యమబిడ్డలుగా కేసులు, నోటీసులు వారికి ఇవి ఏం కొత్తకావన్నారు. ప్రతిపక్ష నాయకులను వేధించడం ద్వారా పాలకులు ప్రజల దృష్టి మరల్చాలని అనుకోవడం వారి అవివేకం మాత్రమేనన్నారు. వారి చిల్లర చేష్టలకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అదరరు బెదరరు.
రెండేళ్లలో అమలు కాని హామీలు ఇచ్చి, ఎగవేతలు, కోతలతో ప్రభుత్వాన్ని నడుపుతున్న కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని.. వ్యతిరేకత కప్పి పుచ్చుకోలేక డైవర్షన్ పాలిటిక్స్ కాంగ్రెస్ చేస్తోందన్నారు. ఎన్ని చేసినా, ఎన్ని కేసులు పెట్టిన ప్రజల తరపున ప్రశ్నిస్తూనే ఉంటామని దాస్యం వినయ్ భాస్కర్ హెచ్చరించారు. ప్రజా క్షేత్రంలో ప్రజల తరపున పోరాడుతాం బీఆర్ఎస్ పార్టీ అగ్ర నాయకత్వానికి బీఆర్ఎస్ గులాబీ దండు ఎల్లవేళలా తోడుగా ఉంటుందని స్పష్టం చేశారు.