జమ్మికుంట, మార్చి 1: కరీంనగర్-పెద్దపల్లి జిల్లాలను కలుపుతూ మానేరు నదిపై తనుగుల వద్ద 2022లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.19 కోట్లతో నిర్మించిన చెక్‌డ్యామ్ కూలి మూడు నెలలు గడిచినా దర్యాప్తు ముందుకు సాగడంలేదు. గతేడాది నవంబర్ 21న రాత్రి చెక్ డ్యామ్ కూలిపోయిన విషయం తెలిసిందే. బాంబులు పెట్టి మరీ కూల్చివేశారని, ఇసుక మాఫియా ‘హస్తం’ ఉందని ఆరోపణలు వెల్లువెత్తడంతో పెద్దపల్లి ఇరిగేషన్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించారు. ‘చెక్‌డ్యామ్‌ను గుర్తు తెలియని దుండగులు పేల్చివేశారు’ అంటూ ఘటన జరిగిన మరుసటి రోజే కాల్వశ్రీరాంపూర్ డీఈ రవి జమ్మికుంట ఠాణాలో ఫిర్యాదు చేశారు. పట్టణ సీఐ రామకృష్ణ కేసు నమోదు చేసి, ఫోరెన్సిక్ విభాగానికి అప్పగించారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఆధ్వర్యంలో మాజీ మంత్రి హరీశ్‌రావు, తదితరులు చెక్‌డ్యామ్ వద్దకు వచ్చి పక్కాగా ‘ఇది కూల్చివేతనే’ అంటూ నిర్ధారణకు వచ్చారు. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్, నిజనిర్ధారణ కమిటీ ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించి ముమ్మాటికీ చెక్‌డ్యామ్ పేల్చివేతనే..! అంటూ నివేదికలిచ్చారు.
కూల్చివేతలో ఇసుకాసురుల ‘హస్తం’పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చెక్‌డ్యామ్ కూల్చివేత కేసుపై పోలీసు అధికారులు, కాంగ్రెస్ నాయకులు భిన్నంగా మాట్లాడారు. చెక్‌డ్యామ్ పేల్చివేతా..? నాణ్యతా లోపమా..? నీటి ఒత్తిడికి కూలిపోయిందా..? అనే విషయాలను వెలుగులోకి తెచ్చేందుకు ఫోరెన్సిక్ నిపుణుల బృందం రంగంలో దిగింది. ఘటనా స్థలంలో వివరాలు, ఆధారాలు సేకరించి వెళ్లిపోయారు. నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పుకొచ్చారు. ఇది జరిగి 96 రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు ఫోరెన్సిక్ నివేదిక రాలేదు. ఇన్నాళ్లూ తాగు, సాగు నీటి అవసరాలు తీర్చిన చెక్‌డ్యామ్ కూలిపోవడంతో చుక్క నీరు నిల్వ లేక, మానేరు ఎడారిగా మారుతుండగా ప్రజలు, రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా దర్యాప్తు ముమ్మరం చేసి కూల్చివేత బాధ్యులపై చర్యలు తీసుకోవడమే కాకుండా, కూలిపోయిన స్థానంలో కొత్తది నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇరిగేషన్ డీఈని వివరణ కోరగా.. ఫోరెన్సిక్ నివేదిక రా లేదని, కూలిపోయిన డ్యామ్ స్థానంలో కొత్త ప్రతిపాదలేవీ లేవని చెప్పుకొచ్చారు. ఫోరెన్సిక్ నివేదిక రాలేదని పట్టణ సీఐ రామకృష్ణ సైతం పేర్కొన్నారు.