Congress | హైదరాబాద్, మార్చి1 (నమస్తే తెలంగాణ): రాజ్యసభ ఎన్నికల్లో అంతా అనుకున్నట్టే జరుగుతున్నది. పదవుల పందేరంలో అసలు కాంగ్రెస్ నేతలు వెనుకబడిపోగా.. వలస కాంగ్రెస్ నేతల పేర్లే తెర మీదికి వచ్చాయి. రాష్ట్రంలో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్న సంగతి తెలిసిందే. ఒక సీటుకు రాష్ట్రంతో సంబంధం లేని సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ పేరు మరోసారి దాదాపు ఖరారైనట్టు ఢిల్లీ కాంగ్రెస్ వర్గాలు ధృవీకరిస్తున్నాయి.
రెండో సీటు ఎవరికి ఇవ్వాలనే దానిపై కసరత్తు నడుస్తున్నట్టు సమాచారం. వాస్తవానికి సీఎం రేవంత్ రెడ్డి తన సన్నిహితుడు వేం నరేందర్‌రెడ్డికి ఖరారు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. అయితే కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ స్వయంగా మాజీ ఎమ్మెల్యే, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వంశీచంద్‌రెడ్డి పేరును సూచించినట్టు సమాచారం. దీంతో ఏఐసీసీలోని తన గురువు ద్వారా రేవంత్‌రెడ్డి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
మొత్తంగా ఈ ఇద్దరిలో ఒకరికి సీటు ఖరారు అవుతుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ నెల 5వ తేదీ నామినేషన్ల దాఖలుకు తుది గడువు కావడంతో ఒకటి, రెండు రోజుల్లో ప్రకటించవచ్చని చెప్తున్నారు. దీంతో సీటు ఆశించిన అసలు కాంగ్రెస్ నేతలు వీ హన్మంతరావు, అనిల్‌కుమార్, మధుయాష్కీ, జీవన్‌రెడ్డి, నేరెళ్ల శారదకు మొండిచెయ్యే మిగిలిందని చర్చ జరుగుతున్నది.
తెలంగాణ నుంచి ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న అభిషేక్ మను సింఘ్వీకి మరోసారి అవకాశం కల్పించడం ఖాయమని కాంగ్రెస్ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి. కే కేశవరావు రాజీనామా తర్వాత ఏర్పడిన ఖాళీలో ఆయనను నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే రెండేండ్ల స్వల్పకాలం మాత్రమే ఆయనకు అవకాశం దకింది. దీంతో సింఘ్వీ పునర్నియామకం లాంఛనమేనని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి.
వాస్తవానికి ప్రస్తుతం కాంగ్రెస్‌కు రెండో రాజ్యసభ సీటు గెలిచేంత బలం లేదని నిపుణులు చెప్తున్నారు. అయినా అభ్యర్థిని ఖచ్చితంగా నిలబెట్టాలని టీపీసీసీ నిర్ణయించినట్టు తెలిసింది. రెండో సీటుకు మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి పేరును స్వయంగా ప్రియాంకగాంధీ సూచించినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
వంశీచంద్‌రెడ్డికి చెక్ పెట్టడం కోసం సీఎం రేవంత్‌రెడ్డి అనుచరులు ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. వంశీచంద్‌రెడ్డి గత పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. పార్టీ పాలసీలో ఎన్నికల్లో పోటీ చేసిన వారికి మళ్లీ పదవులు ఇవ్వొద్దనే విషయాన్ని తెర మీదికి తీసుకువచ్చి ఢిల్లీ స్థాయికి ఫిర్యాదు చేస్తున్నట్టు తెలిసింది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నేతల్లో చాలామంది రాజ్యసభ సీటు కోసం తమ పేరును పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నారని, ఇందుకు వంశీచంద్‌ను సాకుగా చూపుతున్నారని ప్రియాంకగాంధీ దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలిసింది.
సింఘ్వీ, వంశీచంద్‌రెడ్డి, వేం నరేందర్‌రెడ్డి పేర్లు వినిపిస్తుండటంతో అసలు కాంగ్రెస్ నేతలు తీవ్ర నిరాశలో మునిగిపోయినట్టు విశ్వసనీయంగా తెలిసింది. వాస్తవానికి రాజ్యసభ సీటు కోసం అసలు కాంగ్రెస్ నేతలు ఈరవత్రి అనిల్, జీవన్‌రెడ్డి, వీ హన్మంతరావు, కుసుమకుమార్, రైతు కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి, మధుయాష్కి, నేరెళ్ల శారద, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల నుంచి బెల్లయ్య నాయక్, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్, దొమ్మాటి సాంబయ్య, మైనారిటీ కోటాలో షబ్బీర్ అలీ, అజ్మతుల్లా హుస్సేన్ తదితరులు ప్రయత్నాలు చేశారు. కానీ వలస కాంగ్రెస్ నేతలతో పోటీపడలేక వారంతా వెనుకబడిపోయారని, చివరికి రిక్తహస్తం మిగిలిందని కాంగ్రెస్‌లో చర్చ జరుగుతున్నది.