కల్వకుర్తి, మార్చి 1 : యూరియా ఇవ్వడం చేతకాకపోతే పదవి నుంచి దిగిపోవాలని రైతులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మండిపడ్డారు. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలోని హైదరాబాద్ చౌరస్తాలో ఆదివారం యూరియా కోసం రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అవసరం మేరకు యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. వేల బస్తాల యూరియా అవసరం ఉన్న చోట వందల బస్తాలు ఏ మూలకు సరిపోతుందని ప్రశ్నించారు. యూరియా కొరతతో పంటల దిగుబడి తగ్గితే రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఏ ఒక్కరోజు కూడా ఎరువుల బస్తాల కోసం ఎదురు చూడలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక అరిగోస పడుతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. యాప్ విధానం కాకుండా పాత పద్ధతిలోనే యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. సీఐ నాగార్జున అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు.
ఇల్లంతకుంట రూరల్, మార్చి 1: తమ జీవితాలతో ఆడుకోవద్దని కాంగ్రెస్ సర్కార్‌కు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల రైతులు సూచించారు. రంగనాయకసాగర్ ఆర్డీ3 ఎల్ఎం 6 కెనాల్ నిర్మించాలని తంగళ్లపల్లి మండలం పెద్దలింగాపూర్ శివారులో చేపట్టిన దీక్ష ఆదివారం నాటికి 20వ రోజుకు చేరుకున్నది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ సర్కార్ తీరుపై మండిపడ్డారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హామీ ఇచ్చి ఏడాది దాటినా అమలుకు నోచుకోలేదని విమర్శించారు. ఈ కెనాల్ నిర్మిస్తే ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలాల్లోని 12 గ్రామాల పరిధిలో 10వేల ఎకరాల భూములకు సాగునీరు అందుతుందని చెప్పారు. తలాపునే రంగనాయక, అన్నపూర్ణ, రిజర్వాయర్లు ఉన్నా నీళ్లందని దుస్థితి నెలకొన్నదని వాపోయారు. ఎమ్మెల్యే ఇచ్చిన హామీ మేరకు కాలువ నిర్మాణం చేయించాలని డిమాండ్ చేశారు. లేదంటే యాసంగి పంటలు ఎండిపోయి పశువులకు మేతగా మారుతాయని ఆందోళన వ్యక్తంచేశారు.