ఆధునిక సాంకేతిక యుగంలో స్మార్ట్‌ఫోన్ ఒక అనివార్యమైన భాగమైపోయింది. అయితే, ఇదే స్మార్ట్‌ఫోన్ మనల్ని మానసికంగా ఎంతగా
బానిసలను చేస్తుందంటే అది చేతిలో లేకపోతే పిచ్చిపట్టినట్లు అయిపోతుంది. ఈ తీవ్రమైన మానసిక ఆందోళననే నోమో ఫోబియా అని పిలుస్తారు.
ఈ మానసిక రుగ్మత లక్షణాలు, చికిత్సా విధానాల గురించి తెలుసుకుందాం.నో మొబైల్ ఫోన్, ఫోబియా అనే పదాల కలయికే ‘నోమో ఫోబియా’. మొబైల్ ఫోన్ అందుబాటులో లేకపోయినా, సిగ్నల్ సరిగ్గా లేకపోయినా, లేదా చార్జింగ్ అయిపోయినా ఒక వ్యక్తిలో కలిగే విపరీతమైన భయం, ఆందోళన, ఒత్తిడిని ఈ పేరుతో పిలుస్తారు.
లక్షణాలు ఇవీ..
మన చుట్టూ ఉండే వ్యక్తులలో కొన్ని ప్రవర్తనలు కనిపిస్తే వారు నోమోఫోబియాతో బాధపడుతున్నట్లు అర్థం చేసుకోవచ్చు.
నిరంతరం స్క్రీన్ వీక్షణ: ప్రతి రెండు నిమిషాలకూ ఎటువంటి మెసేజ్ లేదా నోటిఫికేషన్ రాకపోయినా ఫోన్ స్క్రీన్‌ను అన్‌లాక్ చేసి చూడటం.
ఫాంటమ్ వైబ్రేషన్: జేబులో ఉన్న ఫోన్ మోగకపోయినా లేదా వైబ్రేట్ కాకపోయినా ఏదో నోటిఫికేషన్ వచ్చినట్లు భ్రమపడి పదే పదే జేబులు తడుముకోవడం.
ఆందోళన.. కోపం: అనుకోకుండా ఫోన్ ఇంట్లో మర్చిపోతే లేదా చార్జింగ్ అయిపోతే చేతులు వణకడం, గుండె వేగం పెరగడం, తీవ్రమైన కోపానికి లోనుకావడం.అతి జాగ్రత్తలు: వాష్ రూమ్‌కు వెళ్లినా, స్నానానికి వెళ్లినా ఫోన్ వెంట తీసుకెళ్లడం. నిద్రపోయేటప్పుడు కూడా ఫోన్‌ను దిండు కిందే పెట్టుకోవడం.సామాజిక దూరం: పక్కన ప్రాణ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు ఉన్నప్పటికీ, వారితో మాట్లాడకుండా ఫోన్లోనే మునిగిపోవడం.
ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్: సోషల్ మీడియాలో ఇతరులు ఏమి పోస్ట్ చేస్తున్నారో క్షణక్షణం తెలుసుకోకపోతే తాము వెనుకబడిపోతామనే భయం.
చేటు ఇలా..ఈ రుగ్మత కేవలం మానసిక ప్రశాంతతను మాత్రమే కాదు, శారీరక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. మొబైల్ స్క్రీన్ నుంచి వచ్చే బ్లూ లైట్ వల్ల నిద్రను ప్రేరేపించే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. చదువుపై, ఉద్యోగ బాధ్యతలపై శ్రద్ధ పెట్టలేరు. కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడపలేకపోవడంతో బంధాలు బలహీనపడతాయి.
నివారణా మార్గాలు..
నోమోఫోబియా ఒక అలవాటుగా మొదలై క్రమంగా వ్యసనంగా మారుతుంది. దీనిని అధిగమించడానికి వైద్య, వ్యక్తిగత స్థాయిలో కింది పద్ధతులు ఎంతో ఉపయోగపడతాయి.
1. బిహేవియరల్ థెరపీ
ఒక ప్రొఫెషనల్ థెరపిస్ట్ సహాయంతో ఆలోచనా విధానంలో మార్పులు తీసుకురావడం.
‘నా దగ్గర ఫోన్ లేకపోయినా నా జీవితం ఆగిపోదు, నేను సురక్షితంగానే ఉన్నాను’ అనే భావనను మనసులో దృఢపరుచుకోవడానికి ఈ థెరపీ తోడ్పడుతుంది.
2. డిజిటల్ డిటాక్స్
వారంలో కనీసం ఒక రోజు లేదా రోజులో కొన్ని గంటల పాటు (ఉదాహరణకు రాత్రి 9 గంటల తర్వాత) ఫోన్‌ను పూర్తిగా స్విచ్ఛాఫ్ చేయడం లేదా వేరే గదిలో ఉంచడం అలవాటు చేసుకోవాలి.
3. స్క్రీన్ ఫ్రీ జోన్స్
ఇంట్లో కొన్ని ప్రాంతాలను ఫోన్ రహిత ప్రాంతాలుగా ప్రకటించాలి. భోజనం చేసేటప్పుడు ఎవరి చేతిలోనూ ఫోన్ ఉండకూడదు. పడుకునే గదిలోకి ఫోన్‌ను అనుమతించకపోవడం అత్యుత్తమం. అలారం కోసం పాతకాలపు అలారం గడియారాన్ని ఉపయోగించాలి.
4. నోటిఫికేషన్లు నిలిపివేయడం
అనవసరమైన యాప్స్ నోటిఫికేషన్లను ఆఫ్ చేయడం వల్ల ఫోన్‌ను పదే పదే చూడాలనే కోరిక తగ్గుతుంది. అలాగే ఫోన్ స్క్రీన్‌ను గ్రే-స్కేల్ (బ్లాక్ అండ్ వైట్) మోడ్‌లో ఉంచడం వల్ల ఫోన్ చూడాలనే ఆకర్షణ తగ్గుతుంది.
5. ప్రత్యామ్నాయ వ్యాపకాలు
ఫోన్ చూసే సమయాన్ని ఇతర సృజనాత్మక పనులకు కేటాయించాలి. పుస్తక పఠనం, పెయింటింగ్ లేదా తోటపని చేయడం. సాయంత్రం వేళల్లో స్నేహితులతో ప్రత్యక్షంగా కలిసి మాట్లాడటం, నడవడం. ధ్యానం ద్వారా వర్తమానంలో జీవించడం వంటివి అలవాటు చేసుకోవాలి.
సాంకేతికత అనేది మన అవసరాలను తీర్చడానికి ఏర్పడిన ఒక సాధనం మాత్రమే, అది మన జీవితాన్ని శాసించే యజమాని కాకూడదు. ఫోన్‌కు ఇచ్చే ప్రాధాన్యం కంటే, మన చుట్టూ ఉన్న మనుషులకు, మన మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడే ఈ డిజిటల్ మాయాజాలం నుంచి మనం బయటపడగలం. కనెక్ట్ కావడానికి ఫోన్ వాడుదాం. కానీ బంధాలను డిస్కనెక్ట్ చేసుకోకూడదు.
-బి. కృష్ణ, సీనియర్ సైకాలజిస్ట్
ఇగ్నిషియో చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్,
హైదరాబాద్, 99854 28261